YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 24 September 2012

ఆ పండుగ కోసం ఎదురుచూపులు.. జగన్ కోసం - 8 (పాఠకుల స్పందన) sakshi

25 మే, 2012 - సిబిఐ విచారణకు వైయస్ జగన్ హాజరైన మొదటిరోజు. విచారణ అనంతరం సాయంత్రం జగన్ దిల్‌ఖుషా గెస్ట్‌హౌస్ నుంచి బయటకు రాగానే ఊపిరిపీల్చుకున్నాను. అంతకుముందు రోజు మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారు. జగన్‌ను కూడా అరెస్టు చేస్తారేమోనని నా భయం. రెండవరోజు కూడా విచారణ అనంతరం జగన్ బయటకు వచ్చారు. జగన్‌ను అరెస్టు చేయరని ఒక నమ్మకం. కాని 27 మే సాయంత్రం 6 గంటలు దాటినా ప్రతిరోజులా జగన్ దిల్‌ఖుషా నుంచి బయటకు రాలేదు. 

మనసులో తీవ్ర అలజడి. జరగకూడనిదేదో జరుగుతోంది అనిపిస్తుండగా సిబిఐ జగన్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. తీవ్ర ఆవేదన, పట్టరాని కోపం, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ముమ్మాటికీ జగన్‌ది అక్రమ అరెస్టే. ప్రజలకోసం ఏ త్యాగానికైనా వెనుకాడని జగన్‌ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించింది. జగన్ అరెస్టుతో రాజశేఖరరెడ్డిని జగన్‌లో చూసుకుని, మళ్లీ మంచిరోజులు మాకు వస్తాయి అనుకునే వారిలోని ఆవేదన వర్ణనాతీతం. కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగితే... ఎవరు, ఏమిటి అని చూడకుండా అక్రమ కేసులను సిబిఐ ద్వారా బనాయించి, అరెస్టు చేయించి, రాక్షసానందాన్ని పొందే కిరణ్, బొత్స, శంకర్రావు, విహెచ్ లాంటి వారికి మాత్రం సంతోషం.

ఒకటి మాత్రం నిజం - రాజశేఖరరెడ్డి మరణం తరువాత ప్రజలకోసం పనిచేస్తున్న నాయకుడెవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక్క వైయస్ జగన్ మాత్రమే. ఇంతటి ప్రజానాయకుణ్ణి, ప్రజాసేవకై పరితపించేవాడిని అరెస్టు చేయించటం బహుశా ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలని కోరుకునే వారి దురదృష్టం. ముందుచూపు లేని నాయకులు, ప్రభుత్వాలు ఉన్న ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలనలో ఇంకెన్ని అరెస్టులు, ఇంకెన్ని అన్యాయాలు, అక్రమాలు చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది. అత్యంత విశ్వసనీయత, ప్రజాదరణ కలిగిన వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ అరెస్టును నేను జీర్ణించుకోలేకపోతున్నాను. బహుశా జగన్ అక్రమ అరెస్టుకు సిబిఐ, కాంగ్రెస్ ఈ కింది కారణాలు చెబితే బాగుండేదేమో -

కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల కుమారుల లాగా జగన్‌మోహన్‌రెడ్డి మిగిలిపోకుండా తండ్రి ఆశయాలను పూర్తి చేయాలనుకోవడం.

మనను నమ్మినవాళ్లకోసం ఏం చెయ్యటానికైనా వెనుకాడని రాజశేఖరరెడ్డి కొడుకుగా తండ్రి మరణవార్త విని తనువు చాలించిన కుటుంబాలను ఓదార్చాలన్న సంప్రదాయాన్ని అనుసరించి ఓదార్పు యాత్ర చేయడం.

ఎల్లో జర్నలిజంపై తండ్రి లాగానే తాను కూడా ఒకే విధానాన్ని పాటించడం.

వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వైఖరి గుర్తించి వాస్తవాలను జీర్ణించుకోలేకపోవడం, పార్టీకి ఎదురు తిరగడం.

తండ్రిలాగానే... విశ్వసనీయత, విలువలు, నిబద్ధత కలిగి వుండడం.

రాజశేఖరరెడ్డికి ముందు వున్న కాంగ్రెస్‌ను, రాజశేఖరరెడ్డి ఉన్న కాంగ్రెస్‌ను, రాజశేఖరరెడ్డి లేని కాంగ్రెస్‌ను చూశాం, చూస్తున్నాం. కాంగ్రెస్ తీరింతే.. ఎప్పటికీ మారదు. ఒకటి మాత్రం నిజం. ప్రజా మద్దతులేని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ మనుగడ సాగించలేడన్నది వాస్తవం. అత్యంత ప్రజాభిమానం ఉన్న నాయకుణ్ణి ఎవరూ శాశ్వతంగా ఏమీ చేయలేరు. ఏమైనా చేస్తే, చేయగలిగితే అది తాత్కాలికమే. రంజాన్, దసరా, క్రిస్‌మస్... వీటికన్నా ప్రజలు జగన్ విడుదల అనే పండగ కోసం ఎదురుచూస్తున్నారు. మా అందరి కోర్కె మనస్ఫూర్తిగా నెరవేరాలంటూ కోరుకుంటున్నాను.
- ఆర్‌కె (లెక్చరర్), పోతుమీద, కోడూరు మం, కృష్ణా జిల్లా

సగటు మనుషుల పోరాట యోధుడు
గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనేక కష్టాలు పడ్డారు. తాను ఆర్థికంగా చితికిపోతూ కూడా కాంగ్రెస్‌పార్టీని బతికించడమేగాక ప్రతిపక్ష స్థానంలో వుండి అనేక పోరాటాలు చేశారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. దీనికి ప్రతిఫలంగా కాంగ్రెస్‌పార్టీ ఆ నాయకుని కుటుంబానికి చేస్తున్నది ఏమిటి? ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ అరెస్ట్‌ను ఖండించడానికి గానీ, జగన్ అరెస్ట్ విషయమై విజయమ్మ కుటుంబానికి కనీసం సానుభూతి చూపడానికి కూడా ప్రయత్నించలేదంటే వారిని ఏమనాలి? ఎన్‌టిఆర్‌ను వేదనకు గురిచేసి వెన్నుపోటుదారునిగా పేరు మూటకట్టుకున్న చంద్రబాబులాగ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేదనకు గురిచేసి జగన్‌ను జైలు పాలు చేసిన వీరిని ‘‘నయా వెన్నుపోటుదారులు’’ అనవచ్చా? అందుకే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు 2014 తర్వాత జగన్‌కు ఎదురుపడి ముఖం చూపించడానికి కూడా ధైర్యం లేక విదేశాలలో స్థిరపడటానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

చేతిలో లక్షరూపాయలు ఉంటేనే యువత ఎన్నో వ్యసనాలకు బానిసలవుతున్న నేటికాలంలో ముఖ్యమంత్రి కుమారుడై వుండి, యువ పారిశ్రామికవేత్తగా పేరుతెచ్చుకున్న వై.ఎస్.జగన్ విలాసాలకు దూరంగా, ప్రతి మనిషికి వుండే చిన్న చిన్న కోరికలను కూడా వదులుకుని, తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి, ప్రజల కొరకు, ప్రజల మధ్య నిరంతరం ఉంటూ, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాడు. అతనినా వేలెత్తి చూపించేది?

నెల్సన్ మండేలా, ఆంగ్‌సాన్‌సూకీ... వంటి నేతలు ఆ దేశ ప్రజల పక్షాన నిలిచి పోరాడినప్పుడు అక్కడి ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టి అనేక వేధింపులకు గురిచేసినా కాలం గడిచినకొద్దీ ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం, పోరాట పటిమలతో వారు ప్రపంచాన్ని కదిలించారు. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వాలు కూడా అదే విధానం కొనసాగిస్తూ అక్రమ అరెస్ట్‌లు, బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ మండేలా, ఆంగ్‌సాన్‌సూకీ వంటి నేతలకు ఏ మాత్రం తీసిపోకుండా దేవుని ఆశీస్సులతో ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దల కుతంత్రాలను జగన్ ధైర్యంగా ఎదుర్కొంటున్న తీరు మనం చూస్తున్నాం. 

వైఎస్‌ఆర్‌సిపి ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారంటూ కొత్తగా కట్టుకథలు అల్లుతూ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు చనిపోయినప్పటి నుండి వారి కుటుంబాన్ని అష్టకష్టాలపాలు చేసి, వైఎస్‌ఆర్‌ని అవినీతిపరుడిగా చిత్రీకరించి జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడమేకాక, జగన్‌ను ఒంటరిని చేసి, నాలుగు నెలలుగా జైలులో ఉండటానికి కారణమైన కాంగ్రెస్‌లో విలీనం అంటే ఆత్మహత్యాసదృశ్యం కాక మరొకటి కాదు. అసలు వైఎస్‌ఆర్‌సిపి పార్టీ పుట్టిందే ప్రజలు, కార్యకర్తల అనుమతితో. అటువంటి వైఎస్‌ఆర్‌సిపిని ప్రజల, కార్యకర్తల అనుమతి లేనిదే జగన్ కూడా ఎందులోనూ విలీనం చేయలేరు. 

నిజానికి జగన్ ఏ నేరం చేయలేదని, 2014లో వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభం, వర్తకుల ఆందోళన, వ్యవసాయ సంక్షోభం వంటి అనేక సమస్యలను పరిష్కరించగలడని, పోలీసు వ్యవస్థను పటిష్టపరిచి దొంగతనాలను, చైన్ స్నాచింగ్‌లను, వరకట్న చావులను ఉక్కుపాదంతో అణిచివేయగలడని, మహిళలు, వృద్ధుల సమస్యలు తీర్చగలడని ప్రజలంతా వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

- ఆర్.కె.ఆర్, (ఊరిపేరు రాయలేదు)

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!