YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 27 September 2012

టీడీపీలో చిచ్చు

పార్టీకి, పదవికి బెరైడ్డి రాజశేఖరరెడ్డి రాజీనామా
బాబు పాదయాత్రను ప్రజలే అడ్డుకుంటారని హెచ్చరిక
బాబువి అస్తవ్యస్త నిర్ణయాలు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
ఆయన పాదయాత్రకు సహకరించబోనన్న ఎమ్మెల్యే
అవసరమైతే టీడీపీనే వీడతానని హెచ్చరిక
బాబు వల్లే పార్టీ భ్రష్టుపడుతోంది: ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి
వారిద్దరినీ సస్పెండ్ చేసే యోచనలో పార్టీ

హైదరాబాద్, న్యూస్‌లైన్:చంద్రబాబు నిర్ణయాలను నిరసిస్తూ టీడీపీలో ముసలం పుట్టింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బాబు లేఖ రాయడం, ఇతర ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలూ భగ్గుమంటున్నారు. బాబు వ్యవహార శైలిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లి), ఎన్.అమరనాథరెడ్డి (పలమనేరు) గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఏకంగా పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు! ‘వస్తున్నా మీకోసం’ పేరుతో అక్టోబర్ 2న నుంచి రాయలసీమలోని హిందూపూర్ నుంచి బాబు పాదయాత్ర ప్రారంభించనున్న తరుణంలో టీడీపీలో ఇలా చిచ్చు రగిలింది. పార్టీలో బాబు అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తున్నారంటూ ప్రవీణ్ దుయ్యబట్టారు.

బాబు వైఖరికి నిరసనగా ఆయన పాదయాత్రకు సహకరించబోమని ప్రకటించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు సైతం వెనకాడబోనని హెచ్చరించారు. అమరనాథరెడ్డి కూడా బాబు నిర్ణయాలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇక బెరైడ్డి అయితే బాబు చుట్టూ చక్కెర వ్యాధిగ్రస్తులు, ముసలీముతకా జమయ్యారంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వారి సలహాల ప్రకారం న డుచుకుంటున్న బాబు ఏ దశలో ఉన్నారో అయన్నే అడిగి తెలుసుకోవాలని విలేకరులకు సూచించారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బాబు నిర్ణయాలు: ప్రవీణ్

బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రధానికి లేఖ కూడా అందుకే రాశారని ఆరోపించారు. దాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీఎల్పీ కార్యాలయ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బాబు తన వ్యక్తిగత అహాన్ని తృప్తి పరచుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. పార్టీని అధోగతి పాలు చేశారు. వైఎస్ మరణానంతరం ఆయనపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. బాబు వ్యూహాత్మక తప్పిదం వల్లే టీడీపీ హీన స్థితికి చేరుకుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బాబు నిర్వీర్యం చేశారు. అంతా తానై పార్టీని భ్రష్టు పట్టించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర ప్రాంతాల నేతల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. మేం బాబు కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నాం. పార్టీ కంటే కూడా మా గ్రూపు, స్థానిక నేతలు, అనుచరుల వల్లే గెలిచాం. టికెటివ్వకపోతే స్వతంత్రంగా పోటీచేసిన చరిత్ర మాకుంది. 2009లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయగానే మమ్మల్ని బస్సుయాత్ర చేయాలంటూ ప్రోత్సహించిన బాబు ఇప్పుడు కేంద్రానికి లేఖ ఎలా ఇస్తారు? బాబు లేఖ అటు తెలంగాణ నేతలనూ సంతృప్తి పరచలేదు. 

ఇది పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రజలు తాము దైవాంశసంభూతునిగా భావించిన ఎన్టీఆర్, మంచి పథకాలతో పాలించాడనుకున్న వైఎస్సార్‌ల కంటే ఎక్కువకాలం పాలించే అవకాశాన్ని బాబు కు కల్పించారు. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరికాదు. పార్టీ విధానాల్ని ఎవరు ప్రశ్నించినా.. వేరే పార్టీలోకి వెళ్లేం దుకే అలా చేస్తున్నారంటూ విమర్శించడం పరిపాటైంది’’ అంటూ తూర్పారబట్టారు. బాబు పాదయాత్రకు తాను సహకరించబోనన్నారు. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన దశలో పాదయాత్ర చేసినా, ఇంకోటి చేసినా బాబును వారు నమ్మే పరిస్థితి లేదన్నారు.

పార్టీ వీడేందుకూ సిద్ధం: అమర్‌నాథరెడ్డి

సమైక్యాంధ్రకే తాను కట్టుబడి ఉన్నానని అమరనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అవసరమైతే పార్టీని వీడేందుకూ వెనుకాడబోనని ప్రకటించారు. గురువారం ఆయన పలమనేరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రాంతాలవారీగా విడిపోవాల్సి వచ్చింది. అనంతర పరిణామాల్లో రాజీనామాలు చేసి బయటికొచ్చిన ఎమ్మెల్యేల్లో నేను మొదటి వాడిని. తెలంగాణ విషయంలో 2009 నుంచీ బాబు అనుసరిస్తూ వచ్చిన వైఖరి వల్ల సీమాంధ్రల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దాంతో అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తూ వస్తోంది. 

ఆ పర్యవసానంగానే తాజా ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా మేం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది’’ అన్నారు. ఎవరూ అడగకుండానే లేఖ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని బాబును అమర్‌నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన నిర్ణయాలు పార్టీకి తీవ్రనష్టాన్ని చేకూరుస్తున్నాయన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిందీ, తేవాల్సిందీ కాంగ్రెసే అయినప్పుడు బాబు లేఖతో పనేముందని ప్రశ్నించారు. దాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు రాజ్యాంగపరంగా సంక్రమించిన ఓటేసే హక్కును కూడా కాలరాసేలా బాబు వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. ‘నా భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నడచుకుంటా’నని పేర్కొన్నారు.

ఇప్పుడే క్రమశిక్షణ చర్యలొద్దంటున్న బాబు

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి విమర్శలు గుప్పించిన నేతలపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని టీడీపీ నేతలకు బాబు సూచించారు. పాదయాత్రను సీమలో ప్రారంభిస్తున్న తరుణంలో అక్కడి నేతలపై చర్యలు తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కాబట్టి రెండుమూడు రోజులు వేచిచూద్దామని పార్టీ ముఖ్యులకు చెప్పినట్టు సమాచారం. షోకాజ్ ఇచ్చి, ఏమని బదులిస్తారో చూడా లని యోచిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు గురువారం టీడీఎల్పీలో సమావేశమై, బాబు లేఖను స్వాగతించారు.

‘చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణోడా’ అన్నట్టుంది: బెరైడ్డి

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే, ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి ‘చెయ్యెత్తి జై కొట్టు తెలంగాణోడా’ అన్నట్టుగా ఉందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. సమితి ముఖ్య సమన్వయకర్త తమ్మడపల్లి విజయ్‌రాజ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానికి రాసిన లేఖలో రాయలసీమ గురించి బాబు ప్రస్తావించకపోవటాన్ని తప్పుబట్టారు. ‘‘ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాస్తే సీమ గురించి కూడా అందులో ప్రస్తావించాలని నేను బాబుకు రాసిన లేఖలో కోరాను. నా లేఖను బుట్టదాఖలు చేశారు. సీమంటే అంత చులకనెందుకు? మా ప్రాంతమంటే లెక్కలేనితనం కనబడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ప్రధానికి బాబు లేఖ రాయడానికి నిరసనగానే టీడీపీతో 19 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నానని చెప్పారు. 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం ఒకవేళ చెప్పినా తాము మాత్రం ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడతామన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 దాకా వెయ్యి కిలోమీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని బెరైడ్డి చెప్పారు. ‘‘యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుంది’’ అని వెల్లడించారు. తాను యాత్రను ప్రకటించాకే బాబు కూడా యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ‘‘సీమకు అన్యాయం చేసేలా వ్యవహరించిన బాబు యాత్రను మేం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే అడ్డుకుంటారు’’ అన్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458764&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!