YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 30 October 2012

'వెళుతున్నాం మా కోసం'

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వివిధ పార్టీల నేతలు భారీగా వలస వస్తున్నారు. రోజురోజుకు ఈ వలసల తాకిడి పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదన్న మాటేగానీ, ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయిపోయాయి. మరోవైపు ఉత్సాహంగా పనిచేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాస్తా నీరసించిపోయింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. కాంగ్రెస్-టిడిపి అపవిత్ర కలయికని ప్రజలతోపాటు ఆయా పార్టీల నేతలు కూడా ఛీదరించుకుంటున్నారు. రెండు పార్టీలు కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని వేధిస్తున్నారని, ఆయనను జైలులో పెట్టించారని అందరికీ అర్ధమైపోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గానీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి గానీ 2014 ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని తేలిపోయింది. ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధమైపోయారు. సర్వేలలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. ఇక నేతల చూపంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై పడింది. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలందరూ ఈ పార్టీలో చేరేందుకు బారులుతీరారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' అంటూ పాదయాత్ర మొదలుపెట్టినా పార్టీలో ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు మాత్రం 'వెళ్తున్నాం మా కోసం' అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. ఒక్క టీడీపీనే కాదు అధికార పార్టీ కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు ఈ పార్టీలో చేరిపోయారు. ఇంకా అనేక మంది నేతలు ఈ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. కొంతమంది నేతలు పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా అధికారికంగా ప్రకటించని చాలా మంది నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో టచ్ లో ఉన్నారు. 

నిన్న పశ్చిమ గోదావరి చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కు కూడా పంపారు. లోటస్ పాండ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసి పార్టీలో చేరిపోయారు. ఆయనపై టీడీపీ తరపున పోటీ చేసిన కర్రా రాజారావు కూడా తన అనుచరులతో ఈ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. విశాఖ పట్నం జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కూడా ఈ పార్టీలో చేరారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి నిన్న నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వేల మంది తన అనుచరులతో పార్టీలో చేరారు. అనంతపురంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శరత్‌చంద్రా రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే తరిమెల రంగారెడ్డి కుమారుడైన శరత్‌చంద్రా రెడ్డి 19 మంది మాజీ సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ మండలాధ్యక్షులు, ముగ్గురు నీటి పారుదల సంఘం అధ్యక్షులతో కలిసి పార్టీలో చేరారు. 

ఈరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ కు సంఘీభావం తెలిపేందుకే తాను కలిసినట్లు చెప్పారు. రాష్ట్రం ఒక నేత కోసం ఎదురు చూస్తోందని, ఆయనే జగన్ అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం విఫలమైందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అసలైన ప్రతిపక్షం అని ఆయన అన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులమీద పుట్టిన తెలుగుదేశం అదే పార్టీతో కలిసిపోయిందని విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కాంగ్రెస్‌, టీడీపీలు కేవలం వైఎస్‌ కుటుంబాన్ని వేధించటమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఇబ్బందులు వస్తే నిలదీయాలని టీడీపీకి ప్రజలు 90 సీట్లు ఇస్తే స్వార్థరాజకీయాల కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయన్నారు. ప్రతిపక్షంగా టీడీపీ విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని బాబు వమ్ము చేశారని ఆయన మండిపడ్డారు. 

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే తానేటి వనిత టీడీపీ నుంచి రాజీనామా చేశారు. ఆమె కూడా త్వరలోనే వైఎస్‌ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నవంబర్‌ 4న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ రోజున పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే పెడ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు), కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కొటారి రామచంద్ర రావులు వేలమంది తమతమ అనుచరులతో పార్టీలో చేరనున్నారు. టిడిపి ప్రారంభం నుంచి ఆ పార్టీలో ఉంటున్న కృష్ణబాబు అయిదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కృష్ణబాబుతో పాటు ఆ రోజున అదే జిల్లా నుంచి ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ పార్టీలో చేరే అవకాశం ఉంది. నవంబర్ 11న సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర రావు, 19న ఖమ్మంలో జలగం వెంకట్రావులు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఇదే ఊపు రానురాను మరింత పెరుగుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51663&Categoryid=28&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!