సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేనందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను బుధవారం ఆయన ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కుట్ర పన్ని జైల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జగన్ ములాఖత్‌లను పర్యవేక్షించి ఆయన్ను ఎవరూ కలవకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. దేశంలో చాలా మంది నాయకులపై సీబీఐ విచారణలు, ఆరోపణలు ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందునే వారిని పట్టిం చుకోవడంలేదని విమర్శించారు.
కానీ ప్రజల మేలుకోరే జగన్ యూపీఏకు అనుకూలంగా లేనందుకే ఆయన్ను జైలుపాలు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత యనమల రామకృష్ణలకు జగన్ భయం పట్టుకుందన్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన యనమల.. వైఎస్ కుటుంబంపై కక్ష గట్టి జైలు అధికారుల కాల్ జాబితా, జగన్‌కు సౌకర్యాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. వస్తున్నా.. మీకోసం యాత్ర చేపట్టిన చంద్రబాబు ప్రజా సమస్యలపై కాకుండా తన సమస్యలను ప్రజలకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయతీ లేని వ్యక్తులైన సీఎం కిరణ్ ఇందిరమ్మ బాటతో, చంద్రబాబు ‘వస్తున్నా.. మీకోసం’తో రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు.
కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు: కొండా మురళి
తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దుయ్యబట్టారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను బుధవారం ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్షానికి ఎవర్ని పంపించాలనే అంశంపై మరో రెండు రోజుల్లో పార్టీ కార్యాలయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కొండా సురేఖ, కేసీఆర్‌ల వివాదం గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘మూడు నెలల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్‌ను ఎలా తెలంగాణ తెస్తారని నిలదీసినందుకు తన స్థాయి మరిచి సురేఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొండా దంపతుల కృషి వల్లే తెలంగాణ వస్తుంది తప్ప.. 13 ఏళ్లుగా ప్రజలను మోసగించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న కేసీఆర్ వల్ల రాదు’’ అని మురళి స్పష్టంచేశారు.
No comments:
Post a Comment