ఇందిర: జగన్ గారి గురించి... మీ అనుబంధం గురించి... భారతి: నాకు 22, తనకు 23 ఉన్నప్పుడు మా పెళ్లయింది. ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. నా పక్కన తను లేకపోవడాన్ని ప్రతి పనిలో మిస్సవుతున్నాను. ఒక పుస్తకం చదివినా, ఒక కథ చదివినా, ఒక దేవుని మాట విన్నా, చదివినా ఆయనకు చెప్పాల్సిందే... ఏదైనా తనతో షేర్ చేసుకోకుండా ఉండలేను. తనతో మాట్లాడుతూ ఉండాల్సిందే... అదేదో అలవాటైపోయింది... పెళ్లయిన కొత్తల్లో అయితే నువ్వు చదివినవన్నీ చెప్పాలా? అనేవారు. (నవ్వుతూ) వినాల్సిందే అనేదాన్ని! అయితే, నేను కూడా కొన్ని రోజుల తర్వాత తనకు ఏవి నచ్చుతాయో అవే చదవడం మొదలెట్టాను. జనరల్‌గా సొల్లు కొట్టడం జగన్‌కు ఇష్టం ఉండదు.మాట్లాడే మాటల్లో విలువ ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఎవరైనా సొల్లు చెప్తే - ‘పనికొచ్చేవి మాట్లాడితే బాగుంటుంది... పనికిరాని మాటలు ఎంతసేపు మాట్లాడినా ఏం వుంటుంది’ అంటాడు. నేను కూడా అలానే ట్యూన్ అయ్యాను! ఇందిర: ఆయనకు ఇప్పుడు మునుపటికన్నా ఎక్కువ తీరిక ఉంది కదా... ఎలా గడుపుతున్నారు? భారతి: బాగా చదువుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి, ఏమేం చేయగలం, భౌగోళిక పరిస్థితులు, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కావలసిన వనరుల గురించి, నదుల గురించి స్టడీ చేస్తున్నాడు. రాష్ర్టంలో, దేశంలో జరుగుతున్న ఇష్యూస్ ఎఫ్‌డీఐ, రిజర్వేషన్స్ మీద క్షుణ్ణమైన అవగాహనకోసం లోతైన అధ్యయనం చేస్తున్నాడు. వాటికి సంబంధించిన బుక్స్, పేపర్స్ తెప్పించుకుంటాడు. వీటిని ఎలా పరిష్కరించాలో కూడా సమస్య లోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తున్నాడు. ఇవికాక, నేనేదైనా పుస్తకాలు చదివితే వాటిలోని మంచి అంశాలను వినడం, అప్పుడప్పుడు చదవడం ఇష్టపడతాడు. మరీముఖ్యంగా లీడర్‌షిప్ పుస్తకాలంటే ఇష్టం... మహాత్మాగాంధీ, లింకన్, చర్చిల్ లాంటి పెద్దపెద్ద నాయకులు ఒక సిట్యూయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేశారో తెలుసుకోవడం ఇష్టం. అందుకని అటువంటివాళ్ల పుస్తకాలు చదివినప్పుడల్లా చెబుతూ ఉంటాను. ఇందిర: ములాఖత్ గురించి... భారతి: నేను వారానికి రెండుసార్లు వెళ్లి జగన్ను కలుస్తాను. ఒక గంట సమయం దొరుకుతుంది... దానిలో చేసే పనుల గురించి మాట్లాడడమే సరిపోతుంది. పిల్లల గురించి కూడా ఒక రెండు వాక్యాలు తప్పించి, ... పర్సనల్‌గా మాట్లాడుకోవడానికి టైం ఉండదు. అందుకే, నాకు చెప్పాలని అనిపించినవన్నీ ఒక లెటర్లో రాసి ఇస్తూ ఉంటా. ఇందిర: పిల్లలకు రిప్లై ఇచ్చినట్టు మీకూ ఇస్తారా? భారతి: నెలకు ఒకసారి వస్తుంది. (నవ్వుతూ) జగన్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. అది కూడా ఎక్కువే! ఇందిర: జగన్‌గారిలో మీకు నచ్చే అంశాలు... భారతి: పర్సనల్లీ... అన్నీ నచ్చుతాయి. జనరల్లీ మనుషుల్లో ఎవరికైనా ఒకరు నడిచేతీరు నచ్చదు, ఒకరు మాట్లాడే తీరు నచ్చదు, ఒకరు తినే తీరు నచ్చకపోవచ్చు.... కానీ జగన్‌లో నాకు నచ్చని అంశం అంటూ ఒక్కటి కూడా లేదు. ఇక ఒక వ్యక్తిగా, లీడర్‌గా... తను దేనికీ భయపడడు, తొందరపడడు, దేని గురించి నెగిటివ్‌గా ఆలోచించడం ఇష్టపడడు, చిరాకు పడడు... టెన్షన్ పడడు. బెయిల్ వస్తుంది... రాదు... అంటూ ఇంత ఊగిసలాట జరుగుతోంది కదా... అయినా చాలా కామ్‌గా ఉంటాడు... అదే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాదు, తను చాలా పాజటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. బయట ఇంతగా భయాలు ఉంటాయి కదా... అవన్నీ తనకు చెప్పడానికి ప్రయత్నిస్తే, రివర్స్‌లో తను మాకు చెబుతాడు - దేవుడ్ని నమ్మాలి. భయం మనల్ని దేవుని మీద విశ్వాసం నుంచి దూరం చేస్తుంది- అని! తనను చూసినప్పుడల్లా తనకవేమీ పట్టనట్టు అనిపిస్తాయి. ఎలాంటి సమస్య వచ్చినా హ్యాండిల్ చేయగలననే ధైర్యం జగన్‌ను చూసినప్పుడల్లా కలుగుతుంది. అందుకే, తన దగ్గరికి వెళ్లి వచ్చినప్పుడల్లా నాకు ఎనర్జీ వస్తుంది. ఇందిర: ఓదార్పు తనలో తెచ్చిన మార్పు... భారతి: ఓదార్పుకు వెళ్లే దాకా ప్రజల జీవన పోరాటం అంత దగ్గరగా చూడలేదు కదా.. వాళ్లను చూశాక తనలో ఎంతో మార్పు వచ్చింది. వాళ్లకు మామపై ఉన్న అభిమానం, దాన్ని జగన్ మీద చూపించిన తీరు జగన్‌ను ఎంత ప్రభావితం చేసిందో చెప్పలేను. వాళ్లు తనను ఒక కుటుంబ సభ్యునిగా ప్రేమ చూపించారు. తనూ వాళ్ల ఇళ్లలోకి వెళ్లాడు, వాళ్లతో ఒకరిగా ఉన్నాడు. వాళ్లు కూడా తనవాళ్లనే ఫీలవుతాడు అనుకుంటా! ఓసారి తను నాలుగు రోజల బ్రేక్ తర్వాత ఓదార్పుకు తిరిగి వెళ్లబోతుంటే అడిగాను - ‘ఏం జగన్, నీకు హోం సిక్‌గా అనిపించదా... ఇంత ఆనందంగా వెళ్లిపోతున్నావు?’ అంటే... ‘ఇష్టమైన పని చేస్తున్నప్పుడు బాధ ఎక్కడినుంచి వస్తుంది... నాకు ప్రజలతో ఉండడం ఇష్టం. ఇష్టంగా చేస్తున్నప్పుడు బాధ ఎందుకుంటుంది. అయినా దేవుడు మనకు ఇంతమంది ప్రేమను ఆశీస్సులుగా ఇచ్చినప్పుడు దాన్ని ఆనందంతో స్వీకరించాలి కదా!’ అన్నాడు. అందుకే ఎక్కడికెళ్లినా, వాళ్లింట్లో మనిషిలా మెలుగుతాడు. మా చుట్టాలు చాలామంది అడిగేవారు... ‘జగన్ ఎక్కడ, ఎవరు, ఏది పెట్టినా తింటాడు. ఎలా చేయగలుగుతాడు’ అని అడుగుతారు. అదే విషయం ఓసారి నేను జగన్‌ను అడిగినప్పుడు - ‘వాళ్లు ఎంతో ప్రేమతో పెడుతుంటే ఎలా కాదంటాను.. ఆ ప్రేమను స్వీకరించకపోతే వాళ్లు బాధపడరా?’ అని అన్నాడు. ఇందిర: మరి ఈ ఆరు నెలల్లో వచ్చిన మార్పు... భారతి: ధైర్యం... అది ఏమాత్రం సడల్లేదు... అది లేకపోతే ఇంతదూరం వచ్చేవాళ్లం కాదు... ఇలా ఫైట్ చేసేవాళ్లం కాదు. కమిట్‌మెంట్... అది మొదటినుంచీ వుంది... ఇప్పుడు ఇంకా పెరిగింది. నాకు తెలిసి... ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే పట్టుదల తనలో ఇంకా పెరిగింది. ఇందిర: ఇదంతా మీలో ఏమైనా మార్పు తెచ్చిందా? భారతి: ఒక్కోసారి అనిపిస్తుంది... జగన్‌కన్నా ఇది నాకే పెద్ద పరీక్షలా ఉందని... తనకన్నా నాలో ఎక్కువ మార్పు వచ్చిందని! మొదట్లో నేను చాలా భయపడేదాన్ని. పొసెసివ్‌నెస్ (నాది అనుకునే భావన) కూడా చాలా ఎక్కువ ఉండేది. మామ చనిపోయాక... ఓదార్పు మొదలెట్టాక... జగన్ ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపట్లేదని చాలా అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు ఆ స్వార్థం చాలా తగ్గింది - తను ఆ దిశలో నడవాలనుకున్నాడు... నేను సపోర్ట్ చేయక తప్పదు - దేవుడెప్పుడో దీన్ని కాంపెన్సేట్ చేస్తాడనుకుంటున్నాను. అంతేకాదు, ఇప్పుడు తను బయటకొచ్చి, నాకోసం కాదు... తనకు నచ్చినవి చేసుకుంటూ, హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నాను. అదే దేవుడ్ని పదేపదే ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, దేవుని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది... ఆయనే మమ్మల్ని నడిపిస్తాడని, దీనినుంచి దాటిస్తాడని! |
sakshi
No comments:
Post a Comment