YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 3 November 2012

రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు

 ఉరవకొండ వీధుల్లో శనివారం జన ప్రవాహం పోటెత్తింది. వైఎస్సార్‌సీసీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. టీడీపీకి పట్టున్న గ్రామాలు, ఉరవకొండ పట్టణంలో రికార్డు స్థాయిలో జనం పోటెత్తి, షర్మిల వెంట కదంతొక్కడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

శుక్రవారం రాత్రి లత్తవరం శివారులో బస చేసిన షర్మిల శనివారం ఉదయం 11.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో 17 రోజులుగా నడుస్తోన్న షర్మిలకు ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి శనివారం సంఘీబావం ప్రకటిస్తూ తల్లి వెంట అడుగులో అడుగేస్తూ కదంతొక్కారు. భారీ జనసందోహం మధ్య లత్తవరం గ్రామం చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలతో.. అడుగడుగునా హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రచ్చబండ నిర్వహించిన షర్మిల.. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు.

లత్తవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. మాకు పది కేజీల బియ్యమే ఇస్తున్నారు. నా కుమారుడికి పెళ్లైంది. ఐదుగురికి పది కేజీల బియ్యం సరిపోవడం లేదు. అర్ధాకలితో మాడిపోతున్నాం’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహానేత వైఎస్ బతికి ఉండి ఉంటే.. మీ కుటుంబానికి ప్రతి నెలా 30 కేజీల బియ్యం అందేవి. వైఎస్ రెండో సారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి రెండు హామీలు ఇచ్చారు. అందులో ఒకటి ప్రతి నెలా 30 కేజీల బియ్యం.. సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్. ఆ రెండు హామీలను తుంగలోతొక్కిన ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు మీకు 30 కేజీల బియ్యం వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చారు. 

అంతలో మరో విద్యార్థిని మాట్లాడుతూ ‘అక్కా.. మాకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. దీని వల్ల కాలేజీల యాజమాన్యాలు ముందుగానే ఫీజు కట్టించుకుంటున్నాయి. మాకు ఆర్థిక స్థోమత లేక ఫీజులు కట్టలేక చదువులను అర్ధంతరంగా ఆపేస్తున్నాం’ అంటూ విలపించింది. ఇందుకు షర్మిల స్పందిసూ.. ‘పేద ప్రజలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకనో దీన్ని బట్టే అర్థమవుతోంది. ప్రతి ఇంట్లోనూ ఒకరు డాక్టరో ఇంజనీరో వంటి చదవులు చదివితే పేదరికం పోతుందని రాజన్న కన్న కలలను ఈ ప్రభుత్వం కల్లలు చేస్తోంది. త్వరలో జగనన్న సీఎం అవుతారు. రాజన్నలానే అన్ని పథకాలను అమలు చేస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు. ఇంతలోనే కొందరు రైతులు మాట్లాడుతూ ‘అమ్మా.. మాకు ఇన్‌పుట్ సబ్సిడీ గానీ, పావలా వడ్డీ రుణాలు గానీ.. పంట నష్టపరిహారం గానీ అందడం లేదు’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రైతుల కోసం పోరాడారు. 



జగనన్న అలానే చేస్తారు. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యంలో రైతేరాజు’ అంటూ ఆత్మస్థైర్యం నింపారు. లత్తవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు రుణాలు ఇవ్వడం లేదు. వైఎస్ హయాంలో పావలా వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా అందేది’ అంటూ విన్నవించుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఆ ఉత్తర్వులు అమలు చేయడంలో చేతులెత్తేసింది. రాజన్న రాజ్యంలో వడ్డీ లేని రుణాలను జగనన్న కచ్చితంగా ఇస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు. లత్తవరం గ్రామం దాటగానే ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది.

హంద్రీ-నీవా ఇంకెన్నాళ్లలో 
పూర్తి చేస్తారు..?
బురదమయమైన రోడ్డులో.. భారీ వర్షంలోనే షర్మిల, ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, వేలాది మంది ప్రజలు లత్తవరం నుంచి ఉరవకొండ దిశగా కదిలారు. మార్గమధ్యలో హంద్రీ-నీవా కాలువను పరిశీలించిన షర్మిల.. ‘దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో జిల్లా రెండో స్థానంలో ఉంది. సాగునీళ్లకే కాదు.. తాగునీటి కొరత ఉంది. దీన్ని నివారించడానికి వైఎస్ హంద్రీ-నీవాను చేపట్టారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు.. 400 గ్రామాలకు తాగు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. తొలి దశ పూర్తి చేయడానికి రూ.45 కోట్లు ఖర్చు చేస్తే చాలు. 


కానీ.. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. హంద్రీ-నీవాకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. రైతుల పట్ల చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తార్కాణం’ అంటూ విమర్శించారు. ఆ తర్వాత జోరువానలోనే ఉరవకొండకు చేరుకున్నారు. ఉరవకొండ గవిమఠం ఎదురుగా ఉన్న మైదానంలో భోజనం చేసి.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటికి వరుణుడు కాస్త శాంతించాడు. వరుణుడు కన్నెర్ర చేసినా జనం మాత్రం చెక్కుచెదరలేదు. వర్షంలోనే తడుస్తూ వేలాది మంది ప్రజలు వేచి చూస్తూనే ఉండిపోయారు. సాయంత్రం 3.30 గంటలకు ఉరవకొండ పట్టణంలో పాదయాత్రకు ఉపక్రమించారు. పోలీసుస్టేషన్, మూగబసన్నకట్ట, ఎస్సీ కాలనీ, గాంధీబజారు మీదుగా పురవీధుల్లో కలియతిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెండేయ స్వామి గుడి వద్ద అర్చకులు షర్మిలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాసుల ఆంజనేయులు అనే చేనేత కార్మికుని ఇంట్లోకి వెళ్లిన షర్మిల.. చేనేతల పరిస్థితులను ఆరా తీశారు. ‘అమ్మా.. ముడిసరుకుల ధరలు పెరిగాయి. కానీ.. చీరలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. 

రోజుకు రూ.70 మాత్రమే కూలీగా గిట్టుబాటవుతోంది. రోజుకు రూ.70తో ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా బాధపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు ముడిసరుకులను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. చీరలకు గిట్టుబాటు ధర కల్పిస్తుంది. వడ్డీ లేని రుణాలు ఇస్తుంది’ అంటూ ధైర్యం చెప్పారు. హంద్రీ-నీవాకు దివంగత సీఎం వైఎస్ వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించారు. ఆ పక్కనే చంద్రబాబు వేసిన శిలాఫలకాన్ని కూడా పరిశీలించిన షర్మిల.. ‘బాబు వేసిన శిలాఫలకం దిష్టిబొమ్మలా మిగిలిపోయింది’ అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌లను 
కడిగిపారే సిన షర్మిల
ఉరవకొండ నడిబొడ్డున టవర్‌క్లాక్ సమీపంలో నిర్వహించిన బహిరంగసభకు జనం రికార్డు స్థాయిలో పోటెత్తారు. ఈ బహిరంగసభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోంది. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు.

ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తూ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ఉచిత విద్యుత్ ఇస్తామని, రుణాల మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. కానీ.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాటిని అవహేళన చేసిన మాట వాస్తవం కాదా? చేనేత, రైతు ఆత్మహత్యలను అపహాస్యం చేసిన మాట నిజం కాదా?’ అంటూ కడిగిపారేశారు. ఆ తర్వాత షర్మిల మాట్లాడుతూ ‘చేనేతల సంక్షేమం కోసం పాటుపడింది ఒక్క వైఎస్ మాత్రమే. ఇప్పుడు చేనేతల కోసం పోరాటం చేస్తోంది ఒక్క జగనన్న మాత్రమే. రాజన్న ప్రాంభించిన 108 సర్వీసు ఇప్పుడు సక్రమంగా పనిచేసి ఉంటే.. ప్రమాదంలో గాయపడిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు బతికి ఉండేవారు. 11 సార్లు ఫోన్ చేసినా 108 సకాలంలో చేరలేదు. దాంతో.. ఆయన మృతి చెందారు. ఒక్క ఎర్రన్నాయుడే కాదు.. వందలాది మంది ప్రజలు, గర్భిణులు మృతి చెందుతున్నారు. ఇదీ ఈ ప్రభుత్వం పనితీరుకు పరాకాష్ట. ప్రజావంచక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన చంద్రబాబు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారు. ప్రజల కోసం పోరాడుతోన్న జగనన్నను జైలు పాలు చేయించారు.



దేవుడున్నాడు. జగనన్న ఏదో ఒక రోజు బయటకు వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు. జగనన్నను ఆశీర్వదించండి’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. బహిరంగసభ ప్రారంభంలోనే విద్యుత్ సరఫరాను నిలిపేసిన కాంగ్రెస్, టీడీపీ నేతలు.. సభ ముగిశాక విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 

సభ ముగిసే వరకు ఓపిక పట్టిన వరుణుడు ఆ తర్వాత విజృంభించాడు. ఉరవకొండలో భారీ వర్షం కురిపించాడు. ఆ వర్షంలోనే ఆమె నడుస్తూ రాత్రి 7.45 గంటలకు మార్కెట్ యార్డ్ వద్దకు చేరి రాత్రి అక్కడే బస చేశారు. మొత్తమ్మీద శనివారం పాదయాత్రలో 10 కిలోమీటర్ల దూరం నడిచారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!