కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి శాఖ మార్పుపై స్వపక్ష, విపక్ష నేతల ఆరోపణలు, విమర్శల నేపధ్యంలో ఇటీవలే రాజకీయవేత్తగా మారిన అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి విమర్శలకు మద్దతుగా ఆయన వెల్లడించిన విషయాలు రిలయన్స్ బండారాన్ని బయటపెట్టాయి. పెట్రోలియం శాఖ కంటే శాస్త్ర సాంకేతిక శాఖ చిన్నదా పెద్దదా అన్న అంశం పక్కన పెడితే జైపాల్ రెడ్డిని శాఖ మార్చడం వెనుక రిలయన్స్ హస్తం ఉన్నట్లు తేటతెల్లమవుంతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను వ్యతిరేకించినందువల్లే జైపాల్ రెడ్డి పదవి పోయిందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కృష్ణా-గోదావరి బేసిన్(కెజిబి)లోని సహజవాయువు నిక్షేపాలను కొల్లగొట్టేందుకు జైపాల్‌రెడ్డి అడ్డంకిగా ఉన్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెచ్చిన ఒత్తిడి మేరకే ఆయనను పెట్రోలియం శాఖ నుంచి కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అవమానకరంగా తప్పించారన్నది స్పష్టమైపోయింది.
రిలయన్స్ ఎత్తులను చిత్తుచేసిన జైపాల్ రెడ్డి కేజీ బేసిన్ నుంచి తాము ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను పెంచాలని రిలయన్స్ డిమాండ్ చేస్తోంది. ఒప్పందం ప్రకారం రిలయన్స్ గ్యాస్ ధరను 2014లో సమీక్షించాలి. అయితే ముందుగానే ధర పెంచాలని ఆ సంస్థ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థ ఎత్తులను జైపాల్ రెడ్డి అడ్డుకున్నారు. తన వ్యాపార స్వార్థంతో ఆ సంస్థ గ్యాస్ ఉత్పత్తిని కూడా తగ్గించింది. వాస్తవాలను దాచిపెట్టి గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై జైపాల్ రెడ్డి జరిమానా కూడా విధించారు. ఈ సంస్థను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలన కిందకు తేవాలని కూడా ఆయన ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని రిలయన్స్ అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే పెట్రోలియం శాఖ నుంచి జైపాల్‌రెడ్డిని తప్పించారు.
విధాన రూపకల్పనలో ముఖేశ్ అంబానీ ప్రభావం:ఎంపీ హర్షవర్ధన్ జైపాల్ రెడ్డి శాఖ మార్పు ప్రజలకు ఏం సందేశం పంపుతుదన్న దానిపై పలువురు ఎంపీలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ హర్షవర్ధన్ మరో అడుగు ముందుకు వేసి జైపాల్‌రెడ్డి శాఖను మార్చటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఈ నెల 28న ఒక లేఖ రాశారు. జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి తప్పించటం పొరపాటని, ఇలా చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రక్షణ, హోం వ్యవహారాలు, రైల్వే శాఖల సంప్రదింపుల కమిటీ సభ్యుడు కూడా అయిన హర్షవర్ధన్ పెట్రోలియం శాఖకు - రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మధ్య ప్రస్తుతం నెలకొన్న విభేదాలు రహస్యమైనవి ఏమీ కాదని, ప్రపంచం మొత్తానికీ తెలుసని ఆయన స్పష్టం చేశారు. కేజీ డీ6కు బడ్జెట్ అనుమతుల నుంచీ, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి ఆల్ టైమ్ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవటం వరకూ, వ్యయ వసూళ్లు, ఆర్థిక, పనితీరుపై కాగ్ ఆడిట్ వరకూ అనేక వివాదాలు ఉన్నాయని వివరించారు. చమురు రంగంలో విధాన రూపకల్పనపై ముఖేశ్ అంబానీ, ఆయనకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వ లోపాలను ఆయన ఎత్తిచూపారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని జైపాల్‌రెడ్డి పట్టుపట్టారని, దీనిని రిలయన్స్ పట్టించుకోని విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఇటువంటి వివాదాస్పద సమయాలలో మంత్రిత్వశాఖ సారథిని మార్చటం పొరపాటన్నారు. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పొరపాటు అవగాహనకు దారితీస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం కన్నా శక్తిమంతమైన రిలయన్స్ జైపాల్ రెడ్ది శాఖ మార్పును జేడీ(యూ) అధినేత శరద్‌యాదవ్ తప్పుపట్టారు. ఆయన మాటల్లోనే... ప్రభుత్వం కన్నా రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలు చాలా ఎక్కువ శక్తిమంతమైనవిగా మారిన పరిస్థితులను నా జీవిత కాలంలోనే చూడాల్సి రావటం పట్ల తీవ్రంగా కలతచెందాను. ఒకప్పటి జనతాదళ్ పార్టీలో జైపాల్ రెడ్డి నా సహచరుడు. ప్రస్తుత యూపీఏ సర్కారులోని కొద్ది మంది నిజాయతీ గల మంత్రుల్లో ఆయన ఒకరు. జాతి ప్రయోజనాలను కాపాడేందుకు నిజాయతీగా వ్యవహరించిన మంత్రిని కీలకమైన శాఖ నుంచి తప్పించి అప్రాధానమైన శాస్త్ర సాంకేతిక శాఖకు పంపించటం ఆయన నిజాయతీని శిక్షించటమే.
ముఖేష్ అంబానీ మాటే చెల్లుతుంది:కేజ్రీవాల్ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే చెల్లుతుందని ఇటీవలే రాజకీయవేత్తగా మారిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా యాంటీ కరప్షన్' తరపున కార్పోరేట్ కల్సల్టెంట్ నీరా రాడియా- మాజీ ప్రధాని వాజ్ పేయి అల్లుడు రంజన్ భట్టాచార్య సంభాషణల టేపులను బయటపెట్టారు. కార్పోరేట్ సంస్థల కనుసన్నలలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయనడానికి సాక్ష్యాధాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే......కాంగ్రెస్, బిజెపి రెండూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరించాయి. బిజెపి 2000లో రిలయన్స్ తో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేసింది. కాంగ్రెస్ దానిని విధేయతతో అమలు చేసింది. మురళీదేవరా పూర్తిగా రిలయన్స్ కు అనుకూలంగా వ్యవహరించారు. దశాబ్ద కాలంగా ఈ సంస్థ ఒప్పొందాలను, నిబంధనలను ఉల్లంఘించి భారీగా లాభాలు ఘడించింది. దేశంలో ధరల పెరుగుదలకు ఈ సంస్థ కారణమైంది. కేజీ బేసిన్ గ్యాస్ రిలయన్స్ కు దక్కడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉంది. గ్యాస్ ధరలను పెంచాలని కేంద్రంపై రిలయన్స్ ఒత్తిడి తెచ్చింది. రిలయన్స్ చెప్పినట్లే గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. తన వ్యాపార స్వార్థం కోసం గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించుకుంది. 8 ఎంసిఎండి సామర్ధ్యం ఉంటే రిలయన్స్ కేవలం 3 ఎంసిఎండి మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. కేజీ బేసిన్ గ్యాస్ తో 50 శాతం డిమాండ్ ను తట్టుకోవచ్చు. రిలయన్స్ కంటే తక్కువ ధరకు ఎన్ టిపిసి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం అంగీకరించడంలేదు. రిలయన్స్ గ్యాస్ ధరలను శాసిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రిలయన్స్ ను వ్యతిరేకించినందుకు జైపాల్ రెడ్డి పదవి పోయింది. ఇంధన శాఖ మంత్రులపై రిలయన్స్ పెత్తనం చెలాయిస్తోంది. రిలయన్స్ చెప్పినవారినే పెట్రోలియం అధికారులుగా నియమిస్తున్నారు. కేబినెట్ లో మంత్రులను పారిశ్రామికవేత్తలే నిర్ణయిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే చెల్లుతుంది. దేశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ కాకుండా, ముఖేష్ అంబానీ పాలిస్తున్నారు.
మన్మోహన్ కు తలవంపులు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించిన విషయాలు, జరిగిన పరిణామాల నేపధ్యంలో కేంద్రంలో రిలయన్స్ పెత్తనం ఎలా సాగుతుందో అర్ధమవుతోంది. జైపాల్ రెడ్డిని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించడం ప్రధాని మన్మోహన్ సింగ్ కు తలవంపులు తెచ్చింది. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారం అన్నివిధాల బెడిసికొట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీ సీనియర్ ఎంపి కావూరి సాంబశివరావు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో వేచిచూడాలి.
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51724&Categoryid=28&subcatid=0
No comments:
Post a Comment