YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 15 August 2012

ఎక్కడికెళ్తోందీ దేశం?

స్వాతంత్య్ర దినోత్సవం అనగానే తెల్లవారు జామునే చెవులు పగలగొట్టే లౌడ్ స్పీకర్లూ- రంగుల తోరణాలూ- రెపరెపలాడే త్రివర్ణ పతాకాలూ- నేతాశ్రీల గంభీరోపన్యాస ఝంఝామారుతాలూ కనబడతాయి, వినబడతాయి. వీథివీథినా దేశభక్తి గీతాలు వరద కాలవల్లా ప్రవహిస్తాయి.

‘జహా( డాల్‌డాల్‌పర్ సోనేకీ చిడియా కర్తేహై బసేరా- వో భారత్ దేశ్ హై మేరా!’
‘ఏ మేరే ప్యారేవతన్- ఏమేరే బిఛ్‌డే చమన్ తుఝ్‌పె మై( ఖుర్‌బాన్’
‘ఏ మేరే వతన్ కే లోగో( జర ఆంఖ్ మే భర్‌లో పానీ- జో శహీద్ హుయేహై ఉన్‌కీ జర యాద్ కరో ఖుర్‌బానీ’ లాంటి అమృతగీతాలను ఎప్పుడో ఏ పంద్రాగస్ట్ రోజునో, రిపబ్లిక్ డేనాడో మాత్రమే వింటాం.

కొందరు ఔత్సాహికులు ‘జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి’- ‘పాడవోయి భారతీయుడా- కదలి సాగవోయి వెలుగు దారులా’ అంటూ ‘మనవాళ్ల’ పాటలు కూడా వినిపిస్తుంటారు. ఇక, మన నేతాశ్రీల జ్ఞాపక శక్తి అమోఘం! ప్రతి సంవత్సరం ఒకే ఉపన్యాసం -పొల్లుపోకుండా- అప్పజెప్పడం వారికే చెల్లింది.

ఇక నయీ దిల్లీలో ప్రధాన మంత్రి పొద్దున్నే రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపితకు నివాళులు సమర్పించుకుంటారు. ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తదనంతరం ఎర్రకోట బురుజులపైన జాతీయ పతాకాన్ని ఎగరేసి, జాతిని ఉద్దేశించి గంభీరోపన్యాసం చేస్తారు. ఇంతకీ, స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడమంటే ఇంతేనా? చాలా తేలికే అనిపిస్తోంది కదూ?!

అంత వీజీ కాదంటున్నారు ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. దారిద్య్రం తొలగిన రోజే నిజమయిన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలన్నారు మన్మోహన్ సింగ్. ఎంతయినా ఆర్థిక శాస్త్రవేత్త కదా మరి! నానాటికీ పెరుగుతున్న ఆర్థిక మాంద్యం ముప్పును గురించి ఆయన జాతిజనులను హెచ్చరించారు. అసోమ్ అల్లర్లు జాతి నెన్నుదుటన కళంకమన్నారు ప్రధాని. వంద శాతం అక్షరాస్యత ఇంకా సాధించాల్సిన లక్ష్యంగానే మిగిలివున్నందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావించని ఘోరమయిన సమస్యలు మరికొన్ని కూడా ఉన్నాయి.

నడిరేయి ఆడపడుచు ఒంటరిగా నడిరోడ్డున నడవగలిగిననాడే మన దేశానికి స్వాతంత్య్ర వచ్చిందని ఒప్పుకుంటానన్నారు జాతిపిత గాంధీజీ. పరువు పేరుచెప్పి కన్నబిడ్డలను కత్తికి బలిపెడుతున్నారు మనవాళ్లు. నిన్నగాక మొన్న ఈ సంస్కృతి దక్షిణాది రాష్ట్రమయిన కర్ణాటకకు కూడా పాకిన ఉదంతం పత్రికలకెక్కింది. మన రాష్ట్రంలో కూడా -కర్నూలు జిల్లా చాగలమర్రిలో- పరువుకోసం పడిచచ్చే ఓ అన్నగారు ఆడపడుచును హతమార్చిన సంఘటన గురించి పత్రికలు రాశాయి. ఇంకా వెలుగులోకి రాని ఉదంతాలెన్నో ఉన్నాయంటున్నారు!

పేదవాళ్లకీ, నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో కింద మెట్టుమీద ఉన్న వారికీ విద్య ఇప్పటికీ అందని మాని పండయి కూర్చునే ఉంది. మహానేత వైఎస్‌ఆర్ లాంటివాళ్లు పేదకుటుంబాల పిల్లల కోసం ఉద్దేశించిన ఫీజు వాపసు పథకం కొనసాగేలా చెయ్యడం కోసం ఆయన సతీమణి -వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ- రెండురోజులు నిరశన వ్రతం చెయ్యవలసిరావడం కన్నా దారుణం ఉంటుందా?

మన దేశంలో పేదరికం పల్లెపట్టుల్లో గడ్డకట్టుకుపోయి ఉంది. అక్కడ మార్పు తీసుకురావలంటే, ముందు రైతాంగం పట్ల ప్రభుత్వ వైఖరిలో విప్లవాత్మకమయిన మార్పు రావాలి. దుక్కిదున్నే ప్రతి రైతూ ప్రాథమికంగా ఓ సమాజ సేవకుడేనన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఆ విషయం గ్రహిస్తే, గిట్టుబాటు ధరల విషయంలో మన శాసననిర్మాతలు చిల్లరకొట్టు చిట్టెయ్యల్లా గీచిగీచి బేరాలాడడం మానేస్తారు.

పేదరికం పుట్టకురుపు పగులుతుంది. సరయిన సమయానికి సరిగ్గా స్పందిస్తే రైతన్నల ఆర్థిక సామర్థ్యం పెంపొందించడం కచ్చితంగా సాధ్యమే. కూలిపని చేసుకునేవారికన్నా తక్కువ తలసరి ఆదాయంతో చిన్న రైతులు బతుకీడ్చాల్సిన దుస్థితి తొలగిపోతుంది. ఇలాంటి పరిష్కారాల సూచనలేవీ ప్రధాని స్వాతంత్య్రోత్సవ ప్రసంగంలో కనిపించకపోవడం దురదృష్టం. అది లేకపోగా, మౌలిక వనరుల కల్పన రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం ద్వారా ఏదో పొడిచేస్తామని మన్మోహన్ సింగ్ చెప్పడం విడ్డూరంగా ఉంది.

అలాగే, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలమన్న ఆశాభావం ఉందని ఆయన గర్వంగా ప్రకటించడం అర్థరహితం. అలాంటి పెట్టుబడిదారుల చేతిమీదుగానే, మన ఆర్థిక రంగంలోకి మాంద్యం కట్టలు తెంచుకుని ప్రవహించే ప్రమాదం ఉందని సుప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్‌కు మనం చెప్పాలా?

ఇదీ మనకు సంక్రమించిన నాయకత్వం! ఈ తరహా నేతల సారథ్యంలో దేశం ఎక్కడికెళ్తుందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. అంతకన్నా చెవుల పగలగొట్టే లౌడ్ స్పీకర్లలో దేశభక్తి గీతాలు వింటూ కునుకు తియ్యడం నయమనిపిస్తుంది! 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!