తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు అధికారం మళ్లీ చేజిక్కించుకోవాలన్న ఆశ చావలేదు. కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తెలుసుకుంటున్నారు. వారు అమాయకులు కారు. ఆ విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబే గ్రహించలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు, అత్యంత ప్రజాదరణ గల యువకెరటం జగన్మోహన రెడ్డి ధాటికి తట్టుకోవడం కష్టం అని ఆయనకు తెలిసిపోయింది. జగన్ పట్ల వెల్లువెత్తిన ప్రజాభిమానంతో దిమ్మతిరిగిపోతోంది. 2010 డిసెంబర్ లో జగన్ వైఎస్ఆర్ సిపిను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఆ పార్టీదే విజయం. ఏ సర్వే జరిగినా ఆ పార్టీయే ముందంజలో ఉంటోంది. ఇటీవలే ఎన్‌డీటీవీ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్రంలో 48 శాతం మంది మద్దతు పలికారు. చంద్రబాబు పట్ల కేవలం 18 శాతం మంది, కేసీఆర్ పట్ల 17 శాతం మంది, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పట్ల 11 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో చివరి ప్రయత్నంగా చంద్రబాబు మరో ఎత్తు వేశారు. 'వస్తున్నా.. మీకోసం' అనే పేరుతో అక్టోబర్ 2 నుంచి జనవరి 26 వరకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిని ' బాబు ఆఖరిపోరాటం' అని కూడా అనేశారు.
చంద్రబాబు వేసే ప్రతి ఎత్తును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిస్సిగ్గుగా ఆయన వేసే వేషాలన్నీ స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఆయనకు అధికారంపై ధ్యాస తప్ప, ప్రజా సమస్యల పట్ల నిజాయితీ, చిత్తశుద్ధిలేదని స్పష్టమైపోయింది. ఆయన వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాభిమానం రోజురోజుకు సన్నగిల్లుతోంది. ఆ విషయం ఉప ఎన్నికలలో స్పష్టమైపోయింది.
అధికారంలో ఉండగా ఆయన వ్యవసాయం, రైతుల పట్ల వ్యవహరించిన తీరుతోనే ప్రజలకు ఆయనపై సగం గౌరవం తగ్గింది. ఆ తరువాత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల ముందు ప్రతిపక్ష నేతగా నిలవలేకపోయారు. ఆ మహానేత దుర్మరణం చెందిన తరువాత జగన్ పట్ల ఉప్పెనలా పెరుగుతున్న ప్రజాభిమానాన్ని ఎదుర్కోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. దానికితోడు ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా ఉండవలసిన సమయంలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడటంతో ఉన్న కాస్త గౌరవం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేసినా, ఏం చెప్పినా జనం నమ్మేస్థితిలేదు.
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరించే సమయంలో, కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో బలం తగ్గినప్పుడు, అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఉన్న సమయంలో చంద్రబాబు ప్రవేశపెట్టలేదు. మాజీ మంత్రి శంకర్రావు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడటానికి రెండు రోజుల ముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి. హోంమంత్రి చిదంబరంని రహస్యంగా కలిశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తన జోలికి రావద్దని ఆయన రహస్యంగా కోరినట్లు విమర్శలు వచ్చాయి. అందుకు ప్రతిగా రాష్ట్రంలో ప్రభుత్వానికి తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలను దెబ్బతీయడానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కును తారాస్థాయిలో కళ్లకు కట్టిన ఘట్టం ఉప ఎన్నికలు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయే అంతగా దిగజారిపోయారు. టిడిపి అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో కేవలం 6,256 ఓట్లు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 8,813 ఓట్లు మాత్రమే వచ్చాయి. టిడిపికి పోలైన ఈ ఓట్లతో కుమ్మక్కు విషయం తేటతెల్లమయింది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు స్పష్టంగా తెలియడంతో జనం అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో ఏకాంతంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రసంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన పీఎంతో జరిపిన రహస్య సమావేశం పలు అనుమానాలకు దారి తీసింది. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయం మొన్న శాసనసభ సమావేశాలలో టిడిపి సభ్యులు ప్రవర్తించిన తీరుతో పూర్తిగా అర్ధమైపోయింది. ప్రజలు, మిగిలిన విపక్షాల నేతలు దుమ్మెత్తి పోశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ప్రజాధరణను చూసి, అధికార దాహంతో ఆ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ కొట్టడానికి చంద్రబాబు అలవాటుపడిపోయారు.ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏం చేస్తే అది చేయడం మొదలు పెట్టారు. వారు ధర్నా చేస్తే ధర్నా, దీక్ష చేస్తే దీక్ష చేశారు. ప్రజలు స్పందించలేదు. ఆయన వేషాలు వారికి అర్ధమైపోయాయి. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వారు తప్పనిసరిగా స్పందిస్తారు. కానీ ఆయన కాపీ వేషాలు వారికి అర్ధం కావడంతో ఫలితం దక్కలేదు. ఈ పరిస్థితులలో ఇప్పుడు చివరి ప్రయత్నంగా మరో కాపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాక ముందు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, నేరుగా ప్రజలను కలుసుకునేందుకు 1600 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. అలాగే పాదయాత్ర చేసి ప్రజాభిమానాన్ని కొల్లగొట్టవచ్చని చంద్రబాబు భ్రమపడుతున్నారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 8 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు ప్రజల సమస్యలు, వారి కష్టాలు తెలియవా? అధికారంలో ఉండగా వ్యవసాయం దండగని, సబ్సిడీల వల్ల లాభం ఉండదనేది ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయాలే ఆయన కొంపముంచాయి. దాంతో రాష్ట్ర ప్రజలు ఆయనను అధికారంలో నుంచి లాగిపడేశారు. తన పాలనను ప్రజలకు గుర్తు చేయడానికి, వారిని చైతన్యపరచడానికి పాదయాత్ర చేయనున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. తన పాలనని తనే గుర్తు చేయవలసివచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రైతుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు గుర్తుకు వస్తే ప్రజలు నిరసనలు తెలిపే ప్రమాదం కూడా ఉంది. మహానేత డాక్టర్ వైఎస్ చనిపోయినా ఆయన ప్రవేశపెట్టిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఫీజు రీయింబర్స్ మెంట్ ............ వంటి పథకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. ఎందుకంటే వాటి ఫలితాలను వారు పొందారు. పాలనంటే అది. అటువంటి పాలనను ప్రజలకు మరొకరు గుర్తుచేయవలసిన అవసరం ఉండదు. ప్రజలు నిజాయితీపరులు. వాటిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఇక చైతన్యం విషయానికి వస్తే ఉప ఎన్నికలలో ప్రజలు తమ చైతన్యం చూపించి మట్టికరిపించారు.
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయారు. పూర్తిగా విఫలమయ్యారు. ఆయన రాజకీయ ఎత్తుగడలు ప్రజలకే కాదు, తమ నేతలకు కూడా రుచించలేదు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబం పట్ల ఆయన వ్యవహార శైలి కూడా పార్టీ నేతలకు నచ్చడంలేదు. పలువురు ఎమ్మెల్యేలు, అధిక సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు చివరి ఎత్తుగడైన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఫలించే అవకాశాలు కనిపించడంలేదు.
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=49662&Categoryid=28&subcatid=0
No comments:
Post a Comment