అక్షర క్రమం, సంఖ్యాపరంగా కాంగ్రెసే ముందుంటుంది తెలంగాణపై ముందుగా వారి అభిప్రాయం చెప్పాల్సిందే డొంకతిరుగుడు మాటలతో తప్పించుకోవడం కుదరదు నిర్ణయాధికారం కేంద్రప్రభుత్వానిది, కాంగ్రెస్‌ది కాదు అవగాహన కోసమే అఖిలపక్షమనడం భావదారిద్య్రం అసంతృప్తులను బుజ్జగించడానికే అఖిలపక్షం నాటకం మా పార్టీనుంచి ఒకే అభిప్రాయం వెల్లడిస్తాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఈ నెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ఒక రాజకీయ పార్టీ హోదాలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసి తీరాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి శనివారంనాడిక్కడ పార్టీ ముఖ్య నేతలు కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌సింగ్ ఠాకూర్, జిట్టా బాలకృష్ణారెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీలో తమ వైఖరేంటో చెప్పబోమని, కేవలం వింటామని కాంగ్రెస్ నేతలు అనడాన్ని ఆయన తప్పుపట్టారు. మీరేమైనా న్యాయమూర్తులా... లేక న్యాయ నిర్ణేతలా... ఊరికే వినడానికి? అని ప్రశ్నించారు. ఈ భేటీకి హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ ఆహ్వానాలు పంపిన ఎనిమిది రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ ఒకటని... టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు ఎలాగో ఆ పార్టీ కూడా అంతేనని ఆయన గుర్తు చేశారు. అక్షర క్రమం ప్రకారం చూసినా, సంఖ్యాపరంగా చూసినా కాంగ్రెసే ముందుంటుంది కనుక ఆ పార్టీయే అందరి కన్నా ముందుగా తెలంగాణపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి వెళ్లినపుడు తమ పార్టీ ఆ విధంగా కోరుతుందని కూడా మైసూరా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ తన వైఖరేంటో చెప్పకుండా తప్పించుకుంటానంటే కుదరదని, ఆ పప్పులేమీ ఉడకవని స్పష్టంచేశారు. జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతిలో నిర్ణయాధికారం ఉంటుందని, కాంగ్రెస్ మాత్రం ఒక రాజకీయ పక్షం లాంటిదేనని ఆయన వివరించారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను ఆహ్వానించడానికి సంబంధించి తీర్మానం లోక్‌సభలో వచ్చినపుడు తమ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడానికి హోంశాఖ అఖిలపక్ష భేటీ అనే నాటకానికి తెరతీసిందని, అందువల్ల దీంట్లో కాంగ్రెస్ వేషం వేసుకుని తన పాత్ర పోషించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. షిండేది భావదారిద్య్రం: కేవలం అవగాహన కోసమే అఖిలపక్షం ఏర్పాటు చేశామని చెప్పడం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే భావదారిద్య్రానికి నిదర్శనమని మైసూరా ధ్వజమెత్తారు. హోంమంత్రిగా ఎవరున్నా ఆ శాఖ పని నిరంతరం కొనసాగుతుండే ప్రక్రియ అని, ఈ అంశంపై ఇప్పటికే ఏం జరిగిందో ఫైళ్లలో ఉంటాయని, వాటిని చూసి కొత్తగా వచ్చిన వారు అవగాహన చేసుకోవచ్చని చెప్పారు. దీనిపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఉందన్నారు. వీటిని కాదని మంత్రి మారినప్పుడల్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యను తెలుసుకుంటాననడం చూస్తే అసలు షిండే దేశానికి హోంమంత్రిగా పనికి వస్తారో రారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చేది, తెచ్చేది తామే కనుక కాంగ్రెస్ తెలంగాణపై తమ వైఖరి చెప్పాల్సిన అవసరం లేదని చెబుతూండటాన్ని విలేకరులు ప్రస్తావించగా... తెచ్చేది, ఇచ్చేది, చచ్చేది కేంద్ర ప్రభుత్వమే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదని, అఖిలపక్షం కూడా కేంద్రమే నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ పార్టీ నుంచి ఒకే అభిప్రాయం ఉంటుందని 28వతేదీ లోపే నేతలు సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ వాదుల నుంచి, టీజేఏసీ నుంచి తమకు విజ్ఞప్తులు అందాయని నిర్ణయం తీసుకునేటపుడు పార్టీ వాటన్నింటినీ పరిశీలిస్తుందని మైసూరా తెలిపారు. |
Saturday, 22 December 2012
కాంగ్రెస్ వైఖరి చెప్పాల్సిందే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment