YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 4 November 2012

రాజన్న దిక్కు లేక దిక్కులేనివాళ్లమయ్యాం

* మరో ప్రజాప్రస్థానంలో షర్మిలతో గొర్రెలు, మేకల పెంపకందార్ల ఆవేదన 
* వైఎస్ తెచ్చిన గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య ఆయనతోనే పోయింది
* రుణాలు ఇవ్వరు.. గొర్రెలు చస్తే పరిహారం కూడా రావడం లేదని వెల్లడి 
* జగనన్న సీఎం కాగానే రాజన్న రాజ్యం వస్తుంది: షర్మిల
* అప్పుడు బీమా అందుతుందని, రుణాలు ఇస్తారని, కార్పొరేషన్ బాగా పనిచేసేలా అన్న చూస్తాడని భరోసా 

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
ఆదివారం యాత్ర ముగిసేనాటికి..
రోజులు: 18, కిలోమీటర్లు: 236.10 

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజల బాధలు పట్టని ప్రభుత్వ వైఖరికి.. దానికి మద్దతుగా ఉన్న టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన చెల్లెలు షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం 18వ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో సాగింది. పాదయాత్రలో ప్రజల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. ఉదయం ఉరవకొండ మార్కెట్ యార్డులో బయలుదేరిన షర్మిలకు మార్గమధ్యంలో చిన్నహోతూరుకు చెందిన గొర్రెల కాపరి సురేష్ ఎదురయ్యాడు. షర్మిలతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. 

‘‘రాజన్న లేడు. మేం దిక్కులేనివాళ్లమయ్యాం. ఆయన తెచ్చిన గొర్రెలు మేకల పెంపకందారుల సమాఖ్య
ఆయనతోనే పోయింది. రుణాలు లేవు. గొర్రెలు చస్తే బీమా రాదు. మమ్మల్ని పట్టించుకునేవాళ్లే లేరు’’

- మరో ప్రజాప్రస్థానంలో షర్మిలతో గొర్రెలు, మేకల పెంపకందారుల ఆవేదన ఇది..

షర్మిల: ఏమన్నా బాగున్నారా?
సురేష్: గొర్రెలు చనిపోతే బీమా రావడం లేదమ్మా. ఇంతకుముందు గొర్రెకు రూ.18 కడితే.. చనిపోయినప్పుడు రూ.1,000 వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు.

షర్మిల: ఏవైనా రోగాలు వచ్చినప్పుడు వాటికి మందులు, చికిత్స అందుబాటులో ఉంటుందా?
సురేష్: ఎక్కువగా కుంటు వ్యాధి వస్తుంది. ఇంతకుముందు మందుల సరఫరా బాగుండేది. ఇప్పుడు మందులు దొరకడం లేదు.

షర్మిల: రుణాలు ఇస్తున్నారా?
సురేష్: రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాకు కార్పొరేషన్(గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య) ఉండేది. దాని ద్వారా రుణాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రాజశేఖరరెడ్డి లేరు. ఆ కార్పొరేషనూ లేదు. 

వై.మధుసూదన్‌రెడ్డి(కిసాన్‌సెల్ కో ఆర్డినేటర్): కార్పొరేషన్‌కు పాలకమండలి లేదు. చైర్మన్, మెంబర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
షర్మిల: అంటే ఇప్పుడు కార్పొరేషన్ డెడ్ అయినట్టే.

షర్మిల: చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది?
సురేష్: ఆయన టైమ్‌లో కార్పొరేషన్ లేదు. ఏ పని కోసం మండలం వెళ్లినా రూ.100-200 లంచం ఇవ్వాల్సిందే. 

షర్మిల: మీ మేలు కోరి రాజన్న కార్పొరేషన్‌ను సృష్టిస్తే.. ఇప్పుడు దాన్ని పనిచేయకుండా చేశారు. మళ్లీ చంద్రబాబు పాలన కనిపిస్తోంది. అప్పుడు బీమా వచ్చింది. ఇప్పుడు రావట్లేదు.

సురేష్: అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్లే లేరు.

షర్మిల: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ పోవడానికే సరిపోతోంది. ఇక మీ గురించి ఆయనేం పట్టించుకుంటారు? వ్యవసాయం బాగాలేనప్పుడు రైతులు ప్రత్యామ్నాయ ఆదాయం పొందాలని రాజన్న పశువుల పెంపకం కోసం లోన్లు ఇచ్చాడు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు బీమా వసతి కల్పించాడు. కానీ ఈ ప్రభుత్వానికి అంతటి పెద్ద మనసేది?

సురేష్: వర్షం వచ్చి10 జీవాలు చనిపోతే.. రూపాయి రాలేదు. అధికారులు తిప్పించుకుంటున్నారు.

షర్మిల: యథారాజా తథాప్రజా అంటారు కదా. కిరణ్‌కుమార్‌రెడ్డి లాగానే అధికారులు కూడా ఉన్నారు. జగనన్న సీఎం కాగానే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు బీమా అందుతుంది. పశుగ్రాసం, నీటికి కొదవుండదు. వైద్యం కోసం సంచార వైద్యశాలలు అందుబాటులోకి తెస్తాడు. రుణాలూ ఇస్తాడు. కార్పొరేషన్ బాగా పనిచేసేలా చూస్తాడు. ధైర్యంగా ఉండండన్నా.. 

పిల్లల పొట్ట మీద కొడతారా?
పాదయాత్రలో భాగంగా షర్మిల రాగులపాడులోని గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. గ్యాస్ ధర పెరిగిందని తమకు మెనూ మార్చేశారని, ఇంతకుముందు వారానికి 6 గుడ్లు, 6 అరటిపండ్లు ఇస్తే.. ఇప్పుడు మళ్లీ 3 గుడ్లు, 3 అరటి పండ్లు ఇస్తున్నారని పిల్లలు తెలిపారు. వాళ్ల సమస్యలను విన్న షర్మిల చలించిపోయారు. 

షర్మిల: మీ హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా?
విద్యార్థి: మాకు భోజనం సరిగ్గా అందడం లేదు. అలాగే పుస్తకాలు, సబ్బులు సరిగ్గా అందవు. ఆటలు ఆడించడం లేదు. కరెంటు కోతలతో చదువు సాగడం లేదు. 

షర్మిల: భోజనం పరిస్థితి ఏంటి?
విద్యార్థి: అన్నం, సాంబారు బాగుండదు. ఇంతకుముందు 6 గుడ్లు, 6 అరటిపండ్లు ఇచ్చేవారు. ఇప్పుడు మూడు చొప్పున ఇస్తున్నారు. అడిగితే గ్యాస్ ధర పెరిగిందంటున్నారు. 

షర్మిల: (వంటమనిషితో) గ్యాస్‌కు, గుడ్డుకు సంబంధం ఏంటి?
శ్రీనివాస్(వంటమనిషి): గ్యాస్ ధర పెరిగిందని, ఖర్చు పెరిగిందని మెనూలో తగ్గించారమ్మా..
షర్మిల: గ్యాస్ ధర పెంచడమే కాక.. పిల్లల పొట్టపై కొడతారా? ఇదెక్కడి న్యాయం? అన్నం సాంబారు బాగుండడం లేదంట?

శ్రీనివాస్: బాగానే వండుతున్నామమ్మా..

షర్మిల: కిచెన్‌లో చూద్దామా?.. 
షర్మిల వంట గదిలోకి వెళ్లారు. అక్కడ చిమ్మ చీకటి. లైట్లు లేవు. టార్చ్ వెలుగులో అన్నం చూసిన షర్మిల చలించిపోయారు. అన్నం పసుపు, గోధుమ వర్ణంలో ఉండడాన్ని ప్రశ్నించారు. బోరు నీళ్ల వల్ల ఇలా రంగు మారుతోందని వంట మనిషి చెప్పుకొచ్చారు. ముద్దముద్దగా ఉన్న ఆ అన్నం రుచి చూసిన షర్మిల తీవ్రంగా కలత చెందారు. ఇంత ఘోరంగా ఎలా వండుతున్నారని ప్రశ్నించారు. రాత్రి కోసం చేసిన సాంబారును, మధ్యాహ్నం మిగిలిన సాంబారును రుచి చూశారు. 2 లీటర్ల పెరుగులో రెండు బిందెల నీళ్లు పోస్తారని విద్యార్థులు చెప్పడంతో ఆ మజ్జిగను కూడా తాగి చూశారు. విద్యార్థుల తిండి విషయంలో పడుతున్న కష్టాన్ని చూసి వారిని అక్కున చేర్చుకున్నారు. 

వెంటనే బోరు వేయించండి: 
ఇక్కడికి అరకిలోమీటరు దూరంలో ఉన్న స్కూల్‌లో బోరింగ్ లేదని, తాగునీటికి ఇబ్బంది ఉందని, బాత్‌రూమ్‌లు పనిచేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేయడంతో వెంటనే నియోజకవర్గ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డికి బోరు వేయించడం, బాత్‌రూమ్‌లు బాగుచేయించడం, లైట్లు వేయించడం వంటి తక్షణ అవసరాలను తీర్చాలని షర్మిల సూచించారు. అయితే, స్కూల్‌లో బోరింగ్ వేయిస్తామని ఇదివరకు చాలా మంది చెప్పారని, కానీ ఎవరూ వేయించలేదని విద్యార్థులు చెప్పడంతో ‘ఇది జగనన్న పార్టీ. కచ్చితంగా మీకు బోరింగ్, బాత్‌రూమ్, లైట్ల సమస్య తీరుతుంది’ అని ఆమె భరోసా ఇచ్చారు. ‘జగనన్న ఎప్పుడు బయటికొస్తాడక్కా.. ’ అని ఓ విద్యార్థి అడగడంతో ‘వస్తాడు చిన్నా. దేవుడున్నాడు కదా.. తప్పకుండా తీసుకొస్తాడు. మీ సమస్యలన్నీ తీరుస్తాడు..’ అంటూ ముందుకు కదిలారు. 

మాకిక ఆత్మహత్యలే గతి..
మార్గమధ్యంలో పీసీపాపిలి వద్ద ఓ వేరుశనగ రైతు వర్షానికి వేరుశనగ చెట్లు కుళ్లిపోయాయంటూ షర్మిలకు వాటిని చూపి.. ఆవేదన వ్యక్తం చేశాడు. 

షర్మిల: ఏమైందన్నా పంటకు?
రైతు: 10 ఎకరాల్లో వేరుశనగ పంట వేశాం. వర్షానికి చెట్లు కుళ్లిపోయాయి. చెట్లు తీశాక కాయ పూర్తిగా నల్లబడి పనికిరాకుండాపోయింది. ఇది పూడ్చుకోలేని నష్టం.

షర్మిల: పరిహారం ఏమైనా వస్తుందా?
రైతు: రాజశేఖరరెడ్డి టైమ్‌లో బీమా వచ్చేది. అప్పుడు గ్రామాలను యూనిట్‌గా తీసుకునేవారు. ఇప్పుడు వాతావరణ బీమా అని, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఇస్తామంటున్నారు. రెండేళ్లుగా బీమా రాలేదు. ఎకరాకు రూ.350 కట్టించుకుని రూ.650 ఇస్తారట. రాజశేఖరరెడ్డి టైమ్‌లో పంట ఉత్పత్తిలో కనీసం 70 శాతం వరకు బీమా వచ్చేది. 

షర్మిల: రుణాలేమైనా అందుతున్నాయా?
రైతు: రుణాలా? వడ్డీలేని రుణాలని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ వస్తే రుణం కింద జమ చేసుకుంటున్నారు. 

షర్మిల: పశుగ్రాసమైనా దక్కుతుందా? 
రైతు: మొత్తం పంట కుళ్లిపోయిందమ్మా. పనికి రాదు. రైతు బతుకు ఇప్పుడు అధ్వానమైంది. మాకిక ఆత్మహత్యలే గతి. 

షర్మిల: కరెంటు ఉంటోందా?
రైతు: రోజంతా కలిపి రెండు మూడు గంటలు ఇస్తున్నారు. 

షర్మిల: రాబోయేది రైతు రాజ్యమే. రాజన్న రాజ్యమే. మీ ప్రతికష్టంలో జగనన్న మీకు తోడుంటాడు అని భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. 

బాబు అబద్ధాలు చెబుతున్నారు..
‘చంద్ర బాబు తాను గ్యాస్ ధర పెంచనే లేదని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. రూ.145 ఉన్న గ్యాస్ ధరను రూ.305కు పెంచి.. ఇప్పుడు పెంచలేదంటున్నారు. గ్యాస్ ధర రూ.50 పెరిగినప్పుడు మహిళలకు కష్టం కాకూడదని ఆ రూ.50ను ప్రభుత్వమే భరించేలా రాజన్న చూశాడు. అప్పుడు ఆ రూ.50 సబ్సిడీ ఈ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు కూడా పొందారు.. కానీ ఇప్పుడు 6 సిలిండర్లే ఇస్తారట. అంతకుమించితే రూ.1,000కి కొనుగోలు చేయాలట. 

అంటే నెలకు సగటున రూ.900 ఒక్కో సిలిండర్‌పై వెచ్చించాల్సి వస్తుంది’ అని రాగులపాడు సభలో మాట్లాడుతూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పాదయాత్ర ఉరవకొండ నుంచి రాగులపాడు వరకు 12.5 కిలోమీటర్ల మేర సాగింది. రాత్రి 7.35 గంటలకు రాగులపాడులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ నేత కొండా సురేఖ, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులు, పార్టీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, నేతలు వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!