YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 4 November 2012

మాతో వచ్చేవారికి కష్టాలుంటాయి

* వైఎస్సార్ సీపీలో చేరిన కృష్ణబాబు, ఎమ్మెల్యే వనిత, పలువురు నేతలు
* మాతో వచ్చే వారికి కష్టాలుంటాయని తెల్సినా లెక్క చేయకుండా వస్తున్నారు..
* హృదయపూర్వకంగా అభినందిస్తున్నా : వైఎస్ విజయమ్మ వ్యాఖ్య 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ వెంట వచ్చే వారికి మున్ముందు కష్టాలుంటాయని తెలిసి కూడా వాటిని లెక్క చేయకుండా పార్టీలో చేరుతున్న వారిని తాను మనఃపూర్వకంగా అభినందిస్తున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు. పశ్చిమగోదావరికి చెందిన సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు), ఎమ్మెల్యే తానేటి వనితతో సహా పెద్ద సంఖ్యలో నాయకులు ఆదివారం సాయంత్రమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో విజయమ్మ ప్రసంగిస్తూ.. ‘నాతో పాటు వచ్చే వారు మూడేళ్లకు పైగా కష్టాలు పడాల్సి ఉంటుందని వై.ఎస్.జగన్‌మోహ న్ రెడ్డి తొలుతనే స్పష్టంగా చెప్పారు. వాటిని భరించక తప్పదని..అన్నింటికీ సిద్ధపడాలన్నారు’ అని పేర్కొన్నారు. ఇబ్బందులుంటాయని తెలిసి కూడా వస్తున్న వారు పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని ఆమె సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి కోసం తపన పడ్డారని, జగన్ కూడా తండ్రిలాగే ప్రజల్లో ఉండే వారని అన్నారు. జగన్‌బాబు అన్ని అడ్డంకులనూ అధిగమించి బయటకు వస్తారని.. ఆ దేవుడు చల్లగా చూస్తాడని, త్వరలో ఆయన ప్రజల మధ్య ఉంటారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నీలం తుపాను వల్ల రైతులకు, ప్రజలకు భారీ నష్టం జరిగిందని, ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం వారి మధ్యనే ఉండి ధైర్యం చెప్పాలని, చేయూత నివ్వాలని ఆమె పిలుపు నిచ్చారు. వైఎస్ స్వర్ణయుగం మళ్లీ తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. తాను కూడా సోమవారం ఉదయం విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి వరద బాధిత ప్రాంతాలను, ఉభయగోదావరి జిల్లాలను సందర్శిస్తానని విజయమ్మ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ టి.బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కొవ్వూరు, గోపాలపురం, దెందులూరు, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. విజయమ్మ నేతలందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. 

జగన్‌ను సీఎం చేయడమే నా కర్తవ్యం: కృష్ణబాబు
ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం జగన్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడమేనని, అందు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్టీలో చేరిన అనంతరం కృష్ణబాబు ప్రకటించారు. గతంలో టీడీపీలో ఎలాగైతే బాధ్యతలు తీసుకుని పనిచేశానో 2014 ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అలాగే కృషి చేస్తానని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది. టీడీపీ పని 75 శాతం అయిపోయింది. ఎన్.టి.రామారావు టీడీపీని చాలా హుందాగా నడిపారు. చంద్రబాబు ఇపుడు దానిని ఎలా నడుపుతున్నారో అందరికీ తెలుసు. దాన్నొక కుల పార్టీగా, కుటుంబ పార్టీగా మార్చేశారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అశేష ప్రజాదరణ ఉంది. జగన్ ఈజ్ ఎ డైనమిక్ బాయ్, ఆయనకు ఎన్నో ప్రతిభా పాటవాలున్నాయి. ఆయనను ఎన్ని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినా అడ్డంకులను అధిగమించి బయటకు వచ్చి తీరతారు’ అని ఆయన అన్నారు. జగన్ బయటికి రాడని అంటే సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాతో సహా చాలా మంది నేతలు జైల్లోకి పోవాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 200 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు రావడం ఖాయమన్నారు. జగన్ నుంచి తానెలాంటి హామీ పొందలేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పదవికీ పోటీ చేయబోనని పేర్కొన్నారు. 

బాబూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను వేలం వేయండి
తాను చాలా కాలంగా కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వాలని బాబును కోరుతూ వస్తున్నానని.. కానీ, ఎపుడూ అవకాశం కల్పించలేదని కృష్ణబాబు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని బాబుకు చెప్పి రాజ్యసభ కావాలని అడిగానని ఆయన హామీ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాధ్యతలు తీసుకుని నాలుగింటిలో టీడీపీని గెలిపించానన్నారు. 

తీరా సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వడం తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందన్నారు. సుజనా చౌదరి పార్టీ కోసం బాగా డబ్బు ఖర్చు చేశా రని, అందుకే ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చానని బాబు అప్పట్లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారని, దాంతో తాను ఆగ్రహం పట్టలేక నేరుగా ఆయన వద్దకు వెళ్లి ఈ విషయమై అడిగానన్నారు. ‘డబ్బులు ఖర్చు చేశారనే కారణంతో సుజనా చౌదరికి రాజ్యసభ టికెట్ ఇచ్చామని సమర్థించుకుంటే ఇక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులకు కూడా వేలం వేస్తే బాగుంటుంది కదా, పార్టీకి బాగా డబ్బులు వస్తాయి’ అని బాబుకు సలహా ఇచ్చానని గుర్తుచేశారు.

అకారణంగా సస్పెండ్ చేశారు: వనిత
ఒక మహిళా ఎమ్మెల్యేగా పార్టీ కోసం మూడున్నరేళ్లుగా కష్టపడి పని చేస్తూ ఉంటే ఎలాంటి కారణం లేకుండా టీడీపీ నుంచి బహిష్కరించడం జీర్ణించుకోలేక పోయానని తానేటి వనిత అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తన నియోజకవర్గంలో కొందరు ఒక వర్గంగా ఏర్పడి నిత్యం తనను వేధించడమే పనిగా పెట్టుకున్నారని, ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో తనకు ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతో తన రాజకీయ గురువు కృష్ణబాబు బాటలోనే పార్టీలో చేరానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ తులసీ వరప్రసాద్ మాట్లాడుతూ.. తాను 1960 నుంచీ రాజకీయాల్లో ఉన్నానని, అయితే వైఎస్ వంటి నాయకుడిని ఎపుడూ చూడలేదన్నారు. టి.బాలరాజు మాట్లాడుతూ.. కృష్ణబాబు ఆయన అనుచరుల చేరికతో తమ జిల్లాలో పార్టీ మరింత బలపడిందని, వచ్చే ఎన్నికల్లో 15 శాసనసభా స్థానాలను గెల్చుకుని తీరతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

పార్టీలో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, దెందులూరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కొటారు రామచంద్రరావు, చింతలపూడి టీడీపీ ఇంచార్జి కర్రా రాజారావు, కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ కోడూరి పార్వతీకుమారి, కొవ్వూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు, చిట్టూరి బాపినీడు కుమారుడు నరేంద్ర, కుమార్తె రాజశ్రీ, మెహర్ శ్రీనివాస్, రాజీవ్‌కృష్ణ (కృష్ణబాబు అల్లుడు), సీడీసీ మాజీ చైర్మన్ ఎండపల్లి రమేష్, కాకర్ల నారాయుడు, బలుసు సుబ్బారావు, ముళ్లపూడి వెంకటకృష్ణారావు, కోట శ్రీదేవి, సిహెచ్.రమ, భావన, ఎం.ఎ.షరీఫ్, తోట వెంకటరమణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి, పి.ఎన్.వి.ప్రసాద్, ఎం.ప్రసాదరాజు, హరిరామజోగయ్య, మోషేన్‌రాజు, డి.రవీంద్రనాయక్, రాజ్ ఠాకూర్, పుత్తా ప్రతాపరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, బుచ్చి మహేశ్వరరావు పాల్గొన్నారు. 

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!