తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.
రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు.
చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు.
పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.
No comments:
Post a Comment