YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 26 September 2012

జగన్‌కో న్యాయం... మిగతావారికో న్యాయమా?

- ప్రతిపక్షంలో ఉన్న జగన్ కేసునెలా ప్రభావితం చేస్తారు?
- పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌లు ప్రభావితం చేయరా?
- ఏమిటీ ద్వంద్వ వైఖరి.. పక్షపాతం? 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సీబీఐ.. అదే కేసులో నిందితులుగా ఉన్న మంత్రుల విషయంలో పూర్తిగా పక్షపాత వైఖరి ప్రదర్శించిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉదంతంతో సీబీఐ కుట్ర బహిర్గతమైందన్నారు.

కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌లకన్నా ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ భావిస్తున్నదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘వైఎస్ అధికారంలో ఉండగా కొన్ని ఒప్పందాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయని, వాటి కారణంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో 26 జీవోలలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపిస్తూనే... ఎక్కడా అందుకు కారకులైన మంత్రులు, సెక్రటరీలను పేర్కొనలేదు. సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంతో గత్యంతరంలేక చార్జీషీట్లలో ఒకరిద్దరు మంత్రులు, కొందరు సెక్రటరీలను చేర్చింది. సీబీఐ దాఖలు చేసిన నాలుగవ చార్జిషీట్‌లో నలుగురికి తప్ప మిగతా 24 మందికి బెయిల్ లభించింది.

హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకొచ్చిన ప్రతీసారి సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ సీబీఐ అడ్డుపడుతోంది. ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, 25 ఏళ్లుగా సర్వీస్ నిర్వహిస్తున్న సెక్రటరీలు ఎలాంటి ప్రభావితం చేయరా? ఏనాడూ సచివాలయంలో అడుగుకూడా పెట్టని , ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎలా ప్రభావితం చేస్తారు? అది కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన 280 రోజులకు అరెస్టు చేసి ఈ వాదన చేస్తోంది. సీబీఐ పక్షపాత వైఖరికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ’’ అని దుయ్యబట్టారు. 

కేంద్రంలో కుంభకోణాలతో ప్రధానికి సంబంధంలేదని చెబుతూ.. రాష్ట్రంలో జారీ అయిన జీవోలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని బాధ్యుణ్ని చేయడం అన్యాయమని పద్మ విమర్శించారు. చనిపోయిన వ్యక్తిని కూడా బాధ్యుల్ని చేస్తూ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై రాష్ట్రంలో మూడోపార్టీ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నాయన్నారు. వీరి నాటకాన్ని గమనిస్తున్న ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=457998&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!