YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 31 October 2012

అబద్ధాల చంద్రబాబు

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ 
బుధవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 14, కిలోమీటర్లు: 188.30
బాబు హయాంలో గ్యాస్ ధర పెరగలేదట! 
ఫీజుల పథకం, ఆరోగ్యశ్రీ ఆయన ఆలోచనలేనట!
ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది
దాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు.. సర్కారుతోనే కుమ్మక్కయ్యారు
14వ రోజు వర్షంలోనూ ఆగని షర్మిల.. 3 కి.మీ. మేర తడుస్తూనే యాత్ర 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘‘ప్రజలకు మేలు చేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఘోరంగా విఫలమైంది. తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవ్వడంలోనూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలోనూ, నిరుపేదల ఆరోగ్యం పరిరక్షించడంలోనూ విఫలమైంది. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఆ సర్కారుకే కొమ్ముకాస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రలో కొత్తగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 

తన హయాంలో గ్యాస్ ధర పెరగలేదట. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తన ఆలోచనేనట. నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారాయన’’ అని షర్మిల మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇంతటి అన్యాయం, ఘోరం, నీచమైన రాజకీయాలు మరెక్కడా లేనేలేవు. ఇంతటి కుట్రలు, కుతంత్రాలు ఇంతకుముందెన్నడూ లేవు. వారంతా పెద్ద మనుషులే. కానీ చిన్న మనసులు..’’ అని విమర్శించారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 14వ రోజు బుధవారం అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ తరఫున ఈ యాత్ర చేపట్టిన షర్మిల బుధవారం వర్షంలోనూ ఆగకుండా పాదయాత్ర చేశారు.

పెట్టుబడి రూ. 50 వేలు.. పంట రూ. 5 వేలు: ఉదయం 10.30కు కమ్మూరు క్రాస్‌రోడ్డు నుంచి బయలుదేరిన షర్మిల అరవకూరు సమీపంలో ఎండిపోయిన ఓ వేరుశనగ పంటను పరిశీలించారు. అరవకూరుకు చెందిన నారాయణ అనే ఆ రైతు తాను ఐదెకరాల్లో రూ. 50 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేయగా.. చెట్టుకు ఒకటో రెండో కాయలు మాత్రమే కాశాయని, ఇప్పటికే ఆకు ఎండి రాలిపోతోందని వాపోయారు. పంటకు మొత్తం రూ. 5 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదని, చేను తెంపేందుకే ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పంట ద్వారా రూ. 45 వేలు నష్టపోయినట్టేనని కన్నీటి పర్యంతమయ్యారు.

నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం లేదని తోటి రైతులు అంటున్నారని, వాతావరణ బీమా అంటూ ఎంత ప్రీమియం కడితే అంతే పరిహారం వస్తుందని చెబుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇదే జరిగింది. ఆయన మైండ్‌సెట్‌లోకే ప్రజలు రావాలన్నారుగానీ ఆయన మాత్రం ప్రజల అవసరాలను గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పరిహారం చెల్లించే ఉద్దేశం లేకనే ఇలా నడచుకుంటోంది. రాజన్న ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా దాదాపు 95 శాతం వరకు పరిహారం ఇచ్చారు.. పెన్నా రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చి చెరువులు నింపి తద్వారా గ్రామాలకు సాగునీటి కొరతను తీర్చారు..’ అని గుర్తుచేశారు. ఉదయం 11.30కు అరవకూరు చేరుకోగానే మహిళలు షర్మిలకు స్వాగతం పలికి అక్కడే కూర్చుని తమ సమస్యలు విన్నవించారు.

రూ. 20 వేల కరెంటు బిల్లు:
కూడేరు సమీపంలో గాంగ్యా నాయక్ అనే రైతుకు చెందిన చీనీ తోటను పరిశీలించిన షర్మిలతో ఆ రైతు మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తు అంటూనే రూ. 20 వేల కరెంటు బిల్లు కట్టాలని తనను వేధిస్తున్నారని, బుధవారం ఉద యం కూడా అధికారులు తన దగ్గరికి వచ్చారని వివరించారు. చీనీ(బత్తాయి)కి ధర లేదని, గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ‘సర్‌చార్జీలు వేసి ఉండొచ్చు. 

ఈ ప్రభుత్వం రైతులను దెబ్బతీసే చర్యలే తప్ప వారికి ప్రయోజనం కలిగించే చర్యలు చేపట్టడం లేదు. జగనన్న రాగానే పంటల గిట్టుబాటుకు రూ. 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు’ అని షర్మిల భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. సాయంత్రం 5.10కి పాదయాత్ర కూడేరుకు చేరుకునే సరికి అక్కడ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. 

కిక్కిరిసిపోయిన జనం మధ్య షర్మిల మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాల తీరును దునుమాడారు. బుధవారం నాటి పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ శాసన సభ్యుడు ప్రసాదరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

బుధవారం యాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. తుపాను నేపథ్యంలో ఉదయం పూట తుంపర్లతో చిరుజల్లులు కురవగా.. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది. వర్షంలోనే షర్మిల 3 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగించి.. రాత్రి 7 గంటలకు ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన టెంట్‌లోనే బసచేశారు. బుధవారం నాటికి పాదయాత్ర మొత్తం 188.3 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!