మానవ సంబంధాలు తెలుసుకోవడానికి పుస్తకాలే చదవక్కర్లేదు...
విలువల వెల్లువ పవిత్ర గ్రంథాల్లోనే వెతకక్కర్లేదు...
మాటకోసం ముళ్లబాట పురాణాలలోనే, మహాకావ్యాల్లోనే తరించక్కర్లేదు...
ఏ మానవుడైతే ధర్మాన్ని... సత్యాన్ని...
ఉచ్ఛ్వాస నిశ్వాసగా నమ్మి జీవిస్తాడో...
తానే ఒక మానవ సంబంధాల పుస్తకం, తనే ఒక విలువల గ్రంథం, తనే ఒక మహాకావ్యం!
150 ఎమ్మెల్యేల సంతకాలు ‘నిజం’.
అవి కాదని ప్రజలకోసం పోరాడడం ‘ధర్మం’.
అదే నిజం, అదే ధర్మం సంకెళ్లయితే ఏమవుతుంది?
అదే విలువల పోరాటం చెరసాలను బహుమతిగా ఇస్తే ఏమవుతుంది?
నిజాన్ని, ధర్మాన్ని, ఇచ్చిన మాటను, ఊపిరిపోసుకున్న మానవత్వాన్ని
ప్రతిరోజూ శిలువేస్తుంటే ఏమవుతుంది?
రాజకీయాల్లో మానవత్వం చనిపోతే ఏమవుతుంది?
మరో ప్రజాప్రస్థానం అవుతుంది!
ఓ ప్రజాదేవుని మడమ తిప్పని బాట అవుతుంది...
ఓ ప్రజాభక్తుడి మాట తప్పని బాణం అవుతుంది!
ప్రతి పేద హృదయంలో విలువల పెన్నిధి ఉందని గుర్తిస్తుంది...
గుర్తు తెచ్చుకుంటుంది... వైయస్ షర్మిల!
- ప్రియదర్శిని రామ్
రామ్: మీ తండ్రిగారి సమాధి దగ్గర ప్రార్ధనతో మరో ప్రజాప్రస్థానం మొదలుపెట్టారు. నాన్నతో మీరేం చెప్పారు? నాన్న మీకేం చెప్పారు?
షర్మిల: ఆరోజు పొద్దునే వెళ్లి నాన్న దగ్గర కూర్చుని ‘‘నాన్నా నువ్వెళ్లిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది. ఈ మూడు సంవత్సరాలలో ఈ కుటుంబం ఎన్ని కష్టాలు అనుభవించిందీ... ఈరోజు వరకూ కూడా అన్న ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు...’’ అని జ్ఞాపకం చేసుకున్నా. ఈ మూడు సంవత్సరాలలో పడిన కష్టాల ముందు ఈ మూడువేల కిలోమీటర్లు నాకు ఎక్కువ అనిపించలేదు. కష్టం అనిపించలేదు. ‘‘ఈ రోజు అమాయకుడు అన్న.. నిర్దోషి అయినా జైలులో ఉన్నాడు... దేవా నువ్వు జోసెఫ్‌తో చెరసాలలో ఎలా తోడై ఉన్నావో అన్నతో కూడా నువ్వు తోడుగా ఉన్నావని నేను నమ్ముతున్నాను... ఎలాగైతే నువ్వు జోసెఫ్‌ను ఒక అద్భుతం చేసి జైలు నుంచి తీసుకొచ్చి రాజును చేశావో అలాగే అన్నను చెరసాల నుంచి తీసుకొచ్చి రాజును చేసి ప్రజల సేవ కోసం తప్పకుండా వాడుకుంటావని పూర్తి నమ్మకం ఉంది దేవా’’ అని నేను దేవునికి చెప్పాను. ‘‘నా విశ్వాసమిది. నువ్వు చేస్తావని నువ్విచ్చే ధైర్యంతో వెళ్తున్నాను దేవా’’ అని నాన్నకి, దేవునికి చెప్పి బయల్దేరాను.
రామ్: ఇంత సుదీర్ఘమైన ప్రయాణం... 3వేల కిలోమీటర్లు.. మీ బంధువులు గానీ, స్నేహితులు గానీ ఎవరూ వారించలేదా - ‘చాలా కష్టం తల్లీ.. నువ్వు చేయలేవు.. మానుకో.. పెద్ద తపస్సు అవుతుంది’ అని!
షర్మిల: చెప్పారు. నా మంచి కోరే చాలా చెప్పారు - ‘ఇది చాలా కష్టమమ్మా నీకర్థం కావడం లేదు. బస్సు యాత్ర అయితే సులభంగా ఉండేది నీకు ఇది చాలా కష్టం మళ్లీ ఆలోచన చేసుకో’ అని! కానీ జగనన్న ఈ పాదయాత్ర చేయాలనుకోవడానికి వెనక ఉన్న ఉద్దేశం చాలా గొప్పదని అనిపించింది. ఈరోజు ప్రజలు పడుతున్న కష్టానికి మనం వెళ్లి వారికి ధైర్యం చెప్పి ‘‘ఓపిగ్గా ఉండండి.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.. మీరు నా కుటుంబం... రాజన్న ఎలాగైతే తన బాధ్యతను తాను తీసుకున్నాడో నేను మీ కోసం నిలబడతాను... మీరు నాకు నాన్న ఇచ్చిన కుటుంబం... నేను మీ పక్షాన ఉన్నాను... మీ కష్టాల్లో నేను మీ కోసం పోరాడతాను’’ అని జగనన్న ఈ పాదయాత్ర తనే చేయాలనుకున్నాడు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకు నమ్మకం, ధైర్యం, నిరీక్షణ ఇవ్వడం.. నాన్న ఓ చిన్న చిట్కా చెప్పేవాడు.. ఏదైనా ఒక పెద్ద సమస్య మన ముందు ఉంటే ఆ సమస్యని ఒక్క పెద్ద సమస్యగా చూడకుండా దాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి పరిష్కరిస్తే చాలా సులువవుతుంది అని! దానినే నేను వారికి చెప్పాను.. నేను మూడువేల కిలోమీటర్లు ఒక్కరోజులో నడవడం లేదు కదా... రోజుకు ఓ పదిహేనో, పద్దెనిమిది కిలోమీటర్లో నడుస్తా... నాన్న పాదయాత్రను తల్చుకుని వారు భయపడ్డారు. నాన్న పాదయాత్ర నిజంగానే కష్టంగా ఉండింది. ఎందుకంటే అప్పుడు మండే ఎండలు. చాలా కష్టపడ్డాడు నాన్న.. అందులో నాన్న రోజుకు 25 కిలోమీటర్లు.. 27 కిలోమీటర్లు కూడా నడిచాడు. నాన్న పడిన కష్టం తలుచుకుని వాళ్లు నాకోసం చాలా బాధపడ్డారు. నాన్న బ్రతికుంటే.. అన్న బైట ఉంటే... ఈ పాదయాత్ర కచ్చితంగా నాచేత చేయించేవాళ్లు కాదు. వద్దని చెప్పేవారు. కానీ నేను ముందుగానే చెప్పినట్లు ఉద్దేశం ముఖ్యమైంది కనుక, పోవాల్సిన అవసరం ఉంది కనుక, ఇది చేయాల్సిన అవసరం ఉంది కనుక ముందుకెళ్లడానికి వారు నన్ను అనుమతించారు.
రామ్: మీ మాటల్లో మీ నాన్న ప్రేమ చాలా కనబడుతుంటుంది. మీరు, మీ బాల్యంలో మీ నాన్నతో పంచుకున్న అందమైన స్మృతులేమైనా ఉన్నాయా?
షర్మిల: చాలా ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన ప్రేమ. నేను ఆయన డార్లింగ్‌ని. నన్ను చిన్నప్పుడు తన దగ్గర కూర్చోబెట్టుకుని లెక్కపెట్టి వంద ముద్దులు పెట్టించుకునేవారు. నన్ను చాలా ఆప్యాయంగా, చాలా గారాబంగా చూసుకునేవారు. బాల్యమే కాదు, కడవరకూ... నాన్న నన్ను ఎప్పుడు చూసినా తన గుండెల్లోంచి నవ్వు పుట్టుకొచ్చేది. చిరునవ్వు నవ్వి చెయ్యి చాపేవారు ‘రా బిడ్డా’ అని. నేను దగ్గరకు రాగానే నా బుగ్గమీద ముద్దు పెట్టేవారు. చాలా మంచిగా అనిపించేది.
రామ్: చివరి రోజుల్లో ఏదైనా ముఖ్యమైన సంఘటన ఉందా?
షర్మిల: నేను నాన్నను చివరిగా చూసిన రోజు అది...నాన్న దగ్గర ఉన్నాం. పిల్లలకు కూడా ఏవో సెలవులున్నట్లున్నాయి. పిల్లలు, మేము అందరం ఉన్నాం. రాత్రి నాన్న ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత స్నానం చేశాక కాసేపన్నా కలసి కూర్చుంటాం. ఆ రోజు రాత్రి కూడా అందరం కలసి కూర్చున్నాం. సాధారణంగా నేను నాన్న ఉన్న గదిలోకి వెళ్లగానే ఆయనకు ముద్దుపెట్టి కూర్చుంటా. ఆరోజు ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లున్నా. మాట్లాడు కుంటూ నాన్నను దాటి పోయి వెళ్లి కూర్చున్నా. ఫోన్ మాట్లాడడం అయిపోయింది. నాన్న నా వంక చూసి చేయి చాపాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. లేచి ఆయనవైపు వెళుతుంటే.. ‘మరచిపోతే ఎలా..’ అని అన్నారు. నేను దగ్గరకు వెళ్లగానే నాకు ముద్దుపెట్టారు.
రామ్: అదే ఆఖరుసారి మీరు నాన్నతో ఉన్న రోజు..?
షర్మిల: అవును అదే ఆఖరు.
రామ్: బాల్యం అంతా నాన్నేనా? అన్నయ్య కూడా ఉన్నాడా?
షర్మిల: ఉన్నారండి... ఎందుకు లేరు? అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకొక హీరో. చిన్నప్పుడంతా అన్నయ్య వెనకే తిరిగేదాన్ని. అన్న సైకిల్‌పై వెళితే నేనూ వెళ్లాలనేదాన్ని. నీతో వస్తా.. నీతో వస్తా అని వెంటపడేదాన్ని. అన్నయ్య ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్తుంటే నేనూ వస్తా అనేదాన్ని. ఆయనకు విసుగొచ్చేంత వరకూ అనేదాన్ని. చిన్నపుడు నేను స్లీవ్‌లెస్ వేసుకుంటే నచ్చేది కాదు. ఆయన పద్ధతిగా ఉండేవాడు.. నేనూ పద్ధతిగా ఉండాలనుకునేవాడు. కొంచెం పెద్దయ్యాక స్కూలు, హైస్కూలు, కాలేజీ.. నేనెప్పుడన్నా ఎస్సేలు రాయాలంటే నాకు సహాయపడేవాడు. పరీక్షలు రాయడానికి తనే తీసుకెళ్లేవాడు. చాలా బాధ్యతగా, రక్షణగా ఉండేవాడు. ఇప్పటికి కూడా చాలా బాధ్యతగా మెలగుతాడు. అన్నయ్యకు ఇద్దరు కూతుర్లు. నన్ను తన పెద్ద కూతురుగా చూసుకునేంత పెద్ద మనసుంది.
రామ్: అంత బాధ్యతగా చూసుకున్న అన్నయ్య.. మీరు ప్రజాప్రస్థానానికి వెళ్తానన్నపుడు ఎలా ఫీలయ్యాడు? నిజానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినపుడు మీరు, మీ వదినగారు భారతమ్మ ఇద్దరూ జగన్‌తోపాటు ఉన్నారు. అక్కడేం జరిగింది?
షర్మిల: సుప్రీంకోర్టులో అన్నకు బెయిల్ వస్తుందని అందరం నమ్మాం. నాన్న ఎలాగైతే పాదయాత్ర చేసి ప్రజలకు ధైర్యం చెప్పాడో.. మంచిరోజులొస్తాయని చెప్పాడో.. అదే విధంగా.. అన్న కూడా చేయాలను కున్నాడు. రైతులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు. వారికి చెప్పాల్సిన అవసరముంది. మంచికాలం వస్తుంది, ఓపికపట్టండి అని! అందుకోసమే పాదయాత్ర చేయాలనుకున్నాడు. అందుకోసం రూట్‌మ్యాప్ కూడా తయారు చేసుకున్నాడు. బెయిల్ వస్తుందనే అనుకున్నాం. అందుకే తీర్పు వచ్చే సమయానికి అన్న దగ్గర ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లాం. కొంచెం సేపటికి జడ్జిమెంట్ వచ్చింది. కానీ వ్యతిరేకంగా వచ్చింది. అందరం బాగా నిరాశపడ్డాం. కానీ క్షణాల్లోనే అన్న తేరుకుని ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అప్పుడు నేను అన్నతో - ‘అన్నా ఇంతమందిమి ఉన్నాం.. కానీ నువ్వు ఒక్కడివి అయిపోయావు.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు. మేమందరం బైట ఉన్నాం. నువ్వొక్కడివే కష్టాలు పడుతున్నావు. మేమేం చేయలేమా? నేనేం చేయలేనా? మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నీ కోసం నేనేమైనా చేస్తాను. నా ప్రాణాలైనా ఇస్తానన్నా... చాలా బాధగా ఉంది. నువ్విక్కడుంటే’ అన్నాను. అన్న నా తలమీద చేయిపెట్టి నవ్వాడు. అప్పుడే పుట్టింది ‘మరో ప్రజాప్రస్థానం’.
రామ్:మీరు, భారతిగారు ఇలా బాధపడుతున్నపుడు... జగన్‌కి బాధ లేదా బెయిల్ రాలేదని?
షర్మిల: బెయిల్ రాలేదన్న బాధకంటే తన ముఖంలో స్పష్టంగా తాను పాదయాత్ర చేయలేకపోతున్నాడు అన్న బాధ ఎక్కువగా కనిపించింది. ‘తనకు ప్రజల మధ్యకు వెళ్లాలన్న తపన ఎంతగా ఉందో.. అది చేయలేకపోతున్నానని లోపల ఎంత మధనపడుతున్నాడో’ అని చాలా బాధేస్తున్నది.
రామ్: పాదయాత్ర మీ నాన్నలో మార్పు తెచ్చిందంటారు.... ఓదార్పు యాత్ర జగన్‌ను బాగా మార్చిందంటారు. మరో ప్రజా ప్రస్థానం మిమ్మల్నెలా మార్చింది?
షర్మిల: ఈ పాదయాత్రలో ఎన్నో సంఘటనలు... ఒక అవ్వ వచ్చి ‘‘అమ్మా నా భర్తకి పెన్షన్ వచ్చేది. చంద్రబాబు నాయుడు ఉన్నపుడు 75 రూపాయలొచ్చేది... మీ నాయనొచ్చి 200 రూపాయలు చేశాడమ్మా.. బానే ఉంది కానీ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. బతకడం చాలా కష్టమైపోయింది... నాక్కూడా పెన్షన్ కావాలి అని అధికారులను అడిగాను. నీ భర్త చనిపోయాక నీకిస్తాం అన్నారు’’ అని చెప్పింది. ఒక భార్యతో తన భర్త గురించి అంత చులకనగా మాట్లాడడం మన సాంప్రదాయంలో లేదు. అది చాలా బాధాకరం. అంటే తనకు పెన్షన్ రావాలంటే తన భర్త చనిపో వాలని ఆమె కోరుకోవాలన్నమాట. అంత దారుణమైన పరిస్థితులున్నాయి ఈరోజు రాష్ర్టంలో. అంత పేదరికంలో బతుకుతున్నారు ఈరోజు మహిళలు. తల్లికి తన బిడ్డలను చదివించుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ ఈరోజు తల్లులు బిడ్డలను స్కూలుకు పంపించడం కంటే కూలీకి తీసుకెళ్తే కూలి డబ్బులొస్తాయి. ఆ డబ్బులు రాకపోతే మూడు పూట్లా తినే పరిస్థితి లేదని పిల్లలను స్కూలుకు కూడా పోనీయకుండా కూలికి తీసుకెళ్తున్నారు. వారికిష్టమై కాదు. వారిని స్కూలుకు పంపించాలనే ఉంటుంది మనసులో... కానీ వాళ్లను కూడా తీసుకెళ్లకపోతే డబ్బులు రావు. అన్ని ధరలూ పెరిగిపోయాయి. మూడింతలు, నాల్గింతలు.. ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి. చాలా బాధేస్తుంది. ఓ చిన్నబాబు.. పన్నెండే ళ్లుంటాయి.. అమ్మ లేదు. వాళ్ల నాన్న ఆరోగ్యం బాగోలేదు. మంచాన ఉన్నాడు. దాంతో గొర్రెలను కాచుకోవడానికి ఆ పిల్లాడు వచ్చాడు. ‘ఇంత బాధ్యత ఈ చిన్న పిల్లాడు మోస్తున్నాడా’ అని ఆశ్చర్యమేసింది. ‘ఏం నాన్నా నీకు చదువుకోవాలని లేదా.. స్కూలుకెళ్లాలని లేదా..’ అని అడిగితే ఆ అబ్బాయికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘నాకు ఇష్టమక్కా స్కూలు. కానీ జీవాలను చూసుకోవాలి కదా? నాన్నకి బాగోలేదు కదా’ అన్నాడు. చాలా బాధేసింది. మనసును పిండేసినట్లయిపోయింది. ఇంకోసారి... అస్రీన్ అని ఒక అమ్మాయి.. డిస్టింక్షన్‌లో పాసయ్యింది. బీ ఫార్మసీ చేయాలని ఆమె కోరుకుంది. నా దగ్గరకు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకుంది. ‘నాకు బీ ఫార్మసీ చేయాలనుందక్కా... కానీ మానాన్న బీదోడు.... నన్ను చదివించలేనని అంటున్నాడు... నాకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదు... రాజన్న ఉంటే తప్పకుండా అయిపోయేది.. ఇపుడు నా పరిస్థితి ఏమిటి?’ అని అడిగింది. చాలా బాధేసింది. నిజంగానే నాన్న ఉంటే ఆ పాప కోరిక తీరిపోయేది. ఎంతోమంది పిల్లలు ఈరోజు డ్రాపవుట్స్‌గా మారి ఇంటిదగ్గర కూర్చుంటు న్నారు. లేదంటే కూలిపనికి వెళుతున్నారు. ఇదీ దుస్థితి. నా పాదయాత్ర నాకు ప్రజల జీవితాల విలువ తెలియజెప్పింది. ప్రజల జీవితావసరాల విలువ తెలియజెప్పింది. వాళ్ల అవసరాలను తీర్చడం ఎంత ముఖ్యమో అన్నది స్పష్టంగా కనిపించింది. అలా తీర్చగలిగాడు నాన్న. మళ్లీ అలా కావాలి అంటే అన్న రావాలి. ఆ ఆశ ఉంది.. ఆ రోజు వస్తుంది అని చెప్పడం నా కర్తవ్యంగా మారిపోయింది. ఇంకో విషయం కూడా నాకు చాలా బాగా గుర్తుంది. దస్తగిరి అని ఓ రైతు. తను తన భార్య. పంట వేశాడు. ‘పోయిన సంవత్సరం నాకు లక్షా డెబ్బయివేలు నష్టం వచ్చింది. ఈ సంవత్సరం పంట వేశాం. ఈ సంవత్సరం కూడా ఏమీ లాభం వచ్చేట్లు లేదు. నష్టమే వచ్చేట్లుందమ్మా’అని బాధపడ్డాడు. ‘అప్పులెన్నున్నాయన్నా’ అని నేనడిగా. మూడు లక్షలు అప్పు ఉందని చెప్పాడు. ధైర్యంగా ఉండన్నా అనగానే.. ‘లేదమ్మా ఇక చేనన్నా అమ్మేసుకోవాలి... లేకపోతే పురుగుల మందన్నా తాగాలి... నాకింకో దారిలేదమ్మా’ అన్నాడు. ‘లేదన్నా మంచి కాలం వస్తుంది. మీరు కొంచెం ఓపికపట్టండి.. మీ ప్రాణాలు చాలా విలువైనవి.. మీ చేలు కూడా విలువైనవి అమ్ముకోవద్దు, కొంచెం ఓపిక పట్టండన్నా.. జగనన్న వస్తాడు. మళ్లీ రైతు రాజవుతాడు... తప్పకుండా నాన్న మీ పక్షాన ఎలా నిలబడ్డాడో జగనన్న కూడా నిలబడతాడన్నా’ అని నేనెంత ఒప్పించడానికి ప్రయత్నించినా వారు వినే పరిస్థితిలో లేరు. ‘జగనన్న తప్పకుండా వస్తాడమ్మా.. అంతవరకూ తినడానికి తిండైనా ఉండాలి కదమ్మా, ఇంక దాని బదులు చనిపోవచ్చు గదా’ అని ఆయన భార్య అన్నది. ఆ సమయంలో వారిలో ధైర్యం నింపి సముదాయించడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.
రామ్: మీ పాదయాత్రలో ప్రతిరోజూ చంద్రబాబునాయుడును ఎక్కువగా విమర్శిస్తున్నారనిపించడం లేదా?
షర్మిల: నాన్న ఒక మాట అనేవాడు - విశ్వసనీయతే మనిషికి విలువ నిస్తుంది - అని! అన్న కూడా ఇదే నమ్ముతాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదే విశ్వసనీయత ఉండి ఉంటే మేము విమర్శించే అవసరమే లేదు. చంద్రబాబు మొట్టమొదట కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉండి ఎమ్మెల్యే అయ్యి నాన్న సహాయం చేస్తే మంత్రి అయ్యాడన్న విషయం నాన్నకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. మేమైతే నిజం చెబుతాం. అవతలివారు ఏం చెబుతారో మాకు తెలియదు గానీ... చంద్రబాబు మంత్రి అయ్యారు. ఎన్టీఆర్‌గారు పార్టీ పెడితే ఆ ఎన్నికలలో ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగానైనా పోటీచేస్తానని ప్రగల్భాలు పలికి.. ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి విశ్వసనీయత ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. ఇక్కడ మంత్రిపదవి లేదు.. అక్కడ పదవి కనిపిస్తోంది మామగారి దగ్గర. పెట్టేబేడా సర్దుకుని కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి పదవికోసమని ఎన్టీఆర్ పంచన చేరాడు. అప్పుడు ఈనాడు పత్రికలో ఒక ఆర్టికల్ కూడా వచ్చిందట- ఇల్లరికం వచ్చిన అల్లుడు - అని! పెట్టేబేడా పట్టుకుని ఉన్న చంద్రబాబు కార్టూను కూడా వేశారట. ఎన్టీఆర్ గారు పాపం అంతగా విమర్శించిన చంద్రబాబును చేర్చుకుని.. ఎంత మంది వద్దన్నా పార్టీలో పదవిని కల్పించారు. ఆ మాత్రం కృతజ్ఞతన్నా ఉండాలి కదా మనిషన్నాక. లేదు. పాపం మంచివాడనుకుని పిల్లనిచ్చాడు. ఈయన ఇలాంటోడు అని తెలిసి కూడా పదవిచ్చాడు. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను బంధించో, బెదిరించో వాడుకుని, ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవినే లాగేసుకుని ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఎన్టీఆర్‌గారు పిచ్చోడని ప్రచారం చేశాడు. ఆయన మీద చెప్పులేయించాడు. మానసికంగా హింసించి అన్యాయంగా ఆయనను అర్ధాయుష్షులోనే చంపేశాడు. మొదటి ఎలక్షన్లోనేమో ఎన్టీఆర్ గారి వల్ల ఈయనకు అధికారం వచ్చింది. ఈయన గెలవలేదు. ఎన్టీఆర్ గారి నుంచి లాగేసుకున్నాడు. రెండోసారి 1999లో మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. అప్పటికి కార్గిల్ యుద్ధం వల్ల బీజేపీ పట్ల సానుభూతి ఉంది. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వారి శవాల మీద ఓట్లేరుకుని రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఏమన్నా మంచిపనులు చేశాడా అంటే ఏమీ చేయ లేదు. నాలుగువేల మంది రైతులను పొట్టనపెట్టుకున్నాడు. వారి గోడు ఒక్కరోజు విన్నపాపాన పోలేదు. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే ఒక్క రూపాయి సహాయం చేయలేదు. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. వారి అప్పులను తీర్చడానికి బ్యాంకులతో మాట్లాడి వన్‌టైమ్ సెటిల్ మెంట్ కింద మరో 50 వేల రూపాయలను ఆ రైతులకు సహాయం చేశారు. నాన్నగారు ఎప్పుడూ అనేవారు- రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబునాయుడుగారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు అని! కేజీ బేసిన్‌లో దొరికే గ్యాస్ పైప్‌లైన్‌ల ద్వారా మన రాష్ట్రంలో తక్కువ ధరకు అందరికీ ఇవ్వవచ్చు. రాష్ర్టంలో విద్యుత్ అవసరాలు, గ్యాస్ అవసరాలు తీరతాయి. అలాంటి లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిసీ అన్యాయంగా బంగారుపళ్లెంలో పెట్టి ఇచ్చేశాడు సొంతలాభం కోసం. నాన్న ఎప్పుడూ అనేవాడు- చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు అని! అంతేకాకుండా 2004 ఎన్నికలలో అలిపిరి ఘటనను పోస్టర్లపై అంటించుకుని ఎన్నికలకు వెళ్లాడు సానుభూతి కోసం. ప్రజలు నమ్మలేదు. బుద్ధిచెప్పారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేయాలని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో తన తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశాడో చెప్పడం లేదు. నా రాజ్యం తీసుకొస్తా అని చెప్పడం లేదు. ఆ ధైర్యం లేదు. ఆయనకు తెలుసు ఆయన ఎంత ఘోరంగా పరిపాలన చేశాడో! రాజశేఖరరెడ్డిగారు ఏ మంచి పనులైతే చేశాడో అవన్నీ చేస్తానని చెబుతున్నాడు. పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. గ్యాస్ ధరలు పెంచలేదంట. ఆర్టీసీ ధరలు పెంచలేదంట. కరెంటు చార్జీలు పెంచలేదట. మైకు పట్టుకుని పచ్చి అబద్దాలు చెబు తున్నాడు. హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక మంత్రి ఉండేవాడు. ఆయనకేమీ పనిలేదు. అబద్దాలు ప్రచారం చేయడమే. చంద్రబాబు నాయుడు కూడా ఒకేమాటను పదిసార్లు చెబితే అదే నిజమైపోతుందనుకుంటారు. ఇన్ని చేసి కూడా మళ్లీ ప్రజలను మోసం చేయాలనుకుని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ రోజుకు కూడా తిరుగుతున్నాడంటే ఇంక ఆయన్ను విమర్శించక మమ్మల్నేం చేయమంటారు? ‘‘రాజశేఖరరెడ్డి చాలా బాగా చేశారు.. నేను బాగా చేయలేదు.. నాకు బుద్ధి వచ్చింది. రాజశేఖరరెడ్డిగారు ఏది చేశారో నేను అదే చేస్తాను.. రాజన్న రాజ్యం తెస్తాను..’’ అని చెప్పమనండి... రేపట్నుంచి మానేస్తాం చంద్రబాబును విమర్శించం.
రామ్: వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కాంగ్రెస్ విధేయులు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడన్న సంగతి తెలిసిందే. అలాంటి పార్టీని ఇప్పుడు విమర్శిస్తుంటే మీకు బాగా అనిపిస్తుందా?
షర్మిల: నిజమే... నాన్న ఎప్పుడూ కాంగ్రెస్‌వాదే. ముప్పై ఏళ్లు ఆ పార్టీకి సేవ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పార్టీలోనే ఉన్నాడు. తను పాదయాత్ర చేసిన తర్వాత తనకు వచ్చిన ప్రతిష్టకు ఎంతోమంది ‘పార్టీ పెట్టి నువ్వే గెలవొచ్చు, నువ్వే గెలుస్తావు, పార్టీ పెట్టుకోవచ్చు’ అని సూచించినా.. అదే పార్టీలోనే ఉండాలని, ఉండి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ పథకం ప్రారంభించినా, ఏ కార్యక్రమం చేసినా గాంధీ కుటుంబం పేర్లే పెట్టి చాలా విధేయంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చింది. అది చాలా బాధాకరం. నాన్నగారి వల్ల అధికారంలోకి వచ్చిన పార్టీ అది.. ఇది సత్యం. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా అది నిజం. వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందీ అంటే.. అది కేవలం నాన్నగారి వల్లనే వచ్చింది. ఇంతచేసినా కనీస కృతజ్ఞత లేకుండా... లేని మనిషిని.. అయ్యో.. తను సమాధానం చెప్పుకోలేడే, తను లేడే అని కనీస ఆలోచన లేకుండా రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్.ఐ.ఆర్‌లో చేర్చింది. రాజశేఖరరెడ్డి గారు ఆ పార్టీకి ఎంత విధేయుడుగా ఉన్నాడో, మొదటి నుంచి కూడాజగనన్న అంతే విధేయుడుగా ఉన్నాడు. 150 మంది ఎమ్మెల్మేలు జగనన్న ముఖ్యమంత్రి కావాలని సంతకం పెట్టారు. ఈ వార్త అన్ని పత్రికల్లోనూ వచ్చింది. సంతకం పెట్టించిన వారు కాంగ్రెస్‌లోనే ఉన్నారిప్పుడు.. సంతకం పెట్టిన వారూ కాంగ్రెస్‌లోనే ఉన్నారిప్పుడు. వారే సంతకం పెట్టారు, జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని! కానీ, జగనన్న ఏనాడూ ఆ పేపర్ పట్టుకొని మీడియా ముందుకు వెళ్లి.. ‘ఇదుగో వీళ్ల సంతకాలు నాకున్నాయి, నేనే ముఖ్యమంత్రిని’ అని ప్రకటించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి లాగ వైస్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేలను పెట్టినట్లు.. మేం ఇడుపులపాయలోనో, ఇంట్లోనో వాళ్లను పెట్టుకోలేదు. సంతకాలు ఇవిగో, ఎమ్మెల్యేలు ఇరుగో.. నేనే ముఖ్య మంత్రిని అవుతాను అని జగనన్న చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్‌ని అధికారం కోసం వీడినట్లు, జగనన్న అధికారం కోసం వీడ లేదు. ఎంతో విధేయుడుగా.. అంతమంది సంతకాలు పెట్టినా కూడా.. జగనన్న ప్రణబ్ ముఖర్జీ గారి సాక్షిగా, ఇప్పుడున్న రాష్ట్రపతి గారి సాక్షిగా, రోశయ్యని (సీఎంగా) ప్రతిపాదించారు. నాన్న విధేయుడుగా ఉన్నాడు కనక ఆ పార్టీకి విధేయుడుగా ఉండాలన్న దృష్టితో అలా చేశాడు.. కానీ, నాన్న హఠాన్మరణం తర్వాత నల్లకాలువ సభలో జగనన్న ఒక మాట ఇచ్చాడు - ‘ప్రజలంతా మా కుటుంబం. మీ కోసం నేనున్నాను. నా తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను రానున్న రోజుల్లో పరామర్శిస్తాను’ అని! అప్పటికే మా కుటుంబం చాలా బాధపడుతూ ఉంది. నాన్న పోవడంతో.. శిరస్సు కట్ చేస్తే బాడీ ఎలా ఉంటుందో అలా ఉంది మా పరిస్థితి. అంతటి పరిస్థితిలో ఉండి.. ఒక ఆలోచన చాలా కలచివేసింది. ‘మేం చాలా బాధపడుతూ ఉన్నాం. కానీ, నాన్నగారు చనిపోయారన్న బాధతో 660 మంది ప్రాణాలు వదిలారు. వాళ్లు నాన్నను మాకంటే ఎక్కువ ప్రేమించారా’ అని అనిపించింది. అలాంటి వాళ్లను ఓదార్చడం జగనన్న తన కనీస బాధ్యత అనుకున్నాడు. ఆ తండ్రికి తగ్గ కొడుకుగా కనీస బాధ్యత అనుకొని.. నేను వస్తాను అని మాటిచ్చాడు. అది పర్సనల్.. పార్టీకి సంబంధం లేదు. పర్సనల్‌గా ఒక కొడుకు స్థానంలో ఉండి మాట ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి, ఖమ్మంలలో ఓదార్పు యాత్రలకు వచ్చిన ఆదరణను చూసి.. జగనన్నకు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుందన్న దుగ్ధతో ఓదార్పు యాత్రను కాంగ్రెస్ అధినాయకులు ఆపేయమన్నారు. అర్థం చేసుకునే స్థితిలో వాళ్లు లేరు. అప్పుడు కూడా పార్టీని వదల్లేదు. జగనన్న వీలైన నాయకులందర్నీ అడిగాడు. అన్నతోపాటు అమ్మ, నేను కూడా వెళ్లాం సోనియా గాంధీ గారి దగ్గరకు. ‘అమ్మా మేం మాటిచ్చాం. ఇది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట తప్పలేము’ అని ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వాళ్లు లేరు. అప్పటికీ పార్టీని వదల్లేదు. ఎన్ని రకాలుగా జగనన్నను హింసించి, చిన్న చేసి, ఎంతోమందిని ఆయనకు వ్యతిరేకంగా తయారుచేసి, పొగపెట్టి.. ఇక ఊపిరాడదు అన్న దశలో జగనన్న బయటకు రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి లాగ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాలేదండి! జగనన్న వచ్చిన కారణం.. ఇచ్చిన వాగ్దానం! నాన్న మాకు నేర్పించింది.. ‘ఇచ్చిన మాట మీద నిలబడకపోతే మనకు విలువ ఉండదు’ అనేది. జగనన్న ఈ మాటను పూర్తిగా నమ్మాడు గనక.. ఇచ్చిన మాట తప్పలేకపోయాడు గనక.. ఆ పార్టీలోనే ఉంటే తనను ఓదార్పు యాత్ర చేయనీయరు గనక.. బయటకు రావాల్సి వచ్చింది. మాట ఇచ్చినందుకు జగనన్న ఓదార్పుయాత్ర చేస్తూ ఉంటే.. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు అన్నమాట - ‘చేతి గుర్తును పెట్టుకొని గెలిచి, హైకమాండ్ చెప్పిన మాట కాదని ఎలా ఓదార్పు యాత్ర చేస్తారు?’ అని! నిజానికి గెలిచింది.. ఆ పార్టీని గెలిపించింది.. నాన్న! అది సత్యం. కానీ, ధర్మంగా ఆలోచిస్తే.. ఆ పార్టీ నుంచి గెలిచి, ఆ పార్టీ మాటను కాదనడం ధర్మం అనిపించలేదు. ధర్మం కాదు గనక, ఆ పార్టీలో ఉండి ఆ మాట నిలబెట్టు కునే అవకాశం లేకపోయింది గనుక.. జగనన్న ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. వచ్చి.. ఈరోజు ఆ పార్టీని విమర్శిస్తున్నామూ అంటే.. ఎందుకు విమర్శిస్తున్నాం? ఓదార్పు యాత్రను కాదన్నారు కాబట్టి విమర్శిస్తున్నామా? కాదు గదా! రాజశేఖరరెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేసిన పథకాలను మీరు నీరుగారుస్తున్నారు. ఆరోగ్యశ్రీ అయితేనేం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే నేం, పావలా వడ్డీ అయితే నేం.. ఉపాధి హామీ అయితే నేం.. మీరు ఏదైనా తీసుకోండి.. జలయజ్ఞం అయితే నేం.. రుణ మాఫీ అయితేనేం.. రాజశేఖరరెడ్డి గారిలా చిత్తశుద్ధితో ఈ పథకాలను అమలు చేయమని చెప్పమనండి.. మేం ఎందుకు విమర్శిస్తాం?
రామ్: మీరు జలయజ్ఞం అంటే గుర్తొచ్చింది. నెట్టెంపాడు దగ్గర మీరు చాలా ఉద్వేగానికి గురయ్యారు.. మీరు కంటతడి పెట్టుకున్నారు.. నాన్నను ప్రభుత్వం గుర్తు చేసుకోలేదని!
షర్మిల: నెట్టెంపాడైనా, హంద్రీ నీవా అయినా లేక వారు ప్రారంభోత్సవం చేస్తున్న ఏ ప్రాజెక్టు అయినా.. ఈ రోజు ఆ దశకు వచ్చాయంటే అది నాన్న గారి వల్ల వచ్చాయి. నాన్న గారికి చేయాలనిపించకపోతే.. చిత్తశుద్ధితో చేసి ఉండకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టులు వచ్చేవి కాదు.. ఇన్ని సంవత్సరాలైంది మనకు స్వాతంత్య్రం వచ్చి, ఏ ప్రాజెక్టూ ఈ దశకు రాలేదు. కానీ, ఇలా వచ్చాయీ అంటే అది ఆయన ఉన్న 5 సంవత్సరాలలో జరిగిన పనుల వల్ల. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ వాళ్లు నెట్టెంపాడు అయితేనేమి, హంద్రీ నీవా అయితేనేమి.. ప్రారంభోత్సవం చేస్తూ ఒక్కసారి కూడా రాజశేఖరరెడ్డి గారి పేరును ముఖ్యమంత్రి గారు ఉచ్ఛరించలేదు. నిజానికి వీరికి ఉచ్ఛ రించే అర్హత లేదు. కానీ.. ఆయనకు ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వడం వీళ్ల కనీస బాధ్యత. ఎందుకంటే అది చేసింది రాజశేఖరరెడ్డి గారు. ప్రజలకు తెలుసు. వాళ్లకి కూడా తెలుసు. కానీ, ఈ రోజు ఆయన పేరును కనీసం ప్రస్తావించలేదు. చాలా బాధేసింది. నెట్టెంపాడు నీళ్లను చూస్తే.. నాన్న ఉంటే, నేను నిల్చున్నచోట నాన్న ఉంటే.. ఎంత సంతోషించే వారో అనిపిం చింది. ఒకపక్క చాలా గర్వంగా ఉండింది... నాన్న చేశాడూ ఇది అని. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లొస్తున్నాయంటే చాలా సంతోషమనిపిం చింది. కానీ, ఈ మనుషులను చూస్తే, విలువలు లేని కుళ్లు రాజకీయాలు చూస్తే చాలా బాధేసింది. నాన్న పేరును ఒక్కసారి కూడా అనుకోలేక పోయారు వీళ్లు అని! మనసును చాలా కలచివేసింది. ఎంతోమంది మంత్రులు, రాజ్యసభ సభ్యులు.. చాలా మంది ఉన్నారు. నాన్నగారు చేస్తే, నాన్నగారు ఇస్తే వారు ఆ పదవులను అనుభవిస్తున్నారు. కానీ, నాన్న గారి తరఫున ఏ ఒక్కరూ మాట్లాడలేదు. నాన్న గారి పేరును ఎఫ్.ఐ.ఆర్‌లో చేరుస్తుంటే అందరూ వేడుక చూశారు. చీమకుట్టినట్లయినా అనిపించలేదు వాళ్లకు..
రామ్: ద్రోహం.. ద్రోహం కలచి వేసింది మిమ్మల్ని..!
షర్మిల: అవును.. ఎలా తయారయ్యాయి మన రాజకీయాలు.. నాన్న గారు లేనందుకు బాధేస్తా ఉంది. కానీ, ఈ రోజు రాజకీయాల్లో విలువలు లేనందుకు, మానవత్వం లేనందుకు చాలా చాలా బాధేసింది.
రామ్: ఇన్ని రోజుల పాదయాత్ర తర్వాత రాజకీయం అంటే ఏమి అర్థమైంది?
షర్మిల: చనిపోయింది నాన్న కాదని... చనిపోయింది రాజకీయాల్లోని మానవత్వమని అర్థమైంది. మళ్లీ ఆ మానవత్వం చిగురించాలంటే.. జగనన్న రావాలి. జగనన్న వస్తే తప్ప అది జరగదు.
రామ్: ఈ మొత్తం ప్రయాణంలో మీరు ఏం మిస్సవుతున్నారు..?
షర్మిల: మా కుటుంబం.. అనిల్.. పిల్లలు.. అమ్మను మిస్సవుతున్నాను. అయితే, వాళ్లు వచ్చి నన్ను చూసి వెళ్తున్నారు.. కానీ, నేను బాగా మిస్సయ్యేది అన్నని. ఆయన రాలేడు. నేనూ పోలేను. అన్న లేని లోటూ.. అన్న దూరమైన లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి 52 రోజులైపోయింది అన్నను చూసి... కష్టంగానే ఉంది.
రామ్: పుట్టిన రోజు వేడుకలను ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు?
షర్మిల: నాకు వేడుకైనా, పండగైనా అన్న వచ్చాకే! అప్పటివరకూ ఏమీ లేదు.
రామ్: ఒకరోజు పిల్లలు మీతో పాటు పాదయాత్రలో నడిచారు.. ఎంత అందమైన అనుభూతి..
షర్మిల: (నవ్వుతూ) అవును..
రామ్: మీ కుటుంబం ఎలా స్పందిస్తోంది..? ఇన్ని రోజులు అమ్మ దగ్గర ఉండకపోవడం... భార్య భర్త దగ్గర ఉండకపోవడం.. ఒక్కోసారి వదిన తన మరదలు దగ్గర లేకపోవడం.. అమ్మ తన బిడ్డల దగ్గర లేకపోవడం.. ఈ పరిస్థితిని ఎలా చూస్తున్నారు?
షర్మిల: అమ్మ మామూలే - బాగా తింటున్నావా, బాగా నిద్రపోతున్నావా జాగ్రత్త అని చాలా ఆప్యాయంగా అడుగుతుంది. అన్నకేమో చాలా ఆందోళన - ఇంతమంది జనం. ఇంత నడక ఎలా ఉందీ, ఏమిటీ - అని అడుగుతున్నాడంట! వదినేమో ‘బాగున్నావా పాపా.. జాగ్రత్తమ్మా... జాగ్రత్తగా ఉండు’ అంటుంది. అనిల్ చాలా సహకరిస్తున్నారు. ఆయన, పిల్లలు నన్ను మిస్సవుతున్నారు. మా అబ్బాయి రాజా ఓకే.. అర్థం చేసుకుంటాడనుకుంటున్నాను. ఉద్వేగాలను పెద్దగా బయటకు చెప్పే రకం కాదు. బాగానే ఉన్నట్లు కనపడతాడు.
రామ్: మౌనంగా బాధను భరిస్తున్నాడంటారా?
షర్మిల: అలా ఏం కాదు. బాగానే ఉన్నాడు... జిల్లీని చాలా మిస్సవు తున్నాను.. నేనంటే చాలా తనకు చాలా ప్రేమ. తను మాత్రం ‘అమ్మా.. అమ్మా..’ అంటూ ఇప్పటికీ మెసేజ్‌లు.. ఫోన్లు.. అదేపనిగా చేస్తూ ఉంటుంది. అయితే, అందరూ బాగానే ఉన్నారు.. దేవుని దయవల్ల అంతా బాగానే జరుగుతోంది.. ప్రజలు బాగా స్పందిస్తున్నారు!
రామ్: వైఎస్ అన్న లేని లోటు.. జగన్ గారు దగ్గర లేని లోటు ప్రజలు మీలో చూసుకుంటున్నారు...
షర్మిల: ప్రజలందరూ నాపై ప్రేమను కురిపిస్తున్నారు. ఈ ప్రేమంతా నిజానికి నామీద కాదు. అది నాన్న మీద వారికున్న అభిమానం. అన్న మీద వారికున్న ప్రేమ. రాజన్న, జగనన్న ఇద్దరూ అందుబాటులో లేనందున వారిపై ఉన్న ప్రేమను నాపై చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే.. కొన్నిసార్లు చాలా ఉద్వేగంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది... కాంగ్రెస్-సీబీఐ కుమ్మక్కు రాజకీయాలకు, టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు కొత్తగా మరో తెరలేచింది. టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా ఓటేయకుండా గైర్హాజరయ్యారు..
రామ్: స్పష్టంగా అర్థమవుతుంది.. ఎవరు కుమ్మక్కయ్యారనేది.
షర్మిల: ఎంతో ప్రాధాన్యం ఉన్న ఎఫ్‌డీఐ బిల్లును కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆమోదింపజేయడానికి వీళ్లు గైర్హాజరయ్యారు. కుమ్మక్కు విషయం చాలా స్పష్టంగా, కళ్లకు కట్టినట్టుగా బయటపడింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చక్కటి వాస్తవాన్ని ప్రకటించారు. ములాయం, మాయావతి వంటి వారిని మేనేజ్ చేసుకొని, భయపెట్టి, సీబీఐని వాడుకొని కాంగ్రెస్ బిల్లు పాస్ చేయించుకుంది. అంటే, గెలిచింది కాంగ్రెస్ కాదు, సీబీఐ అని ఆమె అన్నారు. అది నిజం. కాంగ్రెస్ మాట వినే వారి పట్ల, వినని వారి పట్ల వ్యవహరించే తీరులో స్పష్టంగా తేడా ఉంది.
జగనన్న పార్టీ నుంచి బయటకు వచ్చింది నవంబర్ 27న. రెండు రోజుల్లో అంటే నవంబర్ 29 నాటికల్లా ఇన్‌కం టాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసుంది. కానీ, సిబ్బంది కొరత ఉందంటారు. కానీ, జగనన్న మీద మటుకు వందల మందితో కూడిన 29 టీములు వస్తాయి.. బెంగళూరులో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కూడా ఇంటిని సోదా చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో.. 2000 టెలిఫోన్ కాల్స్ టాప్ చేశారు. వివక్ష స్పష్టంగా ఉంది.. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఆజాద్ గారు తిరుపతిలో ఉప ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే కేంద్ర కేబినెట్ మంత్రిగా గానీ, ముఖ్యమంత్రిగా గానీ అయ్యేవారని చెప్పారు. దీన్నెవరూ మళ్లీ విడమర్చి చెప్పక్కర్లేదు, ఆయనే ఒప్పుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయి. కనుకనే, చంద్రబాబు మీద కేసులు పెట్టడం లేదు, విచారణ జరపడం లేదు. అందుకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు. వాళ్లు చెబుతున్నట్లు జగనన్న కుమ్మక్కు రాజకీయాలు చేసుంటే.. జైల్లో ఉండడు. ములాయంసింగ్ యాదవ్ లాగనో, మాయావతి లాగనో ఈయన కూడా వత్తాసు పలికి అధికారం అనుభవించే వాడు.
ముఖ్యమంత్రిగానో, కేంద్ర మంత్రిగానో ఉండే వారు. జగనన్న మాట మీద, విలువల కోసం నిలబడ్డాడు గనక జైల్లో ఉన్నాడు. చంద్రబాబు చీకట్లో చిదంబరంతో మాట్లాడుకుంటాడు. కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ వంటి మంత్రులపై ఎన్ని కేసులున్నా వారికేమీ కాదు. వారికి ఎప్పుడూ ఏమీ కాదు. రాసిస్తుంది మా పార్టీ. కాంగ్రెస్‌లో లేని వారైతే వారికి వ్యతిరేకంగా ఒంటికాలితో వస్తుంది ప్రభుత్వం. ఎవరు కుమ్మక్కవుతున్నదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అన్ని పార్టీలకూ బుద్ధి చెప్పే ఒక రోజంటూ వస్తుంది. ప్రపంచం యావత్తునూ ఆశ్చర్యపరిచేలా జగనన్నకు విజయం చేకూర్చుతారు. ఆ రోజు వస్తుంది.
రామ్: పాదయాత్రలో చాలా మంది శిశువులకు రాజశేఖర్, జగన్, విజయమ్మ అని పేర్లు పెడుతున్నారు కదా. షర్మిల అని పేరు పెట్టాలని మీకు అనిపించలేదా?
షర్మిల: నాన్నా, అమ్మ, అన్న గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తులు. నేను ఇంకా అంత గొప్పదాన్ని అవ్వలేదు. ఇక ముందూ వారి పేర్లే పెడతాను.
రామ్: జగన్ పాదయాత్ర చేసినప్పుడు షర్మిల అని పేరు పెడతారేమో! హాపీ బర్త్ డే.. గాడ్ బ్లెస్ యూ... మీ ఆకాంక్షలన్నీ నెరవేరే రోజు వస్తుందని ఆశిస్తున్నాను.
షర్మిల: (నవ్వుతూ) థాంక్యూ!!
ష్రర్మిల పుట్టినరోజు (డిసెంబర్ 17) సందర్భంగా సాక్షి టీవీలో సోమవారం ప్రసారమైన ప్రత్యేక ఇంటర్వ్యూ

No comments:
Post a Comment