‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిలకు జనం మొర షర్మిల
కాంగ్రెస్సోళ్లు వడ్డీ లేని రుణాలన్నారు..రెండు రూపాయల వడ్డీ గుంజుతున్నారు
బాబు ఆనాడు రూ. 15 వేల లోనిచ్చాడు..
అధికారులు పుస్తెలమ్మి కట్టేవరకు వెంటపడ్డారు
వీళ్లు ఇప్పుడిచ్చే హామీలు నమ్మలేం
వైఎస్ వెళ్లిపోయాక మా గోడు వినే నాథుడే లేకుండాపోయాడు
‘మరో ప్రజాప్రస్థానం’మంగళవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 13, కిలోమీటర్లు: 176.30
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడు ఊళ్ల మీద పడ్డాడు ఎందుకు? ఆయన ఉన్నప్పుడు నాకు చేనేత సొసైటీ ద్వారా రూ. 15 వేలు అప్పు ఇచ్చారు. కట్టలేకపోతే మా ఇంటికొచ్చి వేరుశనగ మూటలన్నీ బయటపడేశారు. అవి అమ్మినా అప్పు తీరని పరిస్థితి. చేసేది లేక పుస్తెలమ్మి ఆ అప్పు కట్టాను. ఇప్పుడు ఆయనే వడ్డీ మాఫీ, రుణాల మాఫీ అంటున్నాడు. నాడు ఆయనను గెలిపిస్తే ఒక్క సాయమూ చేయలేదు. ఇప్పుడు ఆయన మాటలు నమ్మలేం. రాజశేఖరరెడ్డి హయాంలో మాకు లోన్లు మాఫీ అయితే కాలేదు గానీ ఒకసారి రూ. 18 వేలు ఇన్సూరెన్స్ వచ్చింది’’
- చంద్రబాబుపై లక్ష్మి అనే మహిళ మండిపాటు
‘మేమందరం చేనేత కార్మికులమే. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కొంతమంది పెన్షన్ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయన వెళ్లిపోయాక అభయహస్తం అన్న మాటే మరిచిపోయారు. అప్పుడు నమోదు చేసుకున్న పేర్లు కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. ఇల్లు ఇస్తే పెన్షన్ ఇవ్వరట. మాకు 60 ఏళ్లు దాటాక పెన్షన్ వచ్చేలా రాజశేఖరరెడ్డి ఒక అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది..’
- మరో మహిళ ఆవేదన
..ఇవీ అధికార, ప్రతిపక్షాలపై పేదింటిఆడపడుచుల అభిప్రాయాలు. మంగళవారం అనంతపురం నగర శివార్లలోని సిండికేట్‌నగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పాదయాత్ర సందర్భంగా మహిళా సంఘాలన్నీ ఒక్క చోట చేరి ఆమెకు స్వాగతం పలికి తమ సమస్యలు ఏకరువు పెట్టాయి. పై అభిప్రాయాలన్నీ ఆ సందర్భంగా వారు చెప్పినవే. తమకు పెద్ద దిక్కులాంటి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక, తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మహిళలంతా ఆవేదన వ్యక్తంచేశారు. ‘మగ్గాలు గిట్టుబాటు కాక రెండు నెలలుగా ఖాళీగా ఉన్నాం. కనీసం పిల్లలను బడికి పంపేటప్పుడు రూ. 2 ఇచ్చే స్తోమత కూడా లేదు.. మిద్దెలు, కార్లు ఉన్నోళ్లనే ఈప్రభుత్వం పట్టించుకుంటోంది..’ అని మరో మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ సర్కారును అవిశ్వాసంతో కూలదోయకుండా దానితోనే కుమ్మక్కైన టీడీపీ రాజకీయాలకు నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 13వ రోజు మంగళవారం షర్మిలకు సిండికేట్‌నగర్‌తోపాటు అడుగడుగునా ప్రజలిలా తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.
2 రూపాయల వడ్డీ కడుతున్నాం..
సాయంత్రం బ్రాహ్మణపల్లి క్రాస్‌రోడ్డులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై షర్మిలకు స్వాగతం పలికి తమ కష్టనష్టాలను వివరించారు. ‘రెండేళ్లుగా తాగునీరు లేదు. కరెంటు రెండు మూడు గంటలు కూడా రావడం లేదు. పంటలు లేవు. పావలా వడ్డీ అంటారు.. కానీ రెండు రూపాయల వడ్డీ కట్టించుకుంటున్నారు. ఇదేమని అడిగితే పావలా వడ్డీ అని ఎవరు చెప్పారమ్మా అని ఒకరంటారు. వెనక్కి వ స్తుందిలే అని ఇంకొకరంటారు. పావలా వడ్డీ అమల్లో లేదని ఇంకొకరంటారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉరవకొండలోకి యాత్ర..
అనంతపురం నగరశివారులో కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డులో యాత్ర ప్రారంభమవగా.. శివారు కాలనీల ప్రజలు భారీ సంఖ్యలో షర్మిల వెంట కదం కలిపారు. కేకే కాలనీ, సిండికేట్‌నగర్‌లో భారీసంఖ్యలో మహిళలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాచానపల్లి సమీపంలో భోజన విరామానికి ఆమె ఆగారు. తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమవగా స్థానికులు షర్మిలకు పలు వినతిపత్రాలు అందజేశారు. లెప్రసీకాలనీ వద్ద ఉరవకొండ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. రాత్రి 7.15కు కమ్మూరు క్రాస్‌రోడ్డుకు చేరుకున్న షర్మిల అక్కడ బస చేశారు. షర్మిల మంగళవారం మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు.
మహిళలంటే చిన్నచూపు: షర్మిల
సిండికేట్‌నగర్‌లో, బ్రాహ్మణపల్లిలో మహిళల సమస్యలు షర్మిల విని మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వానికి మహిళలంటే చిన్నచూపు. రాజన్న ఉన్నప్పుడు సాగుకు ఉచితంగా 7 గంటల కరెంటు ఇస్తే.. వీళ్లు రెండు మూడు గంటలు కరెంటు ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. రాజన్న ఉన్నప్పుడు గ్యాస్‌పై రూ.305 కంటే ఒక్క పైసా పెంచలేదు. ఇప్పుడు నెలకో సిలిండర్ వాడేవాళ్ల పరిస్థితి ఘోరం. సగటున రూ. 950 వెచ్చించాల్సిన పరిస్థితి. వడ్డీలేని రుణాలని చెబుతూనే రూ. 2 వడ్డీ వసూలు చేస్తున్నారట. పక్క గ్రామాల్లో కూడా మహిళలు ఈ విషయం చెప్పారు. రాజన్న ప్రతీ పథకం పూర్తిగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా శ్రద్ధ తీసుకున్నాడు’’ అని అన్నారు.
source:sakshi
No comments:
Post a Comment