YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 24 September 2012

ఇదంతా పథకం తప్ప మరేమీ కాదు... జగన్ కోసం - 6 (పాఠకుల స్పందన)sakshi

చంద్రబాబు నాయుడు హయాంలో పడిన కష్టాలను ప్రజలు మర్చిపోలేదు. వర్షాలు పడక కరువు సంభవించి జనం అల్లాడారు. ఎన్నో కుంభకోణాలు చూశారు. కరెంటు చార్జీలు ఆర్టీసి చార్జీల పెంపు అనేకసార్లు భరించారు. ఈ బాధల నుంచి విముక్తి చేయడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చారు. ఆయన పాదయాత్రతో ప్రజలకు ధైర్యం ఇచ్చి వారి ఆదరణ చూరగొని ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి రాష్ట్రం ముందుకు సాగింది. వర్షాలు పడి సుభిక్షం అయ్యింది. కాని దైవనిర్ణయం వల్ల ఆయన మనకు దూరమయ్యారు. అయితే ఆ వెంటనే జరిగిందేమిటి? నేరుగా ప్రజల ద్వారా ఎన్నికయ్యే సత్తాలేని నాయకులంతా, అప్పటివరకూ వైఎస్‌కు ఎదురుపడటానికి కూడా ధైర్యం చేయలేని వ్యక్తులంతా రంగం మీదకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతినిధులుగా మారి వైఎస్ కుటుంబంపై లేనిపోనివి కల్పించి చెప్పనారంభించారు. 

ఒక్కసారి అధిష్టానం ఆ మాటల్ని నమ్మడం మొదలుపెట్టాక వారు జగన్‌ను వెంటాడటం మొదలుపెట్టారు. జగన్ చేసిన తప్పు ఏమిటి? రాజశేఖరరెడ్డి కడుపున పుట్టడమేనా? వ్యాపారవేత్తగా ఎదగడమేనా? సిబిఐ చంద్రబాబును ఎమ్మార్ కేసులో ఎందుకు విచారించడం లేదు? అతడు ఈ మొత్తం కేసును వెనుక ఉండి నడిపించే అసలు హస్తం కావడం వల్లేనా? రాజశేఖరరెడ్డి కుటుంబం దైవాన్ని నమ్ముతుంది. అలాంటి కుటుంబం తప్పు చేయదు. కాంగ్రెస్ పెద్దలు జగన్ కుటుంబాన్ని కష్టాల్లో పడేయడం వల్ల ఇవాళ రాష్ట్రం కష్టాల్లో ఉండటం చూస్తున్నాం. సరైన వానలు లేవు. కరెంటు లేదు. జీవనోపాధి భారమైంది. జనం జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన బయటకు రావడం ఎంత ఎక్కువ ఆలస్యమైతే రాష్ట్రానికి అంత ఎక్కువ నష్టం.
- సంతులూరి శాంతారావు, మాజీ కౌన్సిలర్, చిలకలూరిపేట.(ఈమెయిల్ ద్వారా)


ప్రపంచమంతా గమనిస్తోంది... 
ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్న నాటకాన్ని మన దేశమంతా గమనిస్తోంది. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న రగడ, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న ప్రచారం విషాదం. అసలు జగన్ ఒక్కడే దోషి అని తామంతా నిర్దోషులని వీళ్లు మాట్లాడుతున్నారు. వీళ్లంతా నిజంగా గుండెల మీద చేతులేసుకొని చెప్పగలరా తాము నిర్దోషులమని? తన తెలివితేటలతో వ్యాపారరంగంలో పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడి పెట్టినవారికి ఆదాయం అందించడం జగన్ చేసిన దోషమా? కులమతవర్గమనే తేడా లేకుండా ప్రజలందరి కోసం అహర్నిశలు కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాసంక్షేమమే జగన్‌కు శాపమైందా? పరిశ్రమలకు భూముల కేటాయింపుపై మంత్రిమండలి చేసిన ఆమోదంలో జగన్ పాత్ర ఏమైనా ఉంటుందా? పరిశ్రమలు నెలకొల్పేవారికి రాయితీలు ఇవ్వడం వైఎస్‌ఆర్‌గారి ప్రభుత్వం మాత్రమే చేసిన పని కాదు. 

అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదే. అసలు భూకేటాయింపుల విషయంలో సరైన అవగాహన మన రాజకీయ నాయకుల్లో లేకపోవడం వలనే మన రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పలేకపోతున్నాం. మన రాష్ట్రంలో అన్నివిధాలుగా అభివృద్ధి నిలిచిపోయింది. కరెంటు కష్టాలు. కార్మికుల కష్టాలు. ఇప్పుడైనా రాజకీయాలు మాని పరిశ్రమలు మన రాష్ట్రానికి రావడానికి వైఎస్‌ఆర్ చేసి కృషిని కొనసాగించమని మనవి. వైఎస్‌ఆర్ మరణవార్త విని మరణించిన వందలాది కుటుంబాలను అక్కునజేర్చుకొని వారికి నేనున్నానని చెప్పడం జగన్ చేసిన నేరమా? భర్తను కోల్పోయి కష్టంలో ఉన్న విజయమ్మ నుంచి కొడుకును తీసుకెళ్లి అన్యాయంగా జైలులో పెట్టడం నాలాంటి స్త్రీలకు చాలా మనోవేదన కలిగిస్తోంది. రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడ్డ కుటుంబాన్ని ఇలా అప్రతిష్ట పాలు చేయడం మన రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు.
- కారసాల లక్ష్మికుసుమరాణి, కుందేరు, కంకిపాడు, కృష్ణాజిల్లా


కావలసిన స్టేట్‌మెంట్ల కోసమే...
ప్రజాస్వామ్యదేశం అని మన దేశానికి పేరు. కాని ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్న వారు ఎవరినైనా బెదిరించవచ్చు అరెస్ట్ చేయవచ్చు తాము చెప్పినమాట వినేంతవరకూ బెయిల్ రాకుండా అడ్డుపడవచ్చు. జగన్‌ను అరెస్టు చేసి వందకు పైగా రోజులు లోపల ఉంచి కూడా ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడని సిబిఐ చెప్తోంది. కాని కాంగ్రెస్ భయమేమిటంటే జగన్ బయట ఉంటే ఎవరూ సిబిఐకి భయపడరు. అది కోరినట్టుగా విని తప్పుడు సాక్షాలు స్టేట్‌మెంట్లు ఇవ్వలేరు. ఈ భయమే సిబిఐది కూడా. ఇంకా సిబిఐ భయం ఏమిటంటే జగన్ రాష్ర్ట రాజకీయ పరిస్థితిని మార్చగలడు. గొప్ప నేతగా ఎదగగలడు. జగన్‌ను ప్రేమించే వాళ్లంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిన సమయం ఇది. ప్రజల నాయకుణ్ణి వాళ్లు ఇక ఎంతమాత్రం ప్రజల నుంచి దూరం చేయలేరు.
- అరుణ హన్న, సికింద్రాబాద్ (ఈమెయిల్ ద్వారా)

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!