కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న నీచమైన రాజకీయాల్లో సీబీఐ పావుగా మారి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 జీవోలకు సంబంధించిన కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌ల కన్నా.. ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారో సీబీఐ ప్రజలకు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో మంత్రులు, అధికారులకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు మరో న్యాయమా.. అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ తీరును ఎండగట్టారు. ‘‘ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తిస్తున్న ధర్మాన ప్రసాదరావు, 25 మంది అధికారులు సాక్షుల్ని ప్రభావితం చేయరట! ప్రతిపక్షంలో ఉండి నిరంతరం రోజుకు 16 గంటలు జనం మధ్య తిరిగే వ్యక్తి ప్రభావితం చేస్తారట! అది కూడా చార్జ్జిషీట్ ఫైల్ చేసి 280 రోజులైన తర్వాత. అన్యాయంగా, అక్రమంగా జైల్లో బంధించి ఇప్పటికి 123 రోజులు పూర్తయినా సీబీఐ ఇలాంటి అర్థంపర్థంలేని విషపూరిత వాదనలు ఇంకా చేస్తోంది’ అని దుయ్యబట్టారు. ‘ఒకే కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో సీబీఐ కొందరిని అరెస్టు చేసి మిగతావారిని ఎందుకు చేయడం లేదు? కేవలం జగన్‌ను అరెస్టు చేయడానికే మోపిదేవిని అరెస్టు చేశారా?’ అని ప్రశ్నించారు.
‘భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత మామూలుగానైతే 60 రోజులకు, లేదా 90 రోజులకు కచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ తన వంకరవాదనను కొనసాగిస్తోంది’ అని మండిపడ్డారు. వాన్‌పిక్ కేసులో సీబీఐ నాటకం బయటపడిందని, భూకేటాయింపుల్లో జగన్ ప్రమేయం లేదంటూ తప్పని పరిస్థితుల్లో హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకరించారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రజల దీవెనలు, అభిమానం, దేవుని ఆశీస్సులతో అక్టోబర్ 5న జగన్ తప్పక బయటకొస్తారని అంబటి పేర్కొన్నారు.
source:sakshi
No comments:
Post a Comment