YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 17 December 2012

వైఎస్ లాంటిదే జగన్ స్వభావం: విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి స్వభావం కూడా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటిదేనని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. నిర్మల్ లో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డిని మీ బిడ్డగా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ వస్తే మళ్లీ రాజన్న పాలన వస్తుందన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలగన్నారని చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల జాతీయహోదా కోసం వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్ చనిపోయాక ప్రాణహిత-చేవెళ్లను కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్‌ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతంగా సాగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. పల్లెల్లో రెండు గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదని చెప్పారు. విద్యుత్ కోతలతో వేల సంఖ్యలో పరిశ్రమలు మూతబడ్డాయని తెలిపారు. ఆర్టీసీ ఛార్జీలు, ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ హయాంలో ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉన్నత ఆశయంతో వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు 108 కు ఫోన్ చేస్తే డీజిల్ లేదనే సమాధానం వస్తోంది. పేదలు ఉన్నత విద్య అభ్యసించాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. మైనార్టీలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోవడం లేదు. అన్ని ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వైఎస్‌ఆర్. పన్నులు వేయకుండా పాలన సాగించిన ఘనత ఆయనదే అన్నారు. 

మీకోసం పేరుతో చంద్రబాబు బూటకపు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. గతంలో ఉచిత విద్యుత్‌ను చంద్రబాబు ఎగతాళి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తాననడం బాబు అధికార దాహానికి నిదర్శనం అన్నారు. 

ఈ సభలో పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, జనక్ ప్రసాద్, రెహ్మాన్ లతోపాటు పార్టీలో కొత్తగా చేరిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డిసిసిబి మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ లో వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. భారీ బహిరంగ సభ వేదికపైన ఆయనతోపాటు డిసిసిబి మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్ లు కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు.

నిర్మల్ మండలం మాదాపూర్‌లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు.పూలమాలవేసి నివాళులర్పించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!