‘జన’ తుపాను ముందు ‘నీలం’ తుపాను చిన్నబోయింది. నీలం తుపాను బలహీనపడితే.. జన తుపాను నానాటికీ బలపడుతోంది. షర్మిల వెంట ప్రజలు తండోపతండాలుగా కదం తొక్కుతుండటంతో జన తుపాను బలబడుతూ కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో ప్రళయం సృష్టిస్తోంది. మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు గురువారం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలం ముద్దలాపురం, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేటల్లో జనం పోటెత్తారు. నీలం తుపాన్ ప్రభావం వల్ల జోరుగా వర్షం కురిసినా జనం చెక్కుచెదరలేదు. సరి కదా సమయం పెరిగే కొద్దీ జనం రెట్టింపై షర్మిల వెంట అడుగులో అడుగేసి కదంతొక్కారు.
బుధవారం రాత్రి కూడేరుకు నాలుగు కిమీలోమీటర్ల దూరంలో బస చేసిన షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించే సరికి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ముద్దలాపురం శివారులో ఇద్దరు మరుగుజ్జు మహిళలను అప్యాయంగా పలకరించిన షర్మిల.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ‘అమ్మా.. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు నెలకు రూ.వెయ్యి చొప్పున వికలాంగులకు పెన్షన్ వస్తుంది’ అంటూ ధైర్యం చెప్పడంతో వారి కళ్లలో వెలుగులు నిండాయి. ముద్దలాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన షర్మిల.. విద్యార్థులతో మమేకమయ్యారు. బాగా చదువుకోవాలని సూచించారు.
ఆ తర్వాత ముద్దలాపురం చేరుకున్న ఆమెకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీసి, ఇంటి బిడ్డలా ఆదరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ‘వేరుశనగకు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా పంటల బీమా వల్ల పంట పండకపోయినా నష్టపరిహారం వచ్చేది. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల లోగిల్లలో పంట దిగుబడులు లేవు.. అప్పులే మిగిలాయి’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘పాలక, ప్రతిపక్షాలు దొందూ దొందే. కొద్ది రోజులు ఓపిక పట్టండి. జగనన్న సీఎం అవుతారు. మీ కష్టాలను కడతేర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు.
బీమా లేకుండా చేసి నట్టేట ముంచింది..
ముద్దలాపురం గ్రామం నుంచి వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న షర్మిల అక్కడే భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే పాదయాత్రను కొనసాగించారు. జల్లిపల్లి శివారులో గొర్రెల కాపరులతో ముచ్చటించారు. ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు గొర్రెకు రూ.18 చొప్పున కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించేవారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం ఇచ్చేవారు. గొర్రెలకు మందులు కూడా వేసేవారు. కానీ.. ఇప్పుడు బీమా రద్దు చేశారు.
మందులు వేయడం లేదు. ఒక్క గొర్రె చనిపోతే ఆరేడు వేల రూపాయల నష్టం వస్తోంది. అదే బీమా ఉంటే మాకు ఆ నష్టం జరిగేది కాదు’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘కులవృత్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీడీపీ కూడా ప్రభుత్వానికే వంతపాడుతోంది. జగనన్న సీఎం అవుతారు.. కులవృత్తులకు పెద్దపీట వేస్తారు. రాజన్న చేపట్టిన పథకాలను మళ్లీ చేపట్టి ఆదుకుంటారు’ అనడంతో గొర్రెల కాపర్ల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.
అక్కడి నుంచి జల్లిపల్లికి చేరుకున్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘జగనన్న రైతుల కోసం, విద్యార్థుల కోసం.. చేనేతల కోసం దీక్షలు చేశారు. పోరాటాలు చేశారు. వైఎస్ తరహాలోనే ప్రజల పక్షాన పోరాడి.. జనం హృదయాలను గెలుచుకున్నారు. దీన్ని చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి ఉండదనే భయంతోనే జగనన్నను సీబీఐతో అరెస్టు చేయించాయి. చివరకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి. దేవుడనేవాడు ఉన్నాడు. న్యాయం జరుగుతుంది. జగనన్న బయటకు వచ్చి.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జల్లిపల్లి సభ తర్వాత ఉదిరిపికొండకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు.
ఉదిరిపికొండ రైతులు మాట్లాడుతూ ‘వైఎస్ హయాంలో 99 శాతం పంట నష్టపరిహారం వచ్చింది. దీని వల్ల అప్పులు తీరాయి. కానీ.. ఇప్పుడు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. రైతులు ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహానేత వైఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేశారు. జగనన్న అదే తరహాలో పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.
జనాదరణ ఓర్వలేకే కుట్రలు..
ఉదిరిపికొండ నుంచి శివరాంపేటకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. షర్మిలపై బంతిపూల వర్షం కురిపించారు. అక్కడ గ్రామీణుల సమస్యలను తెలుసుకున్న తర్వాత షర్మిల మాట్లాడుతూ.. ‘జగన్ కాంగ్రెస్‌లో ఉంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవారు కాదని గులాంనబీ ఆజాద్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కక్ష సాధింపుల్లో భాగంగానే జగనన్నను అరెస్టు చేయించారన్న విషయం అర్థమవుతోంది.
టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ జగనన్నను ప్రజలకు దూరం చేస్తోంది. జగనన్నకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ కుట్రలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు జగనన్న బయటకు రాకపోరు.. మీ తరఫున పోరాటం చేయకపోరు.. రాజన్న రాజ్యాన్ని స్థాపించకపోరు.. మీ కష్టాలను కడతేర్చకపోరు.. ఓపికపట్టండి’ అంటూ ధైర్యం చెప్పారు. శివరాంపేట నుంచి భంభంస్వామి గుట్ట వద్దకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనూ వేలాది మంది ప్రజలు షర్మిలను అనుసరించడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది కాంగ్రెస్, టీడీపీ శిబిరాలను మరింత ఆందోళనకు గురిచేసింది. గురువారం పాదయాత్రలో షర్మిల 13 కిలోమీటర్ల దూరం నడిచారు.
No comments:
Post a Comment