YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 16 December 2012

ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు లేవే..

సోనియా చెబితేనే ఆరోగ్యశ్రీ వచ్చిందన్న ఆజాద్
ఆజాద్ వల్లే 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లు: కిరణ్
స్వోత్కర్ష, పరనిందలతో పీసీసీ సదస్సు సరి

ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు లేవేమంటూ సభికుల్లో చర్చ

నేతల కలహాలే పార్టీకి శాపమని తేల్చిన భేటీ
ఇలాగైతే పార్టీకి కష్టమేనన్న ఆజాద్
2004 నాటి ఐక్యత లోపించిందని వ్యాఖ్య
ముఖ్య నేతలకు నివాళులైనా అర్పించని వైనం
వైఎస్‌ను ప్రస్తావించకపోవడంపై విమర్శలు
  
 పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సహా, ప్రాణాలు కోల్పోయిన ఇతర పార్టీ ముఖ్యులెవరికీ శ్రద్ధాంజలి ఘటించకపోవడంపై వేదికపైనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానాంశాలు వేటినీ స్పృశించకపోగా, తీర్మానాంశాలపై కూడా చర్చలు నిస్సారంగా, నిస్తేజంగా సాగాయి. పైగా ప్రజా సంక్షేమం కోసం వైఎస్ తనంత తానుగా ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు పథకాలను కాంగ్రెస్‌విగా చెప్పుకొనేందుకు నేతలు తమ ప్రసంగాల్లో తాపత్రయపడ్డారు. అదే నిజమైతే, వైఎస్ హయాంలో రాష్ట్రంలో రూపుదిద్దుకున్న పథకాలు దేశవ్యాప్తంగా గానీ, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు లేవంటూ సభికుల్లో పలువురు వ్యాఖ్యానించడం విన్పించింది. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించి, రెండు ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులను కూడా చర్చించి, నేతలకు క్షేత్ర స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఉదయం సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి, సాయంత్రం ముగిసేదాకా ఏ ఒకట్రెండుసార్లో తప్పితే కార్యకర్తల్లో ఉత్సాహమే కన్పించలేదు. వారినుంచి చప్పట్లు, కేరింతలు విన్పించలేదు. పార్టీపరమైన లోపాలు, పరిష్కారాలు, భావి కార్యాచరణ తదితరాల్లో వేటిపైనా కాంగ్రెస్ శ్రేణులకు ఈ సదస్సు దిశానిర్దేశం చేయలేకపోయిందన్న విమర్శలు గట్టిగా విన్పించాయి. 20 వేల మంది హాజరవుతారని ప్రకటించినా, ఆ స్థాయిలో ప్రతినిధులు కన్పించలేదు. పైగా మధ్యాహ్నానికే సగానికిపైగా స్థానాలు ఖాళీ అయ్యాయి. విమానానికి టైమవుతోందంటూ ఆజాద్ త్వరగా ప్రసంగించి వెళ్లిపోవడంతో ఆ వెంటనే మిగతావారూ అదే బాట పట్టారు. చివరికి కిరణ్ మాట్లాడేప్పటికి చాలా తక్కువమందే మిగిలారు. అయినా ఆయన గంటకుపైగా ప్రసంగించడం విశేషం. పైగా రోజూ మీడియా ముందు మాట్లాడేవారు, గాంధీభవన్‌కు వచ్చి చీఫ్‌కు సన్నిహితంగా ఉండే నేతల ప్రసంగాలతోనే ముగిసింది. రాష్ట్రమంతటినుంచీ వచ్చిన వేలాదిమంది నేతలు, ముఖ్య కార్యకర్తలెవరికీ మాట్లాడే అవకాశం క ల్పించలేదు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్షాల వైఖరిని ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సదస్సులో కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుపట్టారు. ‘‘చంద్రబాబు తన సహజసిద్ధమైన ద్వంద్వనీతిని ఎఫ్‌డీఐల విషయంలోనూ ప్రదర్శించారు. ఆయనకు హెరిటేజ్ అనే ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ ఉంది. అదీ వాల్‌మార్ట్‌లాంటిదే. దాని పేరు హెరిటేజ్ వాల్‌మార్ట్ అని మారుస్తారేమో తెలియదు. 
 సొంత కంపెనీలోకి విదేశీపెట్టుబడులు ఆహ్వానిస్తున్న చంద్రబాబు చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే మాత్రం వ్యతిరేకించడం విచిత్రంగా ఉంది’’ అని చిరంజీవి దుయ్యబట్టారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకించి... రాజ్యసభలోకి వచ్చేసరికి ఆ పార్టీ ఎంపీలు ఓట్లు వేయలేదని ప్రస్తావించారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా అని ప్రశ్నించారు. బాబుది పాదయాత్ర కాదని, అధికారదాహ యాత్ర అని ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడులతో చైనా ఎంతో ప్రగతి సాధిస్తోందని చిరంజీవి చెప్పారు. అక్కడ అదెంతో మంచి కార్యక్రమమని చెప్పే కమ్యూనిస్టులు... ఇక్కడ మాత్రం అవి ప్రమాదకరమని గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందని అన్నారు. ఎఫ్‌డీఐలతో రైతులు సహా అన్ని వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని, అదే జరిగితే తమ పని అయిపోతుందని ఆ పార్టీలు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినా ఎన్నికలలో అందుకుతగ్గ ప్రతిఫలం తనకు దక్కలేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!