YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 16 December 2012

మీరు చంద్రన్న పాలన వస్తుందని చెప్పుకోగలరా?

మేం రాజన్న రాజ్యం వస్తుందని గర్వంగా చెప్పగలం
మీరు చంద్రన్న పాలన వస్తుందని చెప్పుకోగలరా?
చంద్రబాబును ప్రశ్నించిన విజయమ్మ
సీఎం కిరణ్‌దీ బాబు బాటేనని విమర్శ
అందుకే చిత్తూరుజిల్లా నుంచి అధికంగా ఆ పార్టీల నేతలు మా పార్టీలో చేరుతున్నారు
బీ కొత్తకోట సభలో వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి, న్యూస్‌లైన్: ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రె డ్డిలు ప్రజలకు చేసిందేమిటని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. వీరిద్దరిదీ చిత్తూరు జిల్లా అని, చివరకు సొంత జిల్లాకు కూడా వారు ఏమీ చేయలేదని, అందుకే ఈ జిల్లానుంచి పలువురు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. అక్రమంగా సంపాదించి పెట్టుకున్న హెరిటేజ్ సంస్థ కోసం బాబు చిత్తూరు సహకారడెయిరీని మూసివేయించగా, ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆయనబాటనే అనుసరిస్తున్నారన్నారు. రెండున్నరలక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన చిత్తూరు డెయిరీని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. ఆదివారం తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని బీ కొత్తకోటలో జరిగిన బహిరంగసభలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు, ఆయన తల్లి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మకు విజయమ్మ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా విచ్చేసిన అశేషజనవాహినినుద్దేశించి ఆమె మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్త్తుందని చెప్పుకోగలమని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ చంద్రన్న రాజ్యం వస్తుందని చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. రెండు రూపాయల కిలో బి య్యాన్ని ఐదున్నరకు పెంచారని, మద్యనిషేధాన్ని ఎత్తివేశారని.. ఇదేనా బాబు పాలన అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వస్తుంటే, వారు ప్యాకేజీతో వస్తున్నట్టు బాబు ఆరోపిస్తున్నారని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్‌కు తీసుకుని వచ్చిన ఎమ్మెల్యేలకు బాబు అప్పుడెంత ఇచ్చారని విజయమ్మ ప్రశ్నించారు. సీబీఐ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయి, 57వ నిందితుడిగా ఉన్న జగన్‌ను, తొలి నిందితుడిగా చేసి జైలుకు పంపించారన్నారు. జగన్ జైలుకు వెళ్లి 200 రోజులైనా బెయిల్ రానివ్వకుండా కాంగ్రెస్‌తో చీకటిరాజకీయాలు చేస్తున్నారన్నారు.

నాటి బాబు పాలన మాదిరిగానే నేటి కిరణ్ ప్రభుత్వం

ఆనాడు బాబు పాలన ఏ విధంగా ఉందో ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ పాలన కూడా అలానే ఉందని విజయమ్మ విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.140 ఉన్న గ్యాస్, రూ. 305కి పెరగ్గా, కిరణ్ ప్రభుత్వంలో అది రూ.450 అయిందన్నారు. మహానేత వైఎస్ హయాంలో రూ.50 పెంచినా, ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని గుర్తు చేశారు.

అఖిలేష్ భార్యకో న్యాయం, జగన్‌కో న్యాయమా 

పలు అంశాలకు సంబంధించి క్విడ్‌ప్రోకోకు పాల్పడినా యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందున ములాయంసింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు, ఒక న్యాయం, జగన్‌కో న్యాయమా అని విజయమ్మ ప్రశ్నించారు. ఈకేసులో డింపుల్ ఆధికారంలో లేదని, దీంతో ఆమెను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొందని, అయి తే జగన్ ఏ అధికారంలో ఉన్నాడని ఆయనను విచారిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. జగన్ అప్పుడు ఎంపీ కాదని, ఎమ్మెల్యే కాదని, కనీసం క్యాంపు ఆఫీసుకు కూడా రాలేదని గుర్తు చేశారు. మంత్రిగా ఉన్న మోపిదేవిని అరెస్టు చేసి, ధర్మానను విడిచి పెట్టారన్నారు. పార్టీని అమ్ముకుని కోట్ల రూపాయలు దండుకున్న చిరంజీవికి బహుమానంగా మంత్రి పదవి ఇచ్చారన్నారు. నేడు 26జీవోలు సక్రమమేనని వాదిస్తున్నారని, జగన్‌పై కేసు నమోదైనపుడు కోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చే యలేక పోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే జగన్ ఉంటే సీఎం అయి ఉండేవాడని ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను వీడినందున ఆయనను జైలుకు పంపారని అన్నారు. జగన్ త్వరలోనే జైలు నుంచి వస్తారని, వైఎస్ కన్న కలలను నిజం చేస్తారన్నారు.

కుమ్మక్కు రాజకీయాలు చూడలేకే వెలుపలకు: ప్రవీణ్‌కుమార్ రెడ్డి

టీడీపీకి ముప్పయ్ ఏళ్లుగా తన తండ్రి ఉమాశంకర్‌రెఢ్డి హయాం నుంచి సేవలందిస్తున్నామని, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు భరించలేకే పార్టీని వీడాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్‌రెడ్డి చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ తాము ప్యాకేజీ తీసుకున్నట్టు బాబు ఆరోపిస్తున్నారనీ, తాము తీసుకున్న ప్యాకేజీ వైఎస్ పథకాలను పునరుద్ధరించాలనడమేనని అన్నారు. 2014లో టీడీపీ కాలగర్భంలో కలసి పోతుందని, తరువాత పుస్తకాల్లోనే ఆ పార్టీ గురించి చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రోజా, నారాయణస్వామి, ఏఎస్.మనోహర్, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, లక్ష్మీదేవమ్మ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!