*ఆ సాకుతో వాయిదా కోరిన సీబీఐ న్యాయవాది
*తాను వాదనలు వినిపించే అవకాశం ఉన్నా మౌనం
*కొత్త న్యాయవాది మరో కేసులో బిజీగా ఉన్నారని నివేదన
*సీబీఐ తీరుపై జగన్ తరఫు న్యాయవాది అభ్యంతరం
*ప్రతిసారీ ఇదే తంతు కొనసాగిస్తోందని నివేదన
*సోమవారం విచారించాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థన
*5వ తేదీన విచారిస్తామన్న ధర్మాసనం
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను సాగతీసేందుకు సీబీఐ అధికారులు రోజుకో ఎత్తుగడ అనుసరిస్తున్నారు. సుప్రీంకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నాటి నుంచి, నోటీసులు అందుకోవడం.. కౌంటర్ దాఖలు చేయడం.. తరువాత వాదనలు వినిపించటం.. ఇలా ప్రతి విషయంలోనూ జాప్యం చేస్తూ వస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసును తేల్చే అవకాశం సుప్రీంకోర్టుకు ఏ మాత్రం ఇవ్వటం లేదు. కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో వాయిదా కోరుతూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా సీబీఐ యథావిధిగా వాయిదా కోరారు.
అసలు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందా..? శుక్రవారం కూడా అందులో భాగంగానే కేసు విచారణ వాయిదా కోరిందా..? సుప్రీంకోర్టు విచారణ చేపడితే జగన్‌కు ఎక్కడ బెయిల్ వస్తుందో అన్న ఆందోళనతో ఉన్న సీబీఐ అధికారులు.. ఎలాగైనా దానిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేసును వాయిదా వేయాలని కోరారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు ఇదే కారణమని స్పష్టం చేస్తున్నారు. సీబీఐ అధికారులకు, ఆ సంస్థను వెనుక నుంచి నడిపిస్తున్న పెద్దలకు జగన్ బెయిల్‌పై బయటకు రావటం ఎంత మాత్రం ఇష్టమున్నట్లు కనిపించటం లేదని, అందుకే ప్రతిసారీ ఏదో ఒక కారణం చూపుతూ కేసును విచారణకు రాకుండా సీబీఐ ద్వారా అడ్డుకుంటున్నారని, ఇదంతా సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉందని వారు చెప్తున్నారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా వాయిదాలు కోరుతోందనేందుకు వారు కొన్ని ఉదాహరణలను కూడా చూపుతున్నారు.
కౌంటర్ దాఖలు మొదలు ఇదే తంతు..!
జగన్‌మోహన్‌రెడ్డి జూలై 27న సుప్రీంకోర్టులో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సీబీఐ రిజిస్ట్రీలో సృష్టించిన అడ్డంకులను దాటుకుని అది రెండు వారాల తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆగస్టు 10న బెయిల్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, సీబీఐకి నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఏకంగా దాదాపు నెల రోజుల తరువాత అంటే ఈ నెల 7న తన కౌంటర్‌ను దాఖలు చేసిన విషయాన్ని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి సీబీఐ నెల రోజులకన్నా ముందే కౌంటర్ దాఖలు చేసి ఉండొచ్చునని, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్నీ ఇప్పటికే పలుమార్లు పలు కోర్టుల్లో కౌంటర్ల రూపంలో సీబీఐ ఉంచిందని, అందువల్ల కౌంటర్ దాఖలుకు అంత సుదీర్ఘ సమయం అవసరం లేదని వారు చెప్తున్నారు. అయినప్పటికీ నెల రోజుల గడువు కోరిందంటే, ఈ కేసులో మున్ముందు తాము ఎన్ని ఎత్తుగడలను అనుసరించబోతున్నామో అన్న విషయాన్ని సీబీఐ ఆనాడే స్పష్టం చేసిందని అంటున్నారు.
ఒక వ్యక్తి బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వచ్చాడంటే, అందులో అత్యవసరం ఉందని భావించాలని, బెయిల్ పొందటమనేది నిందితునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, ఉద్దేశపూర్వంగా విచారణను వాయిదా వేయించటం ద్వారా సీబీఐ ఆ హక్కును హరిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యలో సీబీఐ తన న్యాయవాదిని మార్చింది. దీనిపై ఓ వర్గం మీడియా చేతికొచ్చిన కథనాలను అల్లేసింది. ఇప్పటి వరకు జగన్ కేసులను వాదిస్తూ వచ్చిన అశోక్‌భాన్ వంటి సీనియర్ న్యాయవాదులను కాదని, కొత్త న్యాయవాదిని నియమించటం వెనుక ఏదో మతలబు ఉందంటూ కథనాలను వండి వార్చింది. అయితే తాజాగా కూడా సీబీఐ మళ్లీ న్యాయవాదిని మార్చింది. మోహన్‌జైన్ స్థానంలో అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌కు కేసు బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి శుక్రవారం నాడు జరిగిన విచారణకు సీబీఐ తరఫున అశోక్‌భాన్ హాజరయ్యారు.
ఆయనే స్వయంగా ధర్మాసనాన్ని వాయిదా కోరారు. న్యాయవాదిని మార్చామని, మోహన్ పరాశరన్ వాదనలు వినిపిస్తారని స్వయంగా చెప్పారు. న్యాయవాది మార్పు వెనుక మతలబు ఉందనుకుంటే.. అశోక్‌భాన్ ఎందుకు శుక్రవారం వాదనలు వినిపించలేదు..? కోర్టులో ఉన్న సీబీఐ జేడీ వాదనలు వినిపించాలని అశోక్‌భాన్‌ను ఎందుకు కోరలేదు..? సుప్రీంకోర్టులోనే ఉన్న మోహన్ పరాశరన్ ఎందుకు వాదనలు వినిపించేందుకు రాలేదు..? మళ్లీ న్యాయవాదిని మార్చామని, ఆయనే వచ్చి వాదనలు వినిపిస్తారని అశోక్‌భాన్ స్వయంగా ఎందుకు చెప్పారు..? అనేవి న్యాయ నిపుణుల సందేహాలు. ఈ సందేహాలకు సమాధానం ఇవ్వాల్సింది సీబీఐ, దాని వెనకుండి కథనడిపిస్తున్న ఢిల్లీపెద్దలే.
విచారణ అక్టోబర్ 5కు వాయిదా...
తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. కేసు విచారణకు రాగానే సీబీఐ తరఫున ఇప్పటికే పలుమార్లు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ లేచి నిలబడ్డారు. ఈ కేసులో సీబీఐ తరఫున వాదనలు వినిపించే న్యాయవాదిని మార్చామని, అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ ఇకపై ఈ కేసు బాధ్యతలను చూసుకుంటారని ధర్మాసనానికి అశోక్‌భాన్ వివరించారు. మోహన్ పరాశరన్ సుప్రీంకోర్టులోని మరో కోర్టులో వాదనలు వినిపిస్తూ బిజీగా ఉన్నారని, అందువల్ల ఈ కేసును వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. వాస్తవానికి సీనియర్ న్యాయవాది అయిన అశోక్‌భాన్ వాదనలు వినిపించి ఉండొచ్చు. జగన్ కేసులో అశోక్ భాన్ అనేక సందర్భాల్లో పూర్తిస్థాయి వాదనలు వినిపించారు.
అయితే సీబీఐ ప్రధాన ఉద్దేశం కేసును వాయిదా వేయించటం కాబట్టి, ఆయన వాదనలు వినిపించకుండా మిన్నకుండిపోవటమే కాకుండా, కేసును వాయిదా వేయాలని కోరినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కేసు వాయిదాకు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియం అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ ప్రతిసారీ ఇదే విధంగా ఏదో ఒక కారణంతో వాయిదా కోరుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని గట్టిగా చెప్పారు. ఈ కేసును సోమవారం విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. సోమవారం తమకు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయని.. అందువల్ల ఈ కేసును శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.
No comments:
Post a Comment