హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ముస్లిం మత గురువుల సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ లౌకిక పార్టీ అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై పలువురు ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో మతతత్వ బీజేపీతో టీడీపీ చేతులు కలిపిన ఉదంతాన్ని ముస్లింలు నేటికీ మరచిపోలేకపోతున్నారని వార న్నారు. దేశంలో ముస్లింల స్థితిగతులపై టీడీపీ బుధవారం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో ముస్లిం మత గురువులు, ముఫ్తీలు, ఉలేమాలు, పలు ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ లౌకిక పార్టీగా ఆవిర్భవించిందని, గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. బీజేపీతో మళ్లీ చేతులు కలపబోమన్నారు. అయితే, గతంలో బీజేపీతో చేసిన దోస్తీ సంగతేంటని పలువురు ఉలేమాలు, మత గురువులు, ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. ఇకపై మతతత్వ శక్తులకు మద్దతిస్తే ముస్లింలు టీడీపీని ఎన్నటికీ నమ్మరని సున్నీ ఉలేమా బోర్డు అధ్యక్షుడు హసనుద్దీన్ అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తమను కలవడానికి కూడా ఇష్టపడని చంద్రబాబుకు ఇప్పుడు తమ అవసరమొచ్చిందా అంటూ మరికొందరు ప్రశ్నించారు.
కాగా, తమకు చంద్రబాబు కాకుండా పార్టీ నేతలు ఆహ్వానం పలకడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ముస్లింల ప్రధాన మత గురువు (అమీరే షరియత్ ) మౌలానా షా జమాలూర్ రెహమాన్, జామియా నిజామియా విద్యాలయం పీఠాధిపతి ముఫ్తీ ఖలీల్ అహ్మద్, ప్రముఖ మత గురువు కాజీం పాషా ఖాద్రీ, కుబుల్ పాషా షుత్తారీ, సిద్దిక్ హసన్ ఆరీఫ్ ఖాద్రీ, హైదర్ అలీ హుస్సేనీ వంటి ప్రముఖ మత పెద్దలు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
No comments:
Post a Comment