YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 31 October 2012

రిలయన్స్ బండారం

అందరూ ఎప్పటినుంచో అనుకుంటున్నదే. ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతివారి అనుభంలోకీ వస్తున్నదే. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేతిలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వమూ కీలుబొమ్మలుగా మారిపోయాయని ఎన్నో దృష్టాంతాలు చెబుతూనే ఉన్నాయి. బుధవారంనాటి విలేకరుల సమావేశంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించిన అంశాలు వాటినే మరోసారి ధ్రువీకరించాయి. చీకటి ఒప్పందాలు ఎల్లకాలమూ దాగవు. కుమ్మక్కులు, లాలూచీలు జనం కంటపడకుండా తప్పించుకుపోలేవు. అందువల్లే ఎన్నడో 2000 సంవత్సరంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ హయాంలో కేజీ బేసిన్‌పై కుదిరిన కాంట్రాక్టు కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. 

అరవింద్ కేజ్రీవాల్ ఇంకొంచెం లోతుల్లోకి వెళితే అప్పట్లో ఎన్‌డీఏతో అంటకాగి కేజీ బేసిన్ చమురు, సహజవాయు క్షేత్రాలు రిలయన్స్‌కు దక్కేందుకు తన వంతు సహకారం అందించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బండారం కూడా బట్టబయలయ్యేది. మన తూర్పు వాకిట సాగరగర్భంలో నిక్షిప్తమై ఉన్న చమురు, సహజవాయు నిక్షేపాల విలువ సామాన్యమైంది కాదు. ఆ ఇంధన క్షేత్రం అక్షయ పాత్రలాంటిదని, అందులో 36 లక్షల కోట్ల రూపాయల విలువచేసే సహజ వాయు నిక్షేపాలున్నాయని నిపుణులు పుష్కర కాలం కిందట అంచనా వేశారు. 

ఆ ఇంధన నిక్షేపాలను వెలికితీసేందుకు అప్పట్లో నిర్వహించిన వేలంలో పాల్గొనేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పి ఒక బ్లాక్‌ను కైవసం చేసుకోగా... బాబు ప్రభుత్వం ఆ పనిచేయకుండా అంబానీకి సహకరించింది. గుజరాత్ తరహాలో మనంకూడా కాంట్రాక్టు దక్కించుకుని ఉంటే ఈ విద్యుత్ సంక్షోభం ఉండేదే కాదు. గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు అవసరమైన గ్యాస్ సరఫరా చేయడమే కాక, ఇంటింటికీ పైపులద్వారా గ్యాస్ పంపిణీచేసే అవకాశం కూడా ఉండేది. 

వీటన్నిటిని అలావుంచి రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ కాంట్రాక్టు దక్కించుకున్నప్పటి నుంచీ ఏదో అంశంపై తగాదా పడుతూనే ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాన్నిబట్టి ఆ సంస్థ 17 సంవత్సరాలపాటు ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్‌ను 2.34 డాలర్లకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)కి సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ఆ తర్వాత కొన్నేళ్లకే ఒప్పందంలో నిర్ణయించిన ధరను మార్చాలంటూ రిలయన్స్ సంస్థ పట్టుబట్టింది. దాంతో ఒక ఎంబీటీయూ గ్యాస్ ధరనూ 4.25 డాలర్లుగా మారుస్తూ ప్రభుత్వం 2009లో నిర్ణయం తీసుకుంది. అప్పటి ఒప్పందాన్నిబట్టి అయిదేళ్లపాటు... అంటే 2014 వరకూ ఈ ధరే అమలులో ఉండాలి. కానీ, రిలయన్స్ ఈ ఏడాది జనవరి నుంచే ఆ ధరను మార్చాలంటూ కొత్త రాగం అందుకుంది. ఏప్రిల్‌కల్లా ఒక ఎంబీటీయూ ధరనూ 14.25 డాలర్లుగా సవరించాలని కోరింది. 

ఈలోగా కేజీ బేసిన్‌లో ఉత్పత్తి కుంటుబడటం మొదలైంది. ఇదంతా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకేనని హైడ్రోకార్బన్స్ డెరైక్టర్ జనరలే వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం రిలయన్స్ రోజుకు 80 ఎంసీఎండీల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, అది ఇప్పుడు 25 ఎంసీఎండీలకు పడిపోయింది. రిలయన్స్ డిమాండ్‌కు అనుకూలంగా లేకపోవడం వల్లనే జైపాల్ రెడ్డిని ఆ శాఖనుంచి తప్పించి అప్రాధాన్య శాఖకు మార్చారని కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ రోజే పలువురు ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న సమాజ్‌వాదీ పార్టీ సైతం ఇదే ఆరోపణ చేసింది. కానీ, మూడురోజులు గడిచినా కేంద్రంనుంచిగానీ, యూపీఏ సారథి కాంగ్రెస్‌నుంచిగానీ ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు జైపాల్ రెడ్డి విషయమే కాదు... 2006లో మణిశంకర్ అయ్యర్‌ను మార్చి మురళీ దేవరాకు పెట్రోలియం మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనేనని ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన ఆరోపణకు సైతం కేంద్రం నుంచి మౌనమే సమాధానమవుతోంది. 

సహజవాయువు ధరను పెంచుకునే ఉద్దేశంతో కేజీ బేసిన్‌లో ఉత్పత్తిని సాంకేతిక కారణాలు చూపి కుంటుబరుస్తున్న రిలయన్స్ వైఖరివల్ల దేశం ఎంతగానో నష్టపోతోంది. దేశంలో సహజవాయు వినియోగం 156ఎంసీఎండీలు ఉండగా అందులో రిలయన్స్ 80 ఎంసీఎండీల వరకూ ఉత్పత్తి చేయాల్సి ఉంది. రిలయన్స్ డిమాండ్‌ను అంగీకరిస్తే ఈ రెండేళ్లలోనే ఆ సంస్థ రూ. 43,000 కోట్ల రూపాయలమేర అదనపు లాభం గడిస్తుంది. రిలయన్స్ ఉత్పత్తిచేసే గ్యాస్‌పై ఆధారపడి ఎన్నో విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, ఎరువుల కర్మాగారాలు నడుస్తున్నాయి. వీటిపై అదనంగా పడే భారం పర్యవసానంగా విద్యుత్ చార్జీలు, ఎరువుల ధరలు భారీగా పెరుగుతాయి. మన రాష్ట్రం విషయానికే వస్తే రిలయన్స్ డ్రామాల వల్ల ఏడాదికి ఒక్క విద్యుత్‌పైనే రూ.5,000 కోట్ల అదనపు భారం పడుతోంది. యూనిట్‌కు రూ. 2.70కే అందుబాటులోకి రావలసిన విద్యుత్‌ను ట్రాన్స్‌కో రూ.5.70 చెల్లించి కొనుగోలు చేయాల్సివస్తోంది. ఇదంతా అంతిమంగా విద్యుత్ వినియోగదారులే చెల్లించవలసి వస్తోంది. ఇలాంటివన్నీ ఊహించే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రిలయన్స్‌పై చివరివరకూ పోరాడుతూనే ఉన్నారు. 

దేశప్రజలందరి సొత్తూ అయిన ఇంధన నిక్షేపాలను రిలయన్స్ తన సొంత జాగీరుగా పరిగణించ డాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. తమ రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలని పట్టుబట్టారు. ఈ అపార సంపదకు యజమాని కేంద్ర ప్రభుత్వ మేనని, రిలయన్స్ కాంట్రాక్టరు మాత్రమేనని ప్రధానికి రాసిన పలు లేఖల్లో ఆయన స్పష్టం చేశారు. వైఎస్ అప్రమత్తం చేసినప్పుడే కేంద్రం సక్రమంగా వ్యవహరించి ఉంటే దేశం ఇంతగా నష్టపోయేది కాదు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చు కోవాలి. రిలయన్స్‌కు అనుకూలంగా కాక, ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=51758&Categoryid=1&subcatid=17

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!