జగన్‌తోనే వైఎస్ పథకాల అమలు సాధ్యం
భువనగిరి (నల్లగొండ), న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం కాదని సోమవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో పార్టీలో చేరిన యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్పారు. పార్టీ మొదటి ప్లీనరీలోనే జగన్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకుంటున్న టీఆర్‌ఎస్ అధినేత, వారి కుటుంబసభ్యులు కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందాలను వెల్లడించాలని జిట్టా డిమాండ్ చేశారు.
మహానేత వైఎస్‌ఆర్ రాష్ట్రంలోని ప్రతిఒక్కరి గుండెల్లో ఉన్నారని, ఆయన చేపట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందాయని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వైఎస్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పదవి కాపాడుకుంటున్నారని, చంద్రబాబుతో కుమ్మక్కై అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజా సమస్యలకు ఇవ్వడం లేదన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర తెలంగాణకు చేరుకునేలోగానే జగన్ జైలు నుంచి విడుదలై పాదయాత్రను పూర్తి చేస్తారని జిట్టా చెప్పారు. తెలంగాణలో 70 నుంచి 80 సీట్లు వైఎస్‌ఆర్‌సీపీ సాధించడం ఖాయమన్నారు.
టీఆర్‌ఎస్‌ను నామరూపాల్లేకుండా చేయాలి: సురేఖ
వచ్చే 2014 ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ మార్చ్ విజయవంతం కావడంతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం పోయిందన్నారు. 11 ఏళ్లుగా కేసీఆర్ దొంగమాటలు చెపుతున్నారని, ఆ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. పరకాల ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్ నేతలు గ్రామాల్లో తిష్ట వేసి అహర్నిశలు పాటుపడ్డారని, అయినా ప్రజలు వారికి ముచ్చెమటలు పట్టించారని చెప్పారు. అక్కడ నైతిక విజయం తనదేనని సురేఖ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు 25 వేల కిలోమీటర్లు నడిచినా ప్రజలు ఆయనను నమ్మరని చెప్పారు. ప్రజాభిమానం కలిగిన జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ విజయం ఖాయమని చెప్పారు.
ఎవరి పాపాలనో జగన్‌పై రుద్దుతున్నారు: ఉప్పునూతల
ఎవరో చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై రుద్దుతోందని మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. వైఎస్ వారసునిగా జగన్ నిరంతరం ప్రజల్లో ఉన్నారని చెప్పారు. పరకాలలో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై కొండా సురేఖను ఓడించాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఉప్పునూతల చెప్పారు. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఆయన అన్నారు. |
No comments:
Post a Comment