తిరుపతి, న్యూస్‌లైన్ : ఓ వైపు చితిమంటలు, మరో వైపు దుర్భర దుర్గంధం, ఇంకోవైపు దోమలమోత.. ఇవేమీ లెక్క చేయకుండా ప్రజల సమస్యల పరిష్కా రం కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం రాత్రి శ్మశాన నిద్ర చేపట్టారు. తిరుపతిలో పద్మావతీపురం, లక్ష్మీపురం, శ్రీనివాసపురం ప్రాంతవాసులకు సరైన శ్మశానం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 60 వేలమంది నివసిస్తున్నారు. ఉన్న కాసింత స్థలంలో రోడ్డు పక్కనే శవాలు కాలుతూ ఉంటాయి. పక్కనే ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని ఎప్పటి నుంచో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరుణాకరరెడ్డి శ్మశాన నిద్ర చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్మశానానికి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారన్నారు. అయితే మహానేత మరణంతో సమస్య అలాగే మిగిలిపోయిందన్నారు. బతికుం డగా బారెడు జాగా ఇవ్వలేని ప్రభుత్వం, చనిపోయాక శవాన్ని పూడ్చడానికి కూడా జానెడు స్థలం చూపడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మరిన్ని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.
మొదటి ఎమ్మెల్యే
సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా శ్మశానంలో ఎమ్మెల్యే నిద్రించడం తిరుపతి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే ఈ రకంగా నిరసన వ్యక్తం చేయడం రాష్ట్రంలో బహుశా ఇదే మొదటిసారి అని వారు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం భూమన ప్రత్యేకతని వారు ప్రశంసించారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=457721&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment