YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 29 September 2012

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
అందుకే నీ పాలనంటేనే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు
విశ్వసనీయతంటే ఏంటో వైఎస్‌ను చూసి తెలుసుకో
హామీలు ఇవ్వకుండానే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు
నీలా డిక్లరేషన్లతో ప్రజలను మభ్యపెట్టలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, సంపూర్ణ మద్య నిషేధం పథకాలను రద్దు చేసిన చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత అనే మాటకు అర్థం తెలుసా? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పాదయాత్ర సందర్భంగా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి మూలింటి మారెప్పతో కలిసి ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

భౌతికంగా లేని, తిరిగి వచ్చి సమాధానం చెప్పుకోలేని వైఎస్ రాజశేఖరరెడ్డి... కుట్రలతో కేసుల్లో ఇరికించడంవల్ల జైల్లో ఉండి తనపై విమర్శలకు జవాబు ఇచ్చే పరిస్థితి లేని జగన్‌మోహన్‌రెడ్డిలపై నిందారోపణలు చేయడం, అవహేళన చేసే విధంగా మాట్లాడటమే బాబు తన ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. విశ్వసనీయత అంటే జైలుకు పంపడం, దోచుకోవడం అని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విశ్వసనీయతంటే ఏంటో వైఎస్‌ను లేదా ఆయన కుటుంబీకులను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేసిన రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం పథకాలు రెండింటినీ నువ్వు ముఖ్యమంత్రి కాగానే రద్దు చేశావు. ఆత్మవంచన, మోసం అంటే అదే! వైఎస్ ప్రజలకు హామీలు ఇవ్వకుండానే 2004లో అధికారంలోకి వచ్చాక రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేశారు. దానినే విశ్వసనీయత, మానవత్వం అంటారు. తెలుసుకో...!’’ అంటూ చంద్రబాబుకు సూచించారు. విశ్వసనీయత ఏమిటో తెలుసు కనుకనే జగన్‌ను కుట్రలతో కేసుల్లో ఇరికించి జైలుకు పంపినపుడు ఆయనపైనే ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నాయకుడు టీడీపీని వీడి బయటకు వచ్చారని గుర్తుచేశారు. 

అది టీడీపీ పాడె యాత్ర అంటున్నారు

‘వస్తున్నా... మీకోసం’ అంటూ బాబు చేపట్టబోతున్నది పాదయాత్ర కాదని, టీడీపీకి పాడె యాత్ర అని జనం చెప్పుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు గ్రామాల్లోకి వస్తే అరిష్టమని భయపడుతున్నారనీ... గతంలో ‘ఓ స్త్రీ... రేపు రా’ అని రాసుకున్నట్లుగా, ఇపుడు ‘బాబూ... రేపు రా!’ అని రాసుకుంటారని విమర్శించారు. 

‘‘తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశావని నీ పాలనను గుర్తు చేస్తావు? ఒక్క సంక్షేమ పథకమైనా ప్రవేశపెట్టావా? అసలు నీ పాలన అంటేనే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. కరెంటు దొంగతనం చేశారని గ్రామాల్లోకి పోలీసులు వచ్చి రైతులను పట్టుకెళ్లిన అరాచకాన్ని వారు మర్చిపోలేదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ విలీనం అయిపోతుందని బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని... అసలు తమ పార్టీ ఎందుకు కలిసిపోతుందని ఆయన ప్రశ్నించారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ రెండింటికీ కలిపి వచ్చిన ఓట్లకంటే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆరు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అలాంటపుడు తామెందుకు విలీనం అవుతామని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి ప్రభుత్వాన్ని కాపాడుతోంది చంద్రబాబేనని విమర్శించారు. ప్రజలకేదైనా చేయాలనుకుంటే అధికారంలో ఉన్నపుడు చేసి ఉండాలి గాని డిక్లరేషన్ డ్రామాలెందుకని దుయ్యబట్టారు. వైఎస్ ఎపుడూ డిక్లరేషన్లు చేయలేదని, ప్రజల అవసరాలేమిటో మనసుతో ఆలోచించి అమలు చేశారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. 

source: sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!