YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 3 November 2012

ప్రాణాలంటే లెక్కలేదు..

ఎర్రన్నాయుడు ప్రమాదానికి గురైతే 108కు 11 సార్లు ఫోన్ చేసినా పలకలేదట
మరో ప్రైవేటు అంబులెన్స్ వచ్చినా అందులో ఆక్సిజన్ లేక ఆయన మరణించారు
ప్రతి పథకాన్నీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.. అవిశ్వాసం పెట్టకుండా టీడీపీ చోద్యం చూస్తోంది
చంద్రబాబు హయాంలో నేతన్నలు మరణిస్తే పైసా సాయం చేయలేదు
వైఎస్ వచ్చాక వారి కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం ఇచ్చారు
నేతన్నల కోసం బడ్జెట్‌లో వైఎస్ రూ. 312 కోట్లు పెడితే.. ఇప్పటికీ చెల్లించలేదీ ప్రభుత్వం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 17, కిలోమీటర్లు: 223.60

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘నిన్నటికి నిన్న ఎర్రన్నాయుడు ప్రమాదానికి గురైనప్పుడు 108కు 11 సార్లు ఫోన్ చేసినా పలకలేదట. మరో ప్రైవేటు అంబులెన్స్ వచ్చినా దాంట్లో ఆక్సిజన్ లేక ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనే కాదు. ప్రతి ప్రాణం ముఖ్యం. కానీ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రతి పథకాన్నీ నిర్వీర్యం చేస్తోంది. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చోద్యం చూస్తోంది. ఆ బాధ్యతను చంద్రబాబు విస్మరించారు. చంద్రబాబు నిద్రపోతుంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి మొద్దు నిద్రపోతున్నారు. ఇద్దరూ ఇద్దరే. జోడీ బాగా సరిపోయింది..’ అంటూ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల నిప్పులు చెరిగారు. ‘మరో ప్రజాప్రస్థానం’ 17వ రోజు శనివారం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన భారీ సభలో ఆమె ప్రసంగించారు.

ఆ రూ. 312 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు?

‘‘ఉరవకొండ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులు. రాజశేఖరరెడ్డిని గుర్తు తెచ్చుకుంటే నేతన్నలు నేసిన తెల్లటి బట్టలు గుర్తొస్తాయి. చిక్కటి చిరునవ్వు జ్ఞాపకమొస్తుంది. నేతన్న అంటే రాజన్నకు, జగనన్నకు చాలా ప్రీతి. చంద్రబాబు హయాంలో నేతన్నలను పట్టించుకోకపోవడంతో వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. రాజన్న ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు హయాంలో చనిపోయిన నేతన్నల కుటుంబాలకు లక్షన్నర పరిహారం ఇచ్చి ఆదుకున్నాడు. నేతన్నలకు నడుములు వంగిపోతున్నాయని, కంటిచూపు దెబ్బతింటోందని 50 ఏళ్లకే పెన్షన్ వచ్చే ఏర్పాటుచేశాడు. వాళ్ల అప్పులు తీరిపోవాలని రుణమాఫీ కోసం రూ. 312 కోట్లు బడ్జెట్లో కేటాయించాడు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని చెల్లించలేదు. ఈరోజు నేతన్న కుటుంబం పనికి వెళితే ఆ భార్యాభర్తలకు ఇద్దరికీ రోజుకు రూ. 70 కూడా గిట్టడం లేదట. రోజంతా కష్టపడితే వచ్చే ఈ డబ్బులతో ఆ కుటుంబం ఎలా గడిచేది? పవర్‌లూమ్స్ పెట్టుకుందామంటే కరెంటు ఇవ్వరు. ఇది వారి పొట్టమీద కొట్టడం కాదా?’’ అని షర్మిల నిలదీశారు.

ప్రజలకు అంతా తెలుసు: ‘‘ప్రజలకు తెలుసు.. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నదీ మాట మీద నిలబడే నైజమని! ప్రజలకు తెలుసు.. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నది విశ్వసనీయత అని! చంద్రబాబు ఒక ఇంటర్వ్యూలో అడిగారట. విశ్వసనీయత అంటే ఏమిటని? నాకు ఆశ్చర్యమనిపించింది. ఆయనకు విశ్వసనీయత అంటే తెలియకపోవడమేంటి? విశ్వసనీయత అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు సొంత బిడ్డలా తమను చూసుకుంటాడన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయతీపరుడు, మాట ఇస్తే నిలబడతాడు.. మడమ తిప్పడు అనే నమ్మకం. విశ్వసనీయత అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు’’ అని షర్మిల అన్నారు. ‘‘పాదయాత్ర చేయాల్సిన అవసరమే ఆయనకు లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దింపేయడానికి కావాల్సినంత బలం ఆయనకుంది. కానీ అవిశ్వాసం పెట్టడట. ఈ ప్రభుత్వాన్ని దింపడట. పెంచి పోషిస్తాడట’’ అని విమర్శించారు.

బాబు నడకలో రాజకీయ ఆకాంక్ష: వైఎస్ విజయమ్మ

ఉరవకొండ సభలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘‘8 ఏళ్ల 8 నెలల పాలనలో చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు. ఇప్పుడు ఆయనే సలహాదారుగా ఈ ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు రాజకీయ ఆకాంక్ష ఆయన నడకలో కనిపిస్తోంది. ఎన్నికల కోసం ఏమైనా చెబుతాడాయన. పైగా ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అని కూడా చెబుతారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఉచిత విద్యుత్తు ఇస్తారట. రుణాలు మాఫీ చేస్తారట. బెల్ట్ షాపులు రద్దు చేస్తారట. గ్యాస్ ధర పెంచనేలేదట. ప్రాజెక్టులు పూర్తిచేస్తారట. అప్పుడు వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు కాదా? ఉచిత విద్యుత్తు ఇస్తే బట్టలు ఆరేసుకోవచ్చన్నది చంద్రబాబు కాదా? పంటలు ఎండిపోతున్నాయి.. కరెంటు ఇవ్వాలని కోరితే.. ఎండిపోయాక కరెంటు ఎందుకు అని ఎగతాళి చేసింది చంద్రబాబు కాదా?’’ అని ప్రశ్నించారు.

ఉరకలెత్తిన ఉరవకొండ: మరో ప్రజాప్రస్థానం 17వ రోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి చేరడంతో షర్మిల వెంట జన ఉప్పెన కదిలింది. శనివారం ఉదయం లత్తవరం సమీపం నుంచి ఉదయం గం.11.15కు పాదయాత్ర మొదలవగా.. అడుగడుగునా జనం బారులు తీరి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఉరవకొండ సమీపంలోకి రాగానే పాదయాత్రకు వేలాది మంది స్వాగతం పలికారు. భోజన విరామ అనంతరం 3.30కు వేలాది మంది జనం కదం కలపగా షర్మిల ఉరవకొండ వీధుల్లో పాదయాత్ర చేశారు. సాయంత్రం 5.45కు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న షర్మిల, విజయమ్మ భారీ సభలో ప్రసంగించారు. భారీ వర్షంలో తడుస్తూనే రాత్రి 7.35కు మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన రాత్రి బసకు చేరుకున్నారు. శనివారం 10 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు పాదయాత్ర 223.60 కిలోమీటర్లు పూర్తయింది. శనివారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఉరవకొండ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

షర్మిల వెంట కొడుకు, కూతురు..

షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి తల్లిని కలిసేందుకు లత్తవరం సమీపంలో బస చేసిన చోటుకు వచ్చారు. వారిద్దరూ తల్లితో పాటు మధ్యాహ్న భోజన విరామం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు. 12.40కి కాసేపు వర్షం కురవగా వర్షంలోనే వారు కూడా పాదయాత్ర చేశారు.

రోజుకు రూ. 70తో బతికేదెలా?

షర్మిల ఉరవకొండ వీధుల్లో వెళుతున్నప్పుడు.. చేనేత కార్మికులైన మల్లికార్జున్, సరోజ దంపతుల ఇంటికి వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. చీర నేస్తే ఇద్దరికి కలిసి రోజుకు రూ. 70 ఆదాయం వస్తోందని, నిత్యావసర ధరలు మండిపోతున్నాయని,ఈ ఆదాయం ఏమూలకూ సరిపోదని ఆవేదన వ్యక్తంచేశారు. రూ. 1,600 అమ్మాల్సిన చీర ఇప్పుడు రూ. 1,400కు అమ్మాల్సివస్తోందని, అదే చీరను షోరూముల్లో రూ. 2,500కు అమ్ముతున్నారని వాపోయారు. ముడిసరుకు ధర 200 శాతం పెరిగిందని తెలిపారు. తమకు చేనేత తప్ప వేరే పని రాదని, బతకడం కష్టంగా మారిందని విన్నవించారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న సీఎం అయ్యాక చేనేత కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!