ఇందిర: నిన్న జగన్‌గారిని కలిశారు కదా... ఏమన్నారు?
షర్మిల: వెళ్లగానే కౌగిలించుకుని, చాలా కన్సర్న్‌గా ‘ఎలా ఉన్నావు?’ అని అడిగాడు. కాలి గాయం గురించి కాసేపు మాట్లాడాక, నేనే పాదయాత్ర ఆపినందుకు చాలా బాధగా ఉందని చెప్పాను. వెంటనే అన్న ‘వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం... ముందు నువ్వు బాగవడం ముఖ్యం’ అన్నాడు.
ఇందిర: మీ పాదయాత్రకు బ్రేక్ పడింది కదా... నెక్ట్స్ స్టెప్ గురించి ప్రస్తావన వచ్చిందా?
షర్మిల: అన్న నా గురించి మాత్రమే ఆలోచించాడు... నేను మాత్రం అన్న వచ్చేదాకా చేయగలిగి ఉంటే బాగుండేదని అనుకున్నాను. ఎనీహౌ నాకు నయమయ్యే లోపల అన్న బయటికొస్తాడని అందరం ఆశిస్తున్నాం... అప్పుడు తనే చేస్తాడు ఈ పాదయాత్ర!
ఇందిర: మీరు పాదయాత్ర చేస్తారనగానే... మీరు మరో పవర్ సెంటర్ అవుతారని కొందరు చెవులు కొరుక్కున్నారు...
షర్మిల: నేను అన్నకు ప్రత్యామ్నాయాన్ని కాదు, కేవలం ఆయన ప్రతినిధిని! ఆయన్ను రిప్లేస్ చేయగలిగిన వ్యక్తిని అంతకన్నా కాదు. ప్రస్తుతం తను మనకు అందుబాటులో లేడు కాబట్టి, ఆ ఖాళీని తాత్కాలికంగా భర్తీ చేయడానికి, పార్టీకి నావంతు సహాయాన్ని, సహకారాన్ని అందించడానికి వచ్చిన వ్యక్తిని మాత్రమే! అందుకే పదేపదే చెప్పాను... ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని! మా మధ్య ఎవరు ఎన్ని విభేదాలు సృష్టించాలనుకున్నా అది జరగని పని! నాన్న నాకు, అన్నకు మధ్య దృఢమైన బంధం ఉండేట్టు పెంచారు. ఆయన ఎప్పుడూ అనేవారు - అధికారం, డబ్బు - ఎప్పుడూ వచ్చిపోతుంటాయి కానీ, మనుషులు, అనుబంధాలు - ఒక్కసారి పోగొట్టుకుంటే జీవితంలో తిరిగి రావు - అని! ఆ విలువ నాకు, అన్నకు బాగా తెలుసు కాబట్టి... అలాంటివి ఎప్పుడూ రావు!
ఇందిర: నాన్నకి, అన్నకి మధ్య ఉన్న సారూప్యత, వ్యత్యాసం...
షర్మిల: ఇద్దరికీ ఆడవాళ్లంటే విపరీతమైన అభిమానం, గౌరవం! వాళ్ల భావాలకి, వాళ్ల ఆలోచనలకి, వాళ్ల వ్యక్తిత్వానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ ధైర్యం, మాటమీద నిలబడ్డం ఎక్కువ. ఇద్దరిదీ విశాలమైన హృదయం. ఇద్దరికీ క్షమాగుణం ఎక్కువ. ఇక ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే... నాన్న ఎవరినైనా నమ్మేసేవారు. ఆయన కొందరిని నమ్మి మోసపోయిన విషయాన్ని అన్న కళ్లారా చూడడంతో, అన్నకు జాగ్రత్త వచ్చిందనుకుంటా! అయితే, ఒక్క మనుషుల విషయంలోనే కాదు, ఒక మాట అనాలన్నా, ఒక పని చేయాలన్నా...అన్న ఆచితూచి వ్యవహరిస్తాడు.
ఇందిర: అంత ఆచితూచి వ్యవహరించే మనిషి... ఇన్ని కష్టాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ నుంచి బయటికి ఎందుకొచ్చారు?
షర్మిల: Sometimes commitment becomes more important than consequences. దేనికోసం నిలబడ్డామన్నది ఆలోచించకుండా, ముందు ముందు ఏమేం ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆలోచించడం పిరికివాడి లక్షణం. పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పడం దారుణం. అది చేయలేకే అన్న బయటికొచ్చేశాడు.
ఇందిర: నాన్న ఉన్నప్పటికీ, ఇప్పటికీ... అన్నలో వచ్చిన మార్పు....
షర్మిల: అన్న చిన్నప్పటినుంచీ బాధ్యతగా పెరిగిన వ్యక్తి. ఆలోచించకుండా, ఎమోషనల్‌గా ఏదీ చేసేవాడు కాదు. ఇప్పుడూ అంతే! అయితే ఇప్పుడు ఇంకొంచెం మెచ్యూర్డ్‌గా, ఇంకొంచెం బాధ్యతగాయుతంగా మెలగడం తన బాధ్యత అనుకుంటున్నాడు. అందుకే ఏం చేసినా నాన్నకి, దేవునికి సమాధానం చెప్పుకునేలా ఉండాలి అని తరచూ అంటూ ఉంటాడు... ఆలోచిస్తూ ఉంటాడు... జాగ్రత్తగా మెలుగుతున్నాడు కూడా!
ఇందిర: మరి మీ ఇద్దరి అనుబంధం విషయంలో..
షర్మిల: నాన్న పోయిన కొత్తల్లో... ఓరోజు అమ్మ నా గురించి ఎందుకో చాలా బెంగపడిందట! అదేరోజు ప్రేయర్ టైంలో అన్నతో - ‘ఇకనుంచి నువ్వు షర్మిని నీ పెద్దకూతురు అనుకో’ అని అందట! వెంటనే అన్న - ‘అదసలు నువ్వు నాకు చెప్పాల్సిన విషయమా’ అన్నట్టుగా అమ్మ వంక చూసి, చేయి పట్టుకుని తల ఊపాడట! తన ఎక్స్‌ప్రెషన్ చూడగానే అమ్మకు కొన్నేళ్ల క్రితం నాన్న అలాగే నా గురించి బెంగపడ్డ సందర్భంలో అన్న నాన్నతో అన్న మాటలు గుర్తొచ్చాయట - ‘ఎందుకు నాన్నా, మీరు షర్మి గురించి బెంగపడతారు? మీ తర్వాత నన్ను మించిన శ్రేయోభిలాషి ఈ భూమి మీద పాపకు ఇంకెవరుంటారు’ అని! ఆ మాటలు గుర్తు రాగానే అమ్మకు అనిపించిందట... తను అప్పుడు పైకి ఏమీ అనకపోయినా, నా విషయంలో అన్నకి కమిట్‌మెంట్ సంపూర్ణంగా ఉందని, తనకి నన్ను సొంత బిడ్డలా చూసుకునే పెద్దమనసు ఉందని! ఇంతకన్నా ఏం చెప్పను అన్న గురించి.. మా అనుబంధం గురించి!
ఇందిర: అన్న విషయంలో ఏం మిస్సవుతున్నారు?
షర్మిల: సెక్యూరిటీ! అన్న పక్కనుంటే ధైర్యంగా అనిపిస్తుంది. బట్ ఇదంతా తాత్కాలికమే... దేవుని దయవల్ల అన్న త్వరగానే బయటికొస్తాడు.
ఇందిర: దేవుని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్ట్టి అడుగుతున్నాను - ఇంత జరుగుతున్న ఈ సమయంలో అన్నకు దేవుని మీద నమ్మకం సడలిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
షర్మిల: లేదు సరికదా... ఎక్కువైంది! నిన్న కూడా అంటున్నాడు - ‘14వ లోక్‌సభలో ఐదున్నర లక్షల అత్యంత మెజారిటీ వచ్చిందంటే, అది దేవుని అండలేకుండా సాధ్యమా? ఇన్నేళ్లయినా నాన్నమీద ప్రజల్లో ఇంత అభిమానం ఉందంటే... అది ఒక్క నాన్నవల్లో, మన వల్లో సాధ్యమా? పాపా, లైఫ్‌లో ఇంతదూరం వచ్చామంటే అదంతా దేవుని దయవల్లే’ అన్నాడు.
ఇందిర: మరి దేవుడు వేసిన ఈ శిక్షను ఎలా అర్థం చేసుకున్నారు?
షర్మిల: అసలు మీరు ఇది శిక్ష అని ఎందుకనుకుంటున్నారు? నో డౌట్... మానసికంగా, శారీరకంగా మా అందరికీ ఇది బాధ కలగజేసి ఉండవచ్చు. కానీ, ప్రతి బాధని శిక్ష అనుకోవడానికి వీల్లేదు. అసలు జీసస్ క్రైస్త్ జీవితాన్నే తీసుకోండి... ఆయన అందరి పాపాల్ని మోసి, శిలువ మీద చనిపోయాడంటే, దాన్ని ఆయనకు వేసిన శిక్ష అనుకుంటామా? దానికీ ఒక పర్పస్ ఉంది. అందరి పాపాల్ని మోయడానికి అలా జరిగిందే కానీ, అది శిక్ష అనుకుంటే ఎలా? ప్రతి కష్టం దేవుడు వేసిన శిక్ష అని భావించకూడదు.
ఇందిర: ఈ పరిణామాల్ని మీ ఫ్యామిలీ ఎలా తీసుకుంది?
షర్మిల: అన్న త్వరగా బయటికి రావాలని అనిల్ రెగ్యులర్‌గా ప్రేయర్స్ చేస్తుంటాడు. తనకి అన్న అంటే చాలా గౌరవం, ఇష్టం! అన్నకి కూడా అనిల్ అంటే చాలా అభిమానం. (నవ్వుతూ) ఎవరూ అనుకోరు కానీ, ఇద్దరూ రాజకీయాల గురించి బాగానే చర్చించుకుంటుంటారు. ఇక పిల్లల విషయానికొస్తే... రాజాబాబు, జిల్లీ వాళ్ల మామకు ఎందుకిలా జరిగిందని బోలెడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు... అప్పుడప్పుడు కోపాన్ని కూడా వ్యక్తపరుస్తుంటారు. నేను పిల్లలకు చెప్పాను - ఈ లోకంలో అంతా పర్ఫెక్ట్ కాదు. అన్యాయం అన్నిచోట్లా జరుగుతుంది. కానీ, దేవుడి నిర్ణయమే తుది నిర్ణయం. ఆయన మంచివాళ్లకు ఎప్పుడూ మంచే చేస్తాడు.
ఇందిర: ఫైనల్లీ... మీ అన్నలో ఉన్న స్పెషాలిటీ...
షర్మిల: (నవ్వేసి) బెస్ట్ బ్రదర్ వన్ కెన్ హ్యావ్! అది పక్కనపెడితే, తనకున్న పాషన్, కమిట్‌మెంట్, కరేజ్. అన్నిటికీ మించి... కేవలం మాటమీద నిలబడినందుకు ఇన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం సడలని తన వ్యక్తిత్వం!
No comments:
Post a Comment