YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 27 September 2012

జగన్ ఆస్తుల కేసు కాదిది .వాన్‌పిక్‌ది వేరే కేసు

*హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకారం
*జడ్జిని సంతృప్తిపరచలేని రీతిలో సమాధానాలు
*నవయుగ చేరితే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటి?
*శరపరంపరంగా ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి
*బదులివ్వలేక ఆద్యంతం తడబడ్డసీబీఐ న్యాయవాది
*నిమ్మగడ్డ బెయిల్‌పై నేడూ కొనసాగనున్న విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో డొల్లతనం మరోసారి బయటపడింది. వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై గురువారం కొనసాగిన వాదనలు అందుకు వేదికయ్యాయి. వాన్‌పిక్ కేసుతో జగన్‌కు సంబంధం లేదని బుధవారం వాదనల సందర్భంగా సీబీఐ న్యాయవాది కేశవరావు హైకోర్టుకు వెల్లడించడం తెలిసిందే. గురువారం నాటి విచారణలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ప్రసాద్‌పై దాఖలు చేసిన కేసు జగన్ ఆస్తుల కేసులో భాగమేనా అని న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ప్రశ్నించగా, ‘కాదు, ఇది వేరే కేసు’ అని సీబీఐ న్యాయవాది చెప్పారు! కేసుకు సంబంధించిన వాదనలు కూడా ఆసక్తికరంగా కొనసాగాయి. 

సీబీఐ విచారణ తీరుపై న్యాయమూర్తి శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు కేశవరావు సరైన సమాధానాలివ్వలేకపోయారు. దాంతో, ‘కోర్టుకున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అడిగిన ప్రతి ప్రశ్నకూ బదులివ్వాలి’ అంటూ సీబీఐ న్యాయవాదిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాన్‌పిక్ ఒప్పందాలకు సంబంధించి చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పేందుకు ఆయన ప్రయత్నించడంతో, కోర్టు సమయాన్ని వృథా చేయరాదని స్పష్టంగా చెప్పారు. సీబీఐ వాదనలపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చేందుకు వీలుగా తదుపరి వాదనల నిమిత్తం విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం నాటి వాదనల ముఖ్యాంశాలివీ...

ప్రభుత్వానికి నష్టమేంటి ?

వాన్‌పిక్ ప్రాజెక్టులోకి కొత్త భాగస్వామిగా నవయుగ కంపెనీ చేరడం ద్వారా ప్రభుత్వాదాయానికి వచ్చిన నష్టమేంటని సీబీఐ న్యాయవాది కేశవరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందానికి లోబడే ఏ భాగస్వామ్య ఒప్పందాలైనా జరుగుతాయి తప్ప దాన్ని ఉల్లంఘించలేవు కదా అని అభిప్రాయపడ్డారు. దానికి కేశవరావు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ‘‘రాక్ సీఈవోకు నోటీసులిచ్చామని చెప్పారు. ఎప్పుడిచ్చారు ? వారి నుంచి వచ్చిన స్పందనేమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేశాక ఇటీవలే కొన్ని వారాల కింద నోటీసులిచ్చామని కేశవరావు బదులిచ్చారు. వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని తెలిపారు. వాన్‌పిక్ కేసులో ఎక్కువ మంది సాక్షులు వాన్‌పిక్ ఉద్యోగులేనని, నిమ్మగడ్డకు బెయిలిస్తే వారిని ప్రభావితం చేసే ఆస్కారముందని పేర్కొన్నారు. దాంతో, సాక్షుల్లో వాన్‌పిక్ ఉద్యోగులు ఎందరున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, తన దగ్గర సమాచారం లేదంటూ దాటవేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. వాన్‌పిక్‌పై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని కేశవరావు నివేదించగా, దేనిపై దర్యాప్తు కొనసాగుతోందో స్పష్టం చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇందూ ప్రాజెక్టుతో పాటు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ సెంటర్‌కు భూ కేటాయింపుల వ్యవహారంపై కొనసాగుతోందని కేశవరావు వివరణ ఇచ్చారు. ‘వాన్‌పిక్ అంటే ఓడరేవులకు సంబంధించిన వ్యవహారం కదా! అనంతపురం జిల్లాలో భూముల వ్యవహారంతో ఈ కేసుకేం సంబంధం?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మైటాస్ కంపెనీకి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.120 కోట్ల రోడ్డు పనులను నామినేషన్ పద్ధతిన ఇచ్చారని, దానిపైనా దర్యాప్తు చేయాల్సి ఉందని కేశవరావు చెప్పగా, ‘మైటాస్ పాత్ర చిన్నదే కదా’ అని అన్నారు.

సాక్షులు 10 మందే: నిమ్మగడ్డ న్యాయవాది

వాన్‌పిక్‌కు చెందిన ఉద్యోగులు 10 మందే సాక్షులుగా ఉన్నారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి వాంగ్మూలాలను గత మార్చిలోనే సీబీఐ నమోదు చేయించిందన్నారు. ‘‘సాక్షుల్లో ప్రభుత్వోద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. ఒప్పందాలకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ ఇప్పటికే చార్జిషీట్‌తోపాటు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఆధారాలను మాయం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సాక్షులను ప్రభావితం చేస్తారనేందుకు సీబీఐ చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోతోంది. కేవలం యాంత్రికంగా మాత్రమే అభ్యంతరం తెలుపుతోంది. వాన్‌పిక్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి పైసా పెట్టుబడి లేదు. రాయితీ ఒప్పందంపైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అభ్యంతరం లేదు. రూ.17 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాన్‌పిక్ ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. సీబీఐ కేసుతో ప్రాజెక్టు అభివృద్ధి ఆగిపోయింది. లీజుకిచ్చిన ప్రాంతంలో విద్యుత్ కంపెనీలు ప్రారంభమై ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండేది కాదు. ప్రస్తుతం రూ.11కు కొనుగోలు చేస్తున్న కరెంటు రూ.3కే వచ్చేది’’ అని ఆయన నివేదించారు.


http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458681&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!