చార్జిషీట్‌లో లేని జగన్ పేరును.. జీవోల్లో ప్రస్తావించిన ప్రభుత్వం చార్జిషీటులో 22 పేర్లు, అదనపు చార్జిషీటులో 7 పేర్లు ఉంటే సర్కారీ జీవోలో 31 పేర్లు దర్శనమిచ్చిన వైనం హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం లేని ఓ కేసులో ప్రభుత్వం ఆయన్ను నిందితుడిగా పేర్కొంది. పులివెందుల పోలీస్ స్టేషన్ పరిధిలో 2009లో పోలీసులు నమోదు చేసిన మూడు కేసులను ఉపసంహరించుకుంటూ సర్కారు సోమవారం జీవోలిచ్చింది. ఈ కేసులతో ఏ మాత్రం సంబంధంలేని కడప ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డిని ఈ జీవోల్లో నిందితునిగా చూపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అటు ఎఫ్‌ఐఆర్‌లోగానీ, ఇటు చార్జిషీట్, అదనపు చార్జీషీట్‌లో గానీ లేని జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రభుత్వం ఏకంగా నిందితునిగా పేర్కొంటూ జీవోలు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్‌ను నిందితునిగా పేర్కొందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ కేసు: సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి 2009లో దీక్ష చేపట్టారు. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యకు నిరసనగా కొందరు ఆందోళనకారులు స్థానిక టెలికాం టవర్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనికిగాను పులివెందుల పోలీసులు ప్రజా ఆస్తుల విధ్వంస చట్టంలోని పలు సెక్షన్ల కింద 19.12.2009న కేసు నమోదు చేశారు. 60 నుంచి 70 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనలో పాలుపంచుకున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తరువాత విచారణ జరిపిన పోలీసులు 22 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు కడప అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అటు తరువాత మరో ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ అదనపు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే అదనపు చార్జిషీటును కోర్టు తిరస్కరించింది. కోర్టు తిరస్కరించిన ఆ అదనపు చార్జిషీట్‌లో సైతం జగన్‌మోహన్‌రెడ్డి పేరు ఎక్కడా లేదు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం స్థానిక కోర్టు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన ప్రభుత్వం నిందితులకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు లేనందున, ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలివ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి దామోదర్ పేరు మీద సోమవారం ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నంబర్లు 2358, 2359, 2360) జారీ అయ్యాయి. చార్జిషీట్‌లో లేని పేర్లు జీవోలో ప్రత్యక్షం.. వాస్తవానికి పోలీసులు వేర్వేరుగా అప్పట్లో మొత్తం మూడు కేసులు (క్రైమ్ నంబర్లు 191/2009, 192/2009, 193/2009) నమోదు చేశారు. ఘటన సందర్భంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. విచారణ జరిపి కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో 22 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో జగన్‌మోహన్‌రెడ్డి లేరు. తరువాత అదనంగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో మరో ఏడుగురి పేర్లను(23వ నంబరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి 29వ నంబరు టింబర్ డిపో హరి వరకు) చేర్చారు. అయితే ఈ కేసులపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం సోమవారం జారీ చేసిన మూడు జీవోల్లో ఆశ్చర్యకరంగా 22 మందికి అదనంగా మరో 9 పేర్లు ప్రత్యక్షమయ్యాయి. అదనంగా చేరిన ఈ 9 పేర్లలో జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సమీప బంధువు వై.ఎస్.భాస్కర్‌రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం జీవోలో జగన్‌ను 30వ నిందితునిగా పేర్కొంది. పోలీసులు దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్నా, 22 మంది నిందితులతో కలుపుకొంటే మొత్తం 29 మందే అవుతారు. కానీ ప్రభుత్వ జీవోలో మాత్రం మొత్తం నిందితులు 31 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. చార్జిషీట్లలో లేని జగన్‌మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లను విచిత్రంగా ప్రభుత్వం జీవోల్లో చేర్చడం గమనార్హం. |
Monday, 17 December 2012
లేని నింద.. జగన్ మీద
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment