మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌వేనంటూ ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది మేధోమథన సదస్సు కాదని, అబద్ధాలు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నదని ఎద్దేవా చేశారు. వైఎస్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవే అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు ఆ పథకాలను ప్రవేశపెట్టారని నిలదీశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటివరకు ఇలాంటి పథకం దేశంలోనే కాదుకదా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కాంగ్రెస్ నేత ఆజాద్ మాత్రం సోనియాగాంధీ చెప్తేనే వైఎస్ చేశారని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆజాద్ ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు? అంతెందుకు.. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదు? ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆజాద్ గొప్పగా చెప్పారు. మరి ఇతర రాష్ట్రాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయలేకపోయారు’’ అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పథకం రాజశేఖరరెడ్డి మదిలో నుంచి వచ్చినది కాదా అని అంబటి నిలదీశారు. చిరంజీవీ సిగ్గేయట్లేదా: జగన్‌ను విమర్శించే ముందు చిరంజీవి ఒకసారి ఆయన ముఖం అద్దంలో చూసుకోవాలని అంబటి అన్నారు. ‘‘చిరంజీవి గారూ.. ఏ షరతును అనుసరించి కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నారు? ఏ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో మీ మనుషులకు మంత్రి పదవులిప్పించుకున్నారు? చెన్నైలో మీ బంధువుల ఇంట్లో మంచం కింద దొరికిన కోట్లాది రూపాయలు ఎక్కడివి? వాటికి లెక్క ఉండదు. విచారణ ఉండదు. ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తి జగన్‌ను విమర్శిస్తుంటే ప్రజలు సహించలేకపోతున్నారు’’ అని అన్నారు. జగన్ జైల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారని చెప్పడానికి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న చిరంజీవికి సిగ్గేయట్లేదా అని మండిపడ్డారు. పదవుల కోసం అడ్డమైన గడ్డీ తినే చిరంజీవిలాంటి వ్యక్తులకు జగన్ పేరెత్తే అర్హత లేదని స్పష్టం చేశారు. ‘‘తెల్లరేషన్ కార్డు ఉన్న వారిని అడ్డం పెట్టుకుని లిక్కర్ వ్యాపారం చేసే బొత్స సత్తిబాబూ నీ బతుకేమిటో రాష్ట్ర ప్రజానికానికీ తెలుసు’’ అని అంబటి మండిపడ్డారు. కుమార్తె పెళ్లికి ఖర్చు చేసిన రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో వెల్లడించాలన్నారు. బొత్సకు సిగ్గు, శరం ఉంటే ఆయనపై వస్తున్న విమర్శలపై విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. |
Monday, 17 December 2012
అది అబద్ధాల సదస్సు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment