నెల్లూరు,న్యూస్‌లైన్: సహకార సంఘాల ఎన్నికలు సజావుగా జరపకుంటే వైఎస్సార్సీపీ వాటిని బహిష్కరిస్తుందని నెల్లూరు పార్లమెంట్‌సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యుల జాబితా అందజేయాలని, ఓటర్లు నమోదులో అవకతకలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడుతూ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేసుకోవడంలో అధికారులు వైఎస్సార్సీపీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారపార్టీకి చెందిన ఓటర్లను రహస్యప్రదేశాల్లో కూర్చోబెట్టి నమోదు చేస్తున్నారని, ఇది సరైనపద్ధతి కాదన్నారు. ఓటర్లు నమోదు పారదర్శకంగా జరగాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వం నమోదులో అక్రమాలపై ప్రత్యేకంగా విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఆయా సొసైటీల పరిధిలో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాల న్నారు. ఓటర్ల తుదిజాబితా ప్రకటించేముందు బోగస్ ఓటర్ల నమోదుపై వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అనర్హులను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ఓటర్ల నమోదులోనే అక్రమాలు జరిగితే సహకార సంఘాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఏదిఏమైనప్పటికీ సహకార సంఘాల ఎన్నికల్లో నెగ్గేందుకు అధికారపక్షం అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. సమావేశంలో ఉదయగిరి, కోవూరు శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రమణ్యం, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.'
sakshi
No comments:
Post a Comment