YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 28 September 2012

క్విడ్‌ప్రోకో అయితే లాభాలు ఎందుకు పంచుతారు?

క్విడ్‌ప్రోకో అయితే లాభాలు ఎందుకు పంచుతారు?
భారతిలో పెట్టుబడులకు రూ. 617 కోట్ల లాభాలు వచ్చాయి.. సాక్షిలో పెట్టుబడుల విలువ 
రూ. 600 కోట్లకుపైగానే ఉంటుంది
రాక్‌కు నోటీసులిచ్చినట్లు చార్జిషీట్‌లో చెప్పలేదు 
నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. వచ్చేనెల 8న తీర్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకు క్విడ్‌ప్రోకోతో సంబంధమే లేదని నిమ్మగడ్డ తరపు న్యాయవాది రాజశేఖర్‌రావు హైకోర్టుకు నివేదించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా జగన్ కంపెనీల్లో ప్రసాద్ 50 శాతం పెట్టుబడులు పెట్టారని వివరించారు. బెయిల్ కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ సముద్రాల గోవిందరాజులు శుక్రవారం మరోసారి విచారించారు. 

లాభాల కోసమే 2006 నుంచి 2010 వరకు జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని రాజశేఖర్‌రావు చెప్పారు. మొత్తం రూ.854 కోట్లు పెట్టుబడులు పెట్టారని, భారతీ సిమెంట్‌లో వాటాలను విక్రయించగా వచ్చిన లాభాల్లో రూ.617 కోట్లు నిమ్మగడ్డకు తిరిగి ఇచ్చేశారని తెలిపారు. సీబీఐ ఆరోపిస్తున్నట్లుగా ‘క్విడ్‌ప్రోకో’ జరిగి ఉంటే లాభాలను ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం సాక్షిలో రూ.230 కోట్లు పెట్టుబడిగా ఉన్నాయని, దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికల్లో సాక్షి ఏడో స్థానంలో ఉందని చెప్పారు. సాక్షిలో నిమ్మగడ్డకు రూ.600 కోట్లకుపైగా విలువ చేసే 20 శాతం వాటా ఉందని వివరించారు. లాభాల కోసం పెట్టిన పెట్టుబడులను కూడా సీబీఐ లంచం కింద చూపుతూ వాస్తవ విరుద్ధమైన, పొంతన లేని వాదనలను వినిపిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.

అపోహతోనే అరెస్టు చేసింది

రాక్ ప్రతినిధులుగా సీఈవో ఖతర్ మసూద్, జగన్నాథంలు వారికి వారే ప్రకటించుకున్నారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి క్రౌన్ యువరాజు వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మాత్రం సీబీఐ దాచి పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని చార్జిషీట్‌లో కూడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో మిగిలిన వారంతా బయటే ఉన్నారని, నిమ్మగడ్డను మాత్రం అరెస్టు చేశారన్నారు. కేసు నమోదు చేసినప్పటినుంచి దర్యాప్తును అడ్డుకున్నట్లుగానీ, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారనేందుకు చిన్న ఫిర్యాదు, ఆధారం కూడా సీబీఐ చూపలేదని, కేవలం అపోహతోనే అరెస్టు చేసిందని చెప్పారు. రాక్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఒప్పందం జరిగిందా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని.., దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

రైతులకు పరిహారం పంపిణీ విషయంలో సీబీఐ పొంతనలేని వాదన చేస్తోందన్నారు. మార్కెట్ ధర ప్రకారం జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన మేరకే వాన్‌పిక్ యాజమాన్యం రైతులకు పరిహారాన్ని పంపిణీ చేసిందన్నారు. వాన్‌పిక్‌పై సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పలేదని, రాక్‌కు నోటీసులు జారీచేసిన విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. తుది విచారణలో నిమ్మగడ్డ నిజమైన పెట్టుబడిదారుడని తేలితే ఇన్ని రోజులు జైల్లో ఉన్నందుకు ఆయనకు జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చగలరని ప్రశ్నించారు. నిమ్మగడ్డను అరెస్టు చేసి ఇప్పటికే 140 రోజులు దాటిందని, దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వచ్చేనెల 8కి వాయిదా వేశారు.

source: sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!