YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 22 July 2012

సుడిగుండంలో నేతన్న .అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనం

* భారీగా పెరిగిన ముడిసరుకుల ధరలు 
* మార్కెట్‌లో పెరగని వస్త్రాల ధరలు 
* విద్యుత్ టారిఫ్ పెరగటంతో ఉత్పత్తిదారులపై భారం 
* యజమానుల సమ్మెతో కార్మికుల ఉపాధికి గండి 
* పస్తులతో వెళ్లదీస్తున్న నేత కార్మిక కుటుంబాలు 
* ప్రత్యేక ప్యాకేజీతో సిరిసిల్లకు ప్రాణం పోసిన వైఎస్ 
* అనంతర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి

హైదరాబాద్, న్యూస్‌లైన్: నూలు ధరలు, రంగుల ధరలు, విద్యుత్ చార్జీలు పెరగటంతో.. నేత, చేనేత కార్మికుల జీవితాలు సుడిగుండంలో చిక్కుకున్నాయి. వస్త్ర పరిశ్రమకు అవసరమైన నూలు, రంగుల రేట్లు పెరగటంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. అదే స్థాయిలో వస్త్రాన్ని మార్కెట్‌లో అమ్ముకోవటానికి వీలులేక గుడ్డకు గిట్టుబాటు ధర లభించటం లేదు. విద్యుత్ టారిఫ్ రేటు పెరగటంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు ఎక్కువగా వస్తున్న విద్యుత్ చార్జీలను భరించలేకపోతున్నారు. 

వీటికి తోడు ఎఫ్‌ఎస్‌ఏ (ఇంధన సర్ చార్జీలు), ఏసీడీ (అదనపు విద్యుత్ వినియోగ డిపాజిట్) చార్జీలను విద్యుత్ బిల్లుల్లో వేయటంతో బిల్లు కట్టటం వస్త్రోత్పత్తిదారులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం 50 శాతం విద్యుత్ రాయితీని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందిస్తున్నా పెరిగిన చార్జీలతో పోలిస్తే రాయితీ కంటే ఎక్కువగానే విద్యుత్ బిల్లును వసూలు చేస్తున్నారు. మార్కెట్‌లో మర మగ్గాల రిపేర్లకు అవసరమయ్యే విడిభాగాల రేట్లు పెరగటం కూడా సమస్యలకు తోడయింది. దీంతో.. నేత కార్మికులు ఉపాధి లేక పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. కుటుంబాన్ని పోషించలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

సర్కారు అజమాయిషీ లేక... 
నేత రంగంలో యజమానులు, ఆసాములు, కార్మికుల వ్యవస్థ మొత్తం ప్రైవేటు, అసంఘటిత రంగం కావటంతో ప్రభుత్వ పరంగా వారిపై అజమాయషీ ఉండటం లేదు. ఫలితంగా ఆసాములు సమ్మె చేయటంతో దినసరి కార్మికులు నష్టపోతున్నారు. యజమానులు మొండికేసినప్పుడు కార్మిక శాఖ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. వస్త్ర పరిశ్రమలో రాత్రిపగలు పని చేయటం మూలంగా కార్మికులు, ఆసాములు శారీరకంగా అలసిపోతున్నారు. ఒక్కో కార్మికుడు పన్నెండు గంటల పాటు వస్త్రోత్పత్తి చేయటంతో అనారోగ్యాల పాలవుతున్నారు. ఎనిమిది గంటల పని విధానం ఉంటే పరిశ్రమలో కార్మికులకు వెసులుబాటుగా ఉంటుంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తుండగా ఆ రాయితీకి సంబంధించిన పది కోట్ల రూపాయలను ప్రభుత్వం సిరిసిల్ల సెస్‌కు బకాయి పడింది. వస్త్రోత్పత్తికి అవసరమైన నూలును యజమానులతో సంబంధం లేకుండా ఆసాములకు అందే విధంగా ప్రభుత్వం నూలు డిపోలను ఏర్పాటు చేస్తే కొంత మేలు జరుగుతుంది. 

సంక్షోభ నివారణకు ఏం చేయాలి?
నేత కార్మికులను సంక్షోభం నుంచి గట్టెక్కించటానికి ప్రభుత్వ పరంగా పలు చర్యలు చేపట్టాలని నేత కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. అవేమిటంటే... 


* చేనేత రంగాన్ని జౌళి శాఖ నుంచి వేరు చేసి సిరిసిల్ల కేంద్రంగా ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి.
* ఉత్పత్తి అయిన వస్త్రాన్ని కొనుగోలు చేయటానికి ఆప్కో తరహాలో కో-ఆప్టెక్స్ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. 


* వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాలను రాయితీపై ఇచ్చేలా ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. 
* చేనేత రుణాలతో పాటు.. మరమగ్గాల పరిశ్రమకు సంబంధించిన రుణాలను, వ్యక్తిగత రుణాలను మాఫీ చేయాలి. 


* 50 శాతం విద్యుత్ రాయితీని మరో 25 శాతం పెంచడం.
* వస్త్రోత్పత్తి, అనుబంధ పరిశ్రమల కార్మికులందరికీ విధిగా గుర్తింపు కార్డులు. పీఎఫ్ సౌకర్యం. కార్మికులందరికీ జనశ్రీ బీమా. యజమానులు విధిగా బీమా చేయించేలా చర్యలు. 


* నిజమైన పేద కార్మికులకు 35 కిలోల అంత్యోదయ కార్డులను అందించి అనర్హుల కార్డులను తొలగించాలి.
* పాలిస్టర్, కాటన్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి గుడ్డ అమ్మకాలకు మార్కెట్ వసతి కల్పించాలి. 
* మరమగ్గాలపై దోమ తెరలు, చీరల ఉత్పత్తి, ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తినీ ప్రోత్సహించాలి.

* ప్రభుత్వ రంగ సంస్థల్లో నేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు డ్రస్‌లు, మున్సిపల్, గ్రామపంచాయతీల సిబ్బందికి డ్రెస్‌లు, స్కూల్ యూనిఫాంలకు ఇక్కడి వస్త్రాన్ని వినియోగించాలి.
* వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న డయింగ్, సైజింగ్, వార్పిన్ యూనిట్లకు పవర్‌లూం సబ్సిడీ వర్తింపజేయాలి. 

* పవర్‌లూం పరిశ్రమ స్థాపనకు అయ్యే పెట్టుబడి రూ. ఐదు లక్షల వరకు పావలావడ్డీ రుణాలను అందించాలి. 
* పవర్‌లూం స్థాపనకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 30 వేల సబ్సిడీని రూ. 75 వేలకు పెంచి పవర్‌లూం పరిశ్రమను ఆధునీకీకరించేందుకు ప్రణాళికలు రూపొందించాలి.

* చేనేత సహకార సంఘాల మాదిరిగానే పవర్‌లూం సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించి సబ్సిడీని విడుదల చేయాలి.
* సిరిసిల్ల నేత కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు.

అమలుకాని వైఎస్ విజన్... 
* సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో 15 ఎకరాల్లో కామన్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని వైఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు భూమిని కేటాయించారు. ఈ కేంద్రం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. పైగా ఈ కేంద్రానికి కేటాయించిన భూమిని కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్నారు.

* 20 వేల మంది కార్మికులున్న సిరిసిల్లలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. దీనిని ఆయన తర్వాత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి.

* సిరిసిల్లలోని కార్మికులకు ఏడాది మొత్తం పని కల్పించేందుకు వీలుగా పాత మగ్గాల స్థానంలో ఆధునాతన మగ్గాలను ఏర్పాటు చేయూలని వైఎస్ నిర్ణయించారు. అయితే.. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదు. 

* కార్మికుల జీతాలు పెంచితే.. పవర్‌లూం విద్యుత్ చార్జీల్లో 50 శాతంతో పాటు మరో 25 శాతం సబ్సిడీ అందిస్తామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను రూ. 1.80 నుంచి 2.67కు పెంచింది. అదేవిధంగా 2009-10 నాటి సర్‌చార్జీలను పవర్‌లూంలపై మోపింది.

నేతన్నలపై బాబు చిన్నచూపు
నేత కార్మికుల సంక్షేమం విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం విషయంలో కానీ.. ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసమాడారు. డబ్బుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారనే దాకా చంద్రబాబు వెళ్లారు. 

* 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురు మృత్యువాతపడగా కూతురు బతికింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిరిసిల్లకు రావాలని పలువురు డిమాండ్ చేసినా కన్నెత్తికూడా చూడలేదు. చేనేత మంత్రి పడాల భూమన్నను సిరిసిల్లకు పంపించారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్ వచ్చి సిరిసిల్ల నేతన్నల పరిస్థితిని పరిశీలించారు. 

* బాబు హయాంలో 1999-2004 వరకు 200 మంది మా చేనేత కార్మిక సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే పైసా పరిహారమైనా బాబు ఇవ్వలేదు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మిక కుటుంబాలకు కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ. ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

* మగ్గం నేసి నడుములు వంగిపోయి త్వరగా ముసలివాళ్లుగా మారిపోయి, కంటిచూపు కోల్పోయే చేనేత కార్మికులకు ప్రత్యేకంగా పింఛను ఇవ్వాలని బాబు ఏనాడూ ఆలోచించలేదు. అందరితో పాటు 60 ఏళ్లు నిండిన వారికి రూ. 75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు. 

* చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను అమ్మేందుకు ఏర్పాటుచేసిన ఆప్కో షోరూంలను 100 వరకూ బాబు మూసేయించారు.

* నేతన్నలను ఆదుకునేందుకు ఉద్దేశించి ఎన్‌టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు. చేసేందుకు పని లేక, నేసిన బట్టను అమ్మేందుకు ఆప్కో షోరూంలు లేక.. చేనేత కార్మికులు పూట గడిచేందుకు ప్రైవేట్ రుణాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. 

* ఇటువంటి పరిస్థితుల్లో కనీసం సంస్థాగతంగా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించేందుకు కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించలేదు. 

* బాబు హయాంలో అంత్యోదయ కార్డుల్లేవు, ఆరోగ్యశ్రీ లేదు. పావలా వడ్డీ రుణాల్లేవు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఉండేవి. 

* చంద్రబాబు హయాంలో వస్త్రోత్పత్తి గిట్టుబాటు కాక మరమగ్గాలను ఇనుపసామానుకు అమ్ముకునే దుస్థితి ఎదురైంది. చాలా మంది కార్మికులు సిరిసిల్లలో ఉపాధి లేక భివండి, ముంబై వలస వెళ్లారు. నిత్యం సిరిసిల్ల నుంచి ముంబైకి మూడు, భివండికి ఒకటి, షోలాపూర్‌కు మరో బస్సు వెళ్లేవి.. అంటే వలసలు ఏ స్థాయిలో ఉండేవో స్పష్టమవుతోంది.

వైఎస్ సంక్షేమ చర్యలతో సమసిన సంక్షోభం
* ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ఇచ్చేందుకు దివంగత వైఎస్ 2004 ఏప్రిల్‌లో జీవోలు 46, 119 జారీ చేశారు. మొత్తం 125 కుటుంబాలకు రూ. లక్షన్నర చొప్పున సాయమందించారు. 1997 నుంచి ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఇందులో నేత కార్మికుడి అప్పులను సర్దుబాటు చేసేందుకు రూ. యాభై వేలు, మరో రూ. లక్ష ఆ కుటుంబం జీవనోపాధికి అందించారు. మరో 120 కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించారు. 

* సిరిసిల్లలోని నేత కార్మిక కుటుంబాలకు చెందిన 12 వేల మందికి అంత్యోదయ అన్నయోజన పథకం (ఏఏవై) కార్డులను అందించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం నెలనెలా రేషన్ దుకాణాల ద్వారా అందుతున్నాయి. 

* చేనేత కార్మికుల ఆరోగ్య సవుస్యలను దృష్టిలో ఉంచుకుని 50 సంవత్సరాలకే ప్రత్యేకంగా పింఛను ఇవ్వాలని వైఎస్ నిర్ణయించి 50 వేల మంది చేనేత కార్మికులకు ప్రతి నెలా రూ. 200 పింఛను ఇచ్చారు. 

* 2004లో రూ. 32 కోట్లు ఉన్న ఆప్కో టర్నోవర్ ప్రస్తుతం రూ. 250 కోట్లుగా మార్చే విధంగా ఆప్కోను ఆదుకున్నది వైఎస్సే.

* పెరిగిన చిలపనూలు ధరల వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంటే వైఎస్ 10 శాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. 

* వైఎస్ హయాంలో 2008 నాటికి సిరిసిల్ల నుంచి వలసలు తగ్గాయి. ఆదాయం లేకపోవటంతో ఇక్కడి నుంచి మహారాష్ట్రకు బస్సులు రద్దయ్యాయి. 

* సిరిసిల్లలోని ప్రతి కుటుంబం మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండేవిధంగా అందర్నీ చైతన్యవంతులను చేసి.. 1,480 సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి మహిళకు రూ. 50 వేలు రుణాన్ని అందించారు. ఇలా మొత్తం ఒక్క సిరిసిల్లలోనే రూ. 74 కోట్ల పావలా వడ్డీ రుణాలను అందించారు. దీంతో సిరిసిల్లలో అప్పటివరకు బలంగా ఉన్న మైక్రోఫైనాన్స్ సంస్థల వేధింపులు పూర్తిగా తగ్గాయి. 

* సిరిసిల్లలో తాగుడుకు బానిసై కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారికి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు మనోవికాస కేంద్రాన్ని ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. 

* సిరిసిల్ల నేతన్నల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరాన్ని సిరిసిల్ల కళాశాల మైదానంలో 84 మంది డాక్టర్లతో ప్రత్యేకంగా నిర్వహించి వైద్యసేవలు అందించారు.

* సిరిసిల్ల నేత కార్మిక కుటుంబాలకు చెందిన ఇళ్లు లేని నిరుపేదల కోసం సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి, మండెపల్లి, సారంపల్లి గ్రామాల్లో 4,800 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పట్టాలుగా ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్ దోహదపడ్డారు. ఇప్పుడు ఆ మూడు గ్రామాల్లో కొత్త కాలనీలు ఆవిర్భవించాయి. 

* సిరిసిల్ల పట్టణ మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి నీరందించేందుకు రూ.36.50 కోట్ల పథకాన్ని గ్రాంటు రూపంలో మంజూరు చేశారు. ఇప్పుడు ఈ పథకమే సిరిసిల్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చుతోంది. 

* సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం రూ. రెండు కోట్ల కార్పస్ ఫండ్‌ను వైఎస్సార్ మంజూరు చేశారు. 

* జనశ్రీ బీమాలో ఎక్కువ మంది కార్మికులు చేరేవిధంగా ప్రీమియంను రూ. 80 నుంచి రూ. 40 కి తగ్గించి మిగతా రూ. 40 ప్రభుత్వం చెల్లించే విధంగా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. దీనివల్ల లక్షన్నర మంది చేనేత కార్మికులకు ఆరోగ్య ధీమాను వైఎస్ కల్పించారు. 

* నేత కార్మికులు ప్రైవేట్ రుణాల బారిన పడకుండా ఆర్టిజాన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించేందుకు వైఎస్ ఏర్పాటు చేశారు. 

* చేనేతతో పాటు పవర్‌లూం కార్మికులను కూడా ఆదుకునేందుకు వీలుగా విద్యుత్ సబ్సిడీని అందించాలని నిర్ణయించి అమలుచేశారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 77 వేలకు పైగా పవర్‌లూంలకు 2004-05 నుంచి 2008-09 నాటికే రూ. 29.55 కోట్ల విద్యుత్ సబ్సిడీ నిధులను విడుదల చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!