YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 16 August 2012

ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23-27 లోక్‌సభ సీట్లు.ఎన్నికలొస్తే యూపీఏ ఇంటికే! ఇండియా టుడే-నీల్సన్ సర్వేలో వెల్లడి

- మన్మోహన్ సర్కారుపై ప్రజాగ్రహం
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమి తథ్యం
- యూపీఏకు 171-181 సీట్లు మించకపోవచ్చు
- క్రమంగా బలం పుంజుకుంటున్న ఎన్డీఏ
- ఎన్డీఏకు 195-205 సీట్లు రావొచ్చు
- ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 23-27 లోక్‌సభ సీట్లు రావొచ్చు


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, శాంతిభద్రతల క్షీణత, ఆర్థిక వృద్ధి మందగమనంతో దేశాన్ని తిరోగమనంలోకి నెట్టేసిన మన్మోహన్ సర్కారును గద్దె దింపేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. సుపరిపాలన అందిస్తుందన్న ఉద్దేశంతో 2009లో వరుసగా రెండోసారి అధికారం కట్టబెడితే అధ్వాన్న పనితీరుతో సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తున్న యూపీఏ ప్రభుత్వాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాగనంపి ఎన్డీఏకు మద్దతు పలుకుతామనే సంకేతాలిస్తోంది. ముఖ్యంగా గత మూడేళ్లలో కాంగ్రెస్‌పై ప్రజా విశ్వాసం వేగంగా సన్నగిల్లుతోందని ఇండియా టుడే-నీల్సన్ దేశవ్యాప్తంగా చేపట్టిన తాజా సర్వేలో వెల్లడైంది. 2009తో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య భారీగా తగ్గనుందని సర్వే అంచనా వేసింది. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం పుంజుకుంటుందని అధ్యయనం పేర్కొంది.
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమిపాలవుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. 2009లో యూపీఏకు 259 సీట్లు ఉండగా ఆ సంఖ్య 171-181కి పడిపోవచ్చని పేర్కొంది. మరోవైపు ఎన్డీఏ మాత్రం 2009లో ఉన్న 159 సీట్ల నుంచి 195-205 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 27 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.

ఎవరిని ఉత్తమ ప్రధానిగా భావిస్తారు?, మన్మోహన్ ప్రజల అంచనాలను అందుకున్నారా? మంత్రుల పనితీరు ఎలా ఉంది?, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరిని ప్రధాని అభ్యర్థులుగా భావిస్తారు? వంటి ప్రశ్నల ఆధారంగా ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. మొత్తం 19 రాష్ట్రాల్లోని 125 పార్లమెంటు నియోజకవర్గాల్లో జూలై 6 నుంచి 20వ తేదీ మధ్య అర్హులైన ఓటర్లలోని 15,827 మంది నుంచి ఈ వివరాలను రాబట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున సర్వే సాగింది.

బీజేపీతోనే ఆర్థిక సంస్కరణలు సాధ్యం.
ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్థిక సంస్కరణలు చేపడుతుందని 66 శాతం మంది అభిప్రాయపడగా 47 శాతం మంది మాత్రం ఆర్థిక సంస్కరణల కోసం కాంగ్రెస్ సగటు ప్రయత్నాలే చేస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు ఎక్కువ మంది గుజరాత్ సీఎం నరేంద్రమోడీకే పట్టం కట్టారు. ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అవుతారా? అని అడగ్గా 55 శాతం మంది అవునని, 25 శాతం మంది కాదని సమాధానం ఇచ్చారు.



అలాగే ఉత్తమ ప్రధాని ఎవరు కాగలరన్న ప్రశ్నకు 21 శాతం మంది నరేంద్ర మోడీవైపు మొగ్గు చూపగా 10 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేశారు. అద్వానీకి 8 శాతం, మన్మోహన్, సోనియాలకు 6 శాతం చొప్పున, ములాయం, మాయావతిలకు 4 శాతం చొప్పున, జయలలిత, మమతా బెనర్జీలకు 2 శాతం ఓటేశారు. అలాగే ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే నితీశ్ కుమార్ బీజేపీయేతర ప్రధాని అభ్యర్థిగా నిలుస్తారని 26 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2009 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏకు 33 సీట్లురాగా ఎన్డీఏకు ఒక్క సీటు కూడా రాలేదు. ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో యూపీఏకు కేవలం 3 నుంచి 8 సీట్లు రావొచ్చని, ఎన్డీఏకు ఒక్క సీటు కూడా రాదని సర్వేలో తేలింది. ఇతరుల జాబితాలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 నుంచి 27 సీట్లు, మిగిలిన పార్టీలకు 12 సీట్ల వరకూ రావొచ్చని అధ్యయనంలో వెల్లడైంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!