YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 22 July 2012

ఆప్కోను ఆదుకోరెందుకు?


ఉచిత యూనిఫాంల పథకంలో చేనేత కార్మికులకు విద్యాశాఖ అన్యాయం చేస్తోంది. క్లాత్ సరఫరా పనుల కేటాయింపులో ఆప్కోకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వెనుకాడుతోంది. ఆప్కోకు అరకొర కేటాయింపులతో సరి పెట్టి.. కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలకు పనులను కట్టబెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉచిత యూనిఫాంలకు అవసరమైన క్లాత్ సరఫరా పనులను ఆప్కో ద్వారా చేపడితే పరోక్షంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుంది. కానీ విద్యాశాఖ దీన్ని పట్టించుకోవడం లేదు. 2010-11, 2011-12 విద్యా సంవత్సరాల యూనిఫాంల పనుల్లో ఆప్కోకు ప్రాధాన్యం ఇవ్వని విద్యాశాఖ.. ఈసారైనా (2012-13) ముందుగా మేల్కొని యూనిఫాంల సరఫరా పనులను పూర్తిగా అప్కోకు కేటాయించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా అన్యాయమే: రాష్ట్రంలో 56 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున రూ.225 కోట్లతో యూనిఫాంలు అందించాలి. ఈ యూనిఫాంలకు క్లాత్ సరఫరా బాధ్యతలను ఆప్కోకు అప్పగించి మేలు చేకూర్చాల్సిన సర్కారే వివక్ష ప్రదర్శిస్తోంది. ఆప్కోపై ఆధారపడిన చేనేత సహకార సంఘాలు, కార్మికులు యూనిఫాంల ఆర్డర్‌ను పూర్తిగా తమకే ఇవ్వాలని కోరుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అరకొర కేటాయింపులు చేస్తోంది తప్ప చేనేత కార్మికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. ముందుగా ఆర్డర్ ఇస్తే మొత్తం యూనిఫారాలకు అవసరమైన క్లాత్‌ను తామే సరఫరా చేస్తామని సహకార సంఘాలు ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నా చివరి క్షణంలో.. ఆప్కోకు సామర్థ్యం లేదన్న సాకుతో అన్యాయం చేస్తోంది. 2010-11 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ రూ.210 కోట్ల విలువైన యూనిఫాంల ఆర్డర్‌లో 50 శాతం ఆర్డర్‌ను (26 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్) ఆప్కోకు కేటాయిం చింది. 

అయితే ఆ తర్వాత సామర్థ్యం లేదంటూ అందులో 50 శాతం కోత పెట్టి.. 13 లక్షల మంది విద్యార్థుల యూనిఫాంలకే ఆప్కోను పరిమితం చేసింది. రెండు నెలలు గడువు ఇస్తే తమకు కేటాయించిన ఆర్డర్ ప్రకారం మొత్తం యూనిఫాంలను సరఫరా చేస్తామని మొరపెట్టుకున్నా ఒప్పుకోలేదు. విద్యాశాఖకు లేఖ రాసినా కుదరదని తెగేసి చెప్పి ఆర్డర్‌లో కోత విధించింది. ఇక 2011-12లో మరీ దారుణం. కేవలం రెండు జిల్లాల్లోని (వరంగల్, కరీంనగర్) 4.57 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన క్లాత్ సరఫరా పనులను మాత్రమే ఆప్కోకు అప్పగించి చేతులు దులుపుకుంది.

ప్రభుత్వ హామీ అమలు ఎక్కడ?: యూనిఫాంల పనుల విషయంలో విద్యాశాఖ పెద్దలు కావాలనే ఆప్కోకు మొండిచేయి చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు కచ్చితంగా చేనేత వస్త్రాలనే ఆప్కో ద్వారా కొనుగోలు చేసి వినియోగిస్తామని 2005లో వైఎస్ హయాంలోని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. 

కానీ విద్యాశాఖ మాత్రం యూనిఫాంల విషయంలో ఆ హామీని విద్యాశాఖ తుంగలో తొక్కింది. కమీషన్ల బాగోతంలో ఇతర రాష్ట్ర పవర్‌లూమ్ కంపెనీలకు క్లాత్ సరఫరా పనులను అప్పగించి చేతులు దులుపుకుంటోంది తప్ప రాష్ట్రంలోని సంస్థల గురించి ఆలోచించడం లేదు. కనీసం 2012-13 విద్యా సంవత్సరంలో అయినా క్లాత్ సరఫరా చేసే పనులను ఆప్కోకు కేటాయిస్తే.. రాష్ట్రంలోని నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. సిరిసిల్ల, ధర్మవరం వంటి ప్రాంతాల్లోని నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గిపోయి, ఆ కుటుంబాలకు మేలు జరుతుందని చేనేతరంగ నిఫుణులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!