మాటిమాటికీ ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడం చూస్తూంటే రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదనేది స్పష్టమవుతోందని, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రాష్ట్ర ప్రజలపై ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రూ.1,740 కోట్ల భారాన్ని వేయడాన్ని తప్పుపట్టారు. ‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదు. మరో ఐదేళ్లు చార్జీలు పెంచబోమని వైఎస్ ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కింది. రోశయ్య హయాంలో 1,000 కోట్ల రూపాయల చార్జీలు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మరింత ఎక్కువగా విద్యుత్ చార్జీలను పెంచడమే కాక, ప్రతి మూణ్ణెల్లకు ఒకసారి ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట భారం వేస్తున్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో రూ.3,957 కోట్లు, 2011-12లో రూ.2,068 కోట్లు, 2012-13 తొలి త్రైమాసికానికి రూ.1,740 కోట్ల మేరకు సర్దుబాటు చార్జీలు విధించారు’’ అని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రభుత్వం చేతగానిదని, అసమర్థ ప్రభుత్వమని, దద్దమ్మ ప్రభుత్వమని బజారుకెక్కి విమర్శిస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టి ఎందుకు కూలదోయరు’ అని ప్రశ్నించారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment