YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 13 August 2012

ప్రతిభ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ చదువుకోలేని పరిస్థితి ఉండకూడదని..

* మనసుంటే మార్గం ఉంటుంది.. వైఎస్ మనసున్న నాయకుడు
* అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫీజుల పథకం అందేలా చేశారు
* ఈ పాలకులు తమ జేబుల్లో డబ్బు ఇస్తున్నట్లు బాధపడుతున్నారు
* వైఎస్ మరణించాక ఏటా విద్యార్థులకు, తల్లిదండ్రులకు టెన్షనే
* ఇతర రాష్ట్రాల కాలేజీల్లో తరగతులు మొదలవుతున్నా రాష్ట్రంలో ఇప్పటికీ కౌన్సెలింగే మొదలవలేదు
* వైఎస్‌లా పారదర్శకంగా ఫీజుల పథకాన్ని అమలు చేయాలి
* ప్రతి సంవత్సరం బడ్జెట్‌లోనే పూర్తి నిధులు కేటాయించాలి
* యాజమాన్యాలకు బకాయిలను వెంటనే చెల్లించాలి
* ఏలూరులో ప్రారంభమైన విజయమ్మ ఫీజు దీక్ష

ఏలూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘ఈ ప్రభుత్వాలకు ముందుచూపులేదు. మంచి మనసు, మానవత్వం ఉన్న నాయకులే లేరు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకులు అసలే లేరు. మనసుంటే మార్గం ఉంటుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఏదో ఒకటి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫీజుల పథకం అందించాలని తాపత్రయపడేవారు. కానీ ఈ ప్రభుత్వం అర్హుల్ని ఎలా తగ్గించాలా? ఈ పథకాన్ని ఎలా ఎత్తేయాలా అని ఆలోచిస్తోంది. ఫీజుల పథకాన్ని ప్రభుత్వం భారం అనుకుంటోంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. 

‘‘ప్రతిభ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ చదువుకోలేని పరిస్థితి ఉండకూడదని, ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబం నుంచి పేదరికం పోతుందన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజుల పథకం ప్రవేశపెట్టారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా ఉచితంగా చదువు అందేలా చేశారు. ఆయన ఉన్నంతకాలం కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు.. ఏ రోజూ ఈ పథకం అందదనిగాని.. ఇది ఉండదేమోననిగానీ భయపడే పరిస్థితి లేదు. కానీ వైఎస్ మరణం తర్వాత ప్రతి ఏటా చదువులు ప్రారంభమయ్యేటప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజుల గురించి టెన్షన్ పడుతున్నారు’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరితో నలిగిపోతున్న పేద విద్యార్థులకు మద్దతుగా విజయమ్మ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ‘ఫీజు దీక్ష’ ప్రారంభించారు. రెండురోజుల పాటు చేసే ఈ దీక్ష తొలిరోజు ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఐదు రకాలుగా సంక్షేమ పథకాలు
రాజశేఖరరెడ్డి సంక్షేమాన్ని ఒక కన్నుగా, అభివృద్ధిని మరో కన్నుగా భావించి ఎన్నో పథకాలు అమలు చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతకుముందు 9 సంవత్సరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చాలా బాధలు పడ్డారని, ప్రజలు చాలా ఆత్మాభిమానం కలవారని, తిండి లేకపోయినా అడిగే మనస్తత్వం కాదని, వారి కష్టాలు తెలుసుకుని మనమే పనిచేయాలని నాతో ఆయన అంటుండేవారు. 1978లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 2004లో సీఎం అయ్యే వరకు ఈ మధ్యకాలంలో నిరంతరం ప్రజల్లో ఉండి.. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా సీఎం పదవిని చేపట్టారు. రాజశేఖరరెడ్డి.. సంక్షేమ పథకాలను ఐదుగా విభజించి అమలు చేశారు. ప్రతి మనిషికి కావాల్సిన విద్య, ఆరోగ్యం, వృత్తి, ఇల్లు, తినడానికి తిండి ఉండాలని ఆయన ఆశించి అందుకు అనుగుణంగా పథకాలకు రూపకల్పన చేశారు.

మొదటిది విద్య..
ఐదింటిలో మొదటిది విద్య. వైఎస్ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో ట్రిపుల్ ఐటీలు నెలకొల్పారు. ఎక్కడో ఉన్న బిట్స్ పిలానీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉండాలని భావించి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించారు. ఆయన హయాంలో రెండుసార్లు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీలను భారీగా పెంచారు. ప్రతి పేద పిల్లవాడు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యా రంగాన్ని ఇలా ముందుకు తీసుకెళ్లిన ఆయన వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు 108, 104లతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. 

ఏడు, తొమ్మిది తరగతులు చదువుకున్న విద్యార్థులు వివిధ వృత్తుల్లో స్వయంగా పైకి వచ్చేలా చేసి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేశారు. స్వయంగా పైకి రావాలనుకునే వారికి పావలా వడ్డీ రుణాలు ఇప్పించారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఐదు సంవత్సరాల్లో 48 లక్షల ఇళ్లు కట్టించారు. దేశం మొత్తం మీద ఆ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్‌ది. శాశ్వతప్రాతిపదికన అనేక సమస్యల పరిష్కారం కోసం జలయజ్ఞాన్ని ప్రారంభించారు. ఇక ఐదో అంశం తిండి.. రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారా వైఎస్ ప్రజలకు తిండికి ఇబ్బంది లేకుండా చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన్ను నమ్మి ప్రజలు మళ్లీ గెలిపించారు. అదే ఆదరణను మొన్నటి ఉప ఎన్నికల్లో జగన్‌బాబు విషయంలోనూ ప్రజలు మళ్లీ చూపించి తిరుగులేని ఆధిక్యతను ఇచ్చారు.

ఈ పథకం అమలు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి
వైఎస్ ఫీజుల పథకంతోపాటు ప్రతి సంక్షేమ పథకాన్ని కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేశారు. ఆయన హయాంలో 28 లక్షల మందికి ఈ పథకం అందించారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి చూస్తే దాదాపు కోటి మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఒక అంచనా. ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఫీజు పథకాన్ని ఎలా తగ్గించాలా.. ఎలా తీసివేయాలా అని ఆలోచిస్తోంది. రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు ఫీజుల బడ్జెట్ చాలా తక్కువ ఉందని, ఇప్పుడు వేల కోట్లకు పోయిందని మళ్లీ ఆయనపైనే తప్పు వేస్తున్నారు. ఇటువంటి పథకాన్ని అమలు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. తండ్రి లాంటి మనసు ఉండాలి. అలాంటి మనసున్న నాయకుడు వైఎస్.

చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వైఎస్
రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు. ఆయన ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తానన్నపుడు చంద్రబాబు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని అన్నారు. కానీ వైఎస్ చిత్తశుద్ధితో ఐదు సంవత్సరాలపాటు ఏడు గంటల కరెంటును ఇచ్చారు. 2009 ఎన్నికల తర్వాత దాన్ని 9 గంటలపాటు ఇస్తామని చెప్పారు. కరెంటు చార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 1,600 కోట్ల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇస్తూ కూడా చిన్న పరిశ్రమలకు యూనిట్‌కు 75 పైసలు తగ్గించారు. 

రాజశేఖరరెడ్డి ప్రతిరోజూ ప్రజాదర్బార్ పెట్టి ప్రజలను కలుసుకునేవారు. ఈ దర్బార్లలో 70 శాతం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలే వచ్చేవి. ఆయన స్వయంగా డాక్టర్ కావడంతో, ప్రాణం విలువ తెలుసుకాబట్టి ఎంతమొత్తమైనా సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసేవారు. చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేలు కోరినా 4 వేలు, 5 వేలు మాత్రమే సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చేవారట. రాజశేఖరరెడ్డి ఎంత అడిగినా ప్రజలకు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే సీఎం సహాయ నిధికి డబ్బులు చాలకపోవడంతో ఎక్సైజ్ శాఖ నుంచి ఐదు శాతం నిధులు సమకూర్చేవారు. రెండేళ్లలో ఆరోగ్యం కోసం సీఎం నిధి నుంచి రూ.450 కోట్లు ఖర్చు చేశారు.

బడ్జెట్‌లోనే తగిన నిధులు కేటాయించాలి..
ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. రాజశేఖరరెడ్డి ఎలా పారదర్శకంగా ఫీజుల పథకాన్ని అమలు చేశారో అలాగే పథకాన్ని అర్హులైన అందరికీ అందేలా అమలు చేయాలని, యాజమాన్యాలకు పాత బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతి యేటా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండడానికి బడ్జెట్‌లోనే తగిన నిధులు కేటాయించాలని ఈ ఫీజు దీక్ష ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం కోసమే కాదు ప్రజలకు ఉపయోగపడే ఏ పథకం కోసమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇస్తున్నా.

వైఎస్ ఉంటే పథకానికి ఢోకా ఉండేది కాదు
మంచి మనసు ఉంటే మార్గం ఉంటుంది. రాజశేఖరరెడ్డి ఉంటే ఏదోరకంగా ఈ ఫీజుల పథకాన్ని అమలు చేసేవారు. కానీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన మొదటి మీడియా సమావేశంలోనే అర్హులైన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఇస్తామని తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. మూడేళ్ల నుంచి కాలేజీ యాజమాన్యాలకు సరిగా ఫీజులు కట్టకపోవడంతో వాళ్లు కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని భారంగా భావిస్తోంది. పాలకులు తమ జేబులోంచి అప్పనంగా డబ్బు ఇస్తున్నట్లు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకొస్తే.. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా.. పిల్లలను బడికి పంపిన తల్లులకు ప్రోత్సాహకంగా వారి ఖాతాల్లో డబ్బులు వేస్తామని జగన్ బాబు పార్టీ ప్లీనరీలో హామీ ఇచ్చారు.

ఫీజుల కోసం జగన్ బాబు పోరాటం
వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు కోసం రెండున్నర సంవత్సరాల్లో జగన్‌బాబు ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేశాడు. అందులోభాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సరిగా అమలు జరగడంలేదని 2011 ఫిబ్రవరిలో హైదరాబాద్ ఇందిరాపార్కులో వారం రోజుల నిరాహార దీక్ష చేశాడు. బయట ఉంటే ఈరోజు ఇక్కడకు తనే వచ్చేవాడు. పక్క రాష్ట్రాల్లో అప్పుడే కాలేజీలు మొదలైపోతున్నాయి. మన రాష్ట్రంలో జూలైలో జరగాల్సిన కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సమయంలోనూ ప్రభుత్వం కమిటీలని, చర్చలని కాలయాపన చేస్తోంది. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ఫీజు దీక్షకు వెళ్లమ్మా అని జగన్‌బాబు నన్ను పంపాడు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!