వివిధ రాజకీయ పార్టీల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలూ, మాజీలూ వచ్చిచేరడం చూస్తుంటే, రాష్ట్రంలో ఇక రానున్నది వైఎస్ జగన్ పాలనేనని తేలిపోతోందని మీడియా ప్రకటిస్తోంది. జగనన్న రాజ్యమంటే, రైతన్న రాజ్యమేనని పాదయాత్ర చేస్తున్న షర్మిల స్పష్టం చేశారు. ‘సూర్యోదయాన్ని ఎలా ఆపజాలరో, అలాగే జగనన్న రాజ్యంలోకి రాకుండా కూడా ఎవ్వరూ ఆపజాల’రని ఆమె అనంతపురంలో పాదయాత్ర చేస్తూ ప్రకటించారు. రేపు జరిగే ఎన్నికల తర్వాత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీగా ఆవిర్భవించడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి -ఈ యాత్రలో పాల్గొంటూనే- ఉద్ఘాటించారు. అసలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే జగన్ ప్రభంజనం వీస్తోందన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు. ప్రాణాలకు తెగించి మరీ, పాదయాత్ర చేపట్టడం చూస్తేనే ఆయన -వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనివార్యమని బెదిరిపోయినందువల్లనే- ఇంతటి ‘సాహస యాత్ర’కు తెగించాడని అర్థమయిపోతుంది.
ఇహనిప్పుడు రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి వంతు వచ్చినట్లుంది. ఆయన కూడా పాదయాత్ర పల్లవి ఎత్తుకున్నారు. నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని మహానేత వైఎస్‌ఆర్ చేపట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం, మరో 45 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే ఆ పథకం పూర్తవుతుంది. ఆ పని చెయ్యకుండా, మంత్రిగారు పాదయాత్ర చేసి ఈ పథకాన్ని పూర్తి చేస్తామంటున్నారు. షర్మిల చెప్పినట్లు ఈ వ్యవహారం ‘సొమ్మొకడిది- సోకొకడిది అన్న చందంగానే’ ఉంది!
మహానేత, ఆయన కుటుంబ సభ్యులూ నెలల తరబడి ప్రజల్లో తిరిగి సంపాదించుకున్న ప్రజాపునాది చూసి టీడీపీ- కాంగ్రెస్ అపవిత్ర కూటమి నేతలు కూడా యాత్రలకు తెగించారంతే. నిజానికి వాళ్ల ప్రకటిత లక్ష్యాలు సాధించాలంటే, ఇంతలేసి సాహసాలు చెయ్యనవసరం లేదు. చంద్రబాబు పాదయాత్రలూ చెయ్యనక్కర్లేదు- వెన్నువిరుచుకోనూ అక్కర్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కూల్చేయాలని ఆయనకు నిజంగానే ఉంటే, టీడీపీ నేతకు అది చిటికెలో పని. తన పార్టీ తరఫున అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సరి! వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తీర్మానానికి మద్దతిస్తామని వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల చెప్తూనే ఉన్నారు. కానీ. తేలికగా దొరికే ఈ పరిష్కారాన్ని కాకుండా అసాధ్యమయిన మార్గాన్ని చంద్రబాబు ఎంచుకోవడం చూస్తే అసలాయనకు కిరణ్ సర్కారును కూల్చే ఉద్దేశమే లేదేమో అనిపిస్తుంది.
రఘువీరా రెడ్డి కూడా కేవలం 45 కోట్ల రూపాయలతో పూర్తికాగల హంద్రీ నీవా పథకానికి ఆ మొత్తాన్ని కేటాయింప చేసుకునేందుకు ప్రత్నించడమే లేదు. రాష్ట్ర మంత్రిగా ఉన్న వాడి ముందుండే సులభ సాధ్యమయిన పరిష్కారం ఇది. కానీ దాన్ని వదిలిపెట్టి, ప్రతిపక్ష నేతల మాదిరిగా పాదయాత్ర మొదలుపెట్టడం చూస్తే అసలు మంత్రిగారికి పథకాన్ని పూర్తిచేయించుకోవాలని ఉందా? అనే అనుమానం రావడం సహజం. అయినా, టీడీపీ- కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కుమ్మక్కయి నేర్చుకున్నది ఒక్కటే విద్య. ప్రజా సమస్యల పేరుచెప్పి స్వార్థ ప్రయోజనాలు గడుపుకోవడం! దానికి అందమయిన గిఫ్ట్ ప్యాక్‌గా పాదయాత్రలను వాడుకుంటున్నారంతే! సీబీఐని వాడుకుని వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టించిన కాంగ్రెస్ అధిష్టానమ్మ, ఆయనకు బెయిల్ రాకుండా నానాపాట్లూ పడుతోంది. ఒక్కసారి వైఎస్ జగన్ బయటికొస్తే, ఆయన పూర్తికాలం ప్రజల్లోనే ఉండి, మహానేత ల క్ష్యాలను సంపూర్ణం చేసేందుకు పోరాడతాడని అధిష్టానమ్మ బెదురుతోంది. చంద్రబాబు నాయుడిదీ అదే భయం. అదే వాళ్లిద్దరినీ కలిపింది. అయితే, రాజకీయాల్లో ఇలాంటి అపవిత్ర కూటములు విజయం సాధించిన దాకల ఎక్కడా కనిపించదు. సామాన్య ప్రజానీకం ఎల్లెప్పుడూ గెలిపించేది విశ్వసనీయత కలిగిన నేతనే. అటు అధిష్టానమ్మకు గానీ, ఇటు చంద్రబాబు నాయుడికి గానీ కరువయినదీ విశ్వసనీయతే!
కోటి ఎకరాలకు నీరివ్వాలన్న మహానేత స్వప్నం సాకారం చెయ్యాలన్నదే తన ఎజెండా అని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల తన పాదయాత్ర సందర్భంగా అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి నూటికి డెబ్బయ్ మందికి జీవన భృతిని కల్పిస్తూన్న ఆ రంగాన్ని నిలబెట్టాలన్న లక్ష్యాన్ని సాధించడమే తన ప్రణాళిక అని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల జ్ఞాపకం చేశారు. మూడువేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ప్రవేశపెట్టి రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న మహానేత కలను నిజంచెయ్యడమే తన కర్తవ్యమని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల తన ప్రసంగాల్లో గుర్తు చేశారు. రైతులకూ మహిళలకూ వడ్డీలేని రుణాలిప్పించడమే తన లక్ష్యమని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల ప్రస్తావించారు. వైఎస్ జగన్‌కు విశ్వసనీయతను సంపాదించి పెడుతున్న విషయాలివే. ఈ లక్ష్యాలే వైఎస్ జగన్ విజయాన్ని అనివార్యంగా మారుస్తున్నాయి.
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51662&Categoryid=28&subcatid=0
No comments:
Post a Comment