YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Tuesday, 18 December 2012

షర్మిలకు శస్త్రచికిత్స పూర్తి

ఆరు వారాల్లో పూర్తిగా కోలుకుంటారన్న డాక్టర్లు
నేడు అపోలో నుంచి ఇంటికి షర్మిల 

 ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తూ గాయపడి మోకాలి నొప్పితో బాధపడుతున్న షర్మిలకు మంగళవారం అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా ఈ నెల 14న ఎల్‌బీనగర్ సమీపంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక నుంచి కిందికి దిగుతున్న క్రమంలో షర్మిల కుడి మోకాలికి బలమైన గాయమైంది. అయినా ఆమె ఆ గాయాన్ని లెక్క చేయకుండా నాలుగు కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించడంతో అది మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించగా.. బలమైన గాయమైందని, శస్త్రచికిత్స అత్యవసరమని తేలింది. 

దీంతో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో అపోలో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. మోకాలిచిప్ప దిశను నిర్ణయించే కుడివైపు లిగమెంట్‌తో పాటు మోకాలి చిప్ప మధ్య భాగంలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) పాక్షికంగా దెబ్బతినడంతో ఆర్థ్రోస్కోపీ(కీహోల్) సర్జరీ చేశారు. 

జగన్‌ను కలిసిన షర్మిల: అంతకు ముందు ఉదయం షర్మిల చంచల్‌గూడ జైలుకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆమె అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమె వీల్‌చైర్‌లోజైలు వద్దకు వచ్చారు. ఆమె వెంట భర్త బ్రదర్ అనిల్‌కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.


షర్మిలకు అరగంటలో శస్త్రచికిత్స పూర్తయిందని, ఆరు వారాల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల తర్వాత వారానికో ఇంజెక్షన్ చొప్పున ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్(గాయపడిన వ్యక్తి నుంచి రక్తం తీసి, అందులోనుంచి ప్లాస్మాను వేరుచేసి ఇంజెక్షన్ ద్వారా మోకాలిలోకి చొప్పిం చడం) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అన్నిటికంటే ఫిజియో థెరపీ ముఖ్యమని, దీనిద్వారా నిర్ణయించిన సమయానికంటే ముందే కోలుకునే అవకాశముందని అన్నారు. షర్మిలను బుధవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు. శస్త్రచికిత్సలో అపోలో వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శివభారత్‌రెడ్డి (డెక్కన్ ఆసుపత్రి)లతో పాటు అనస్థీషియన్ డాక్టర్ సనత్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!