శ్రీరంగ నీతులు వల్లించడంలో బాబుగారికి సాటిరాగల ఘనాపాటి సమకాలిన రాజకీయాల్లో లేరంటే నమ్మాల్సిందే. సమయం దొరికితే చాలు గుక్క తిప్పుకోకుండా సుదీర్ఘంగా సుద్దులు దంచడంలో చంద్రబాబు తలపండిపోయారు. అయితే నారా బాబు చెప్పే మాటలు జనానికి మాత్రమే వర్తిస్తాయని, తనకు మాత్రం కాదని పలు విషయాల్లో రుజువు చేశారు. మాట మీద నిలబడకపోవడం, ఎవర్నీ నమ్మకపోవడం ఆయన ప్రత్యేకతలు. పోనీ చెప్పిన నీతులకైనా కట్టుబడతారా అంటే అదీ లేదు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సుమన్ రాథోడ్, యరపతినేని శ్రీనివాసరావు ఉదంతాలే ప్రత్యక్ష దాఖలా.
'రాజకీయాల్లో విలువలు కాపాడాలి..' టీడీపీ అధినేత తరచుగా ఉటంకించే మాట ఇది. నీతివంతమైన రాజకీయాల కోసం అందరికంటే తానే అధికంగా పాటుపడుతున్నానని కూడా ఆయన ఊదరగొడుతుంటారు. చేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ భూకబ్జా ఎపిసోడ్ పై బాబుగారు ఇంతవరకు నోరు విప్పకపోవడమే ఇందుకు ఉదాహరణ. హత్యారాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చిన ప్రతిపక్ష నేత తమ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన హత్యారోపణల గురించి అసలు తెలియనట్టే ఊరుకుంటారు.
ఫోర్జరీ సంతకాలతో భూకబ్జాకు పాల్పడి, ఆ స్థలాన్ని వేరొకరికి విక్రయించి రూ.1.80 కోట్లు వెనకేసిన వ్యవహారంలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ పై హైదరాబాద్ లో కేసు నమోదయింది. ఖాకీలు ఇలా కేసు నమోదుచేశారో లేదో అంతలోనే అమ్మగారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రహస్య స్థావరంలో ఉంటూనే ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే మాయమైపోవడం, అంతా సద్దుమణిగాకా బయటకు వచ్చి తామెక్కడికి పరిపాలేదని ప్రజాసేవలోనే తరిస్తున్నామని బొంకడం రాజకీయ నేతలకు అలవాటుగా మారుతోంది. ఈ విషయంలో పార్టీలన్ని ఒక తల్లి బిడ్డలే.
ఇక గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా ఇదే బాపతు. కాకపోతే కేసే తేడా. ఒకప్పుడు తన దగ్గర పనిచేసిన తర్వాత వైరివర్గంలో చేరిన ఉన్నం నరేంద్ర అనే వ్యక్తిని హత్య చేయించారన్నది ఆయనపై కేసు. పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త నరేంద్ర గత నెల 27న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు అకస్మాత్తుగా సోమవారం-డిసెంబర్ 17- రాత్రి మాయమయ్యారు. శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన కనిపించకుండా పోయారు.
సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా అధినేత ఉలుకు-పలుకు లేకుండా ఊరుకున్నారు. తప్పుచేస్తే ఎంతటివారినైనా వదలనని డైలాగులు వదిలే నారావారు కనీస స్పందన కూడా వ్యక్తం చేయలేదు. తనకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని కనీసం వివరణ కూడా అడగకుండా పార్టీ నుంచి బయటకు గెంటేసే బాబుగారు తమ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయి, అరెస్ట్ ల వరకు వెళ్లినా కిమ్మనలేదు. మాటలకు చేతలకు పొంతన లేకుండా ముందుకు పోవడమే చంద్రబాబు స్టయిల్. తాను వల్లించిన సుద్దులకు కట్టుబడి ఉండివుంటే రాథోడ్, యరపతినేనిలకు నోటీసులు జారీ చేయడమో, పార్టీ నుంచి బహిష్కరించడమో చేసేవారు. చెప్పింది చేయకపోవడమే పచ్చపార్టీ అధ్యక్షుడు అనుసరిస్తున్న నీతి!
No comments:
Post a Comment