YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 14 August 2012

జగన్‌ను ఒంటరిని చేసి, ప్రజల్లో ఆయనను పల్చన చేసి తద్వారా ......

ఏం చేయదల్చుకుని బయల్దేరారో, ఎక్కడికొచ్చారో ఢిల్లీలో కొలువుదీరిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు అర్ధమవుతోందా? అహంకారం తలకెక్కి, చూపు మసకబారినప్పుడు అది సాధ్యం కాదుగాక కాదు. ఏణ్ణర్ధం కాలానికిపైగా ఆ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో ఆత్మహననానికి దారితీసే చర్యలకు పాల్పడుతున్న తీరును ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘ధిక్కారమున్ సైతునా...’ అనే ధోరణిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చర్యలకు ఉపక్రమించిననాటినుంచీ కాంగ్రెస్ తన సొంత కొంపకు నిప్పెట్టుకుంటున్న వైనం అందరికీ దిగ్భ్రమ కలిగిస్తోంది. దక్షిణాదిన తిరుగులేని బలమున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను అది ఈ చర్యలద్వారా చేజార్చుకుంటున్న దృశ్యం కళ్లకు కడుతోంది. 

చిత్రంగా హస్తినలోని పెద్దలు మాత్రం తమ శకుని మాయోపాయాలను విసుగూ, విరామమూ లేకుండా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వాన్‌పిక్ కేసులో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును, ఇద్దరు ఐఏఎస్ అధికారులను, మరికొందరిని నిందితులుగా చేరుస్తూ ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసిన అయిదో చార్జిషీటు దీన్నే మరోసారి ధ్రువీకరిస్తోంది. ఈ చార్జిషీటు పర్యవసానంగా ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. మూడునెలల క్రితం మంత్రి మోపిదేవి వెంకట రమణను విచారించడానికని పిలిచి అరెస్టు చేశారు. ఇప్పుడు మరో మంత్రి వంతు వచ్చినట్టుంది. వీరిద్దరూ వెనకబడిన కులాలకు చెందినవారే కావడం యాదృచ్ఛికం కాదని తెలుస్తూనే ఉంది. 

జగన్‌ను ఒంటరిని చేసి, ప్రజల్లో ఆయనను పల్చన చేసి తద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తును సమాధిచేసి కక్ష తీర్చుకుందామన్నది కాంగ్రెస్ అధిష్టానం దుష్టపన్నాగం. 

ఆ సంగతి ఆదిలోనే అందరికీ అర్ధమైంది. వైఎస్ హయాంలో జారీ అయిన 26 జీవోల ద్వారా జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లోకి ‘క్విడ్ ప్రో కో’ పద్ధతిలో పెట్టుబడులు వచ్చాయని ఒకపక్క కేసు నడిపిస్తూ, అందుకు మూలమైన జీవోల గురించి మాత్రం ఎన్నడూ సీబీఐ దృష్టి పెట్టకపోవడాన్నిబట్టే అది తెలిసిపోయింది. ఈ తతంగానికి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బ్రేక్ పడింది. ఆ తర్వాత మాత్రమే జీవోలకు కారకులైన మంత్రులపైనా, అధికారులపైనా సీబీఐ దృష్టి సారించవలసి వచ్చింది. శంకరరావు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ 26 జీవోల గురించీ కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు ఆదేశించినా... అలా చేస్తే అంతా సవ్యంగా జరిగిందని చెప్పవలసి వస్తుందని, అందువల్ల జగన్‌ను ఇరకాటంలో పెట్టడానికి గానీ, ఆయనను దోషిగా చూపించడానికిగానీ కుదరదన్న దురాలోచనతోనే ఆనాడు సర్కారు మౌనం వహించందన్నది రాష్ట్రంలోనే కాదు...దేశంలో అందరికీ తెలుసు. ‘జరుగుతున్న నాటకమంతా జగన్‌పైనే కదా... మన మీదకు ఏం రాద’న్న భరోసాతో కళ్లముందు సాగుతున్న అన్యాయాన్ని గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడమే కాదు...ఆయనపై తామూ ఒక రాయి వేసి ‘పైన’ మార్కులు కొట్టేద్దామని చూసిన సచివులకు ఇవాళ కష్టాలు వచ్చిపడ్డాయి. ఒకరిపై అక్రమార్జన ఆరోపణ చేసినప్పుడు, అందుకు అవసరమైన అక్రమాలు ప్రభుత్వంలో జరిగి ఉన్నాయని నిరూపించాల్సిన అవసరం ఉంటుంద న్న కనీస స్పృహ వీరందరికీ లోపించడం విచిత్రం. ఇప్పుడు జుట్టు చేతికిచ్చి గంతులేసినట్టు వీరంతా ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆరోజు కేసు వేయించింది, అందులో కౌంటర్ దాఖలు చేయకుండా ఆపింది ఎవరో తెలిసి కూడా ఇప్పుడు అసంతృప్తికి లోనవడం, ఆగ్రహానికి గురికావడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. 

ఇప్పుడు నిందపడ్డ మంత్రులందరూ తాము కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగానే పనిచేశామని చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన ఎక్కడా జరగలేదంటున్నారు. అంతా సవ్యంగానే ఉందంటున్నారు. శంకరరావు పిటిషన్ విచారణకొచ్చినప్పుడే దాన్ని బలంగా చెప్పివుంటే తమకు సరే... మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ఇంతచేటు నగుబాటు వచ్చేదికాదని రాజకీయాల్లో తలపండిపోయిన వీరందరికీ తెలియదనుకోలేం. అలా చేయకపోవడంద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలోనూ, దేశంలోనూ వరసగా రెండోసారి అధికారం సాధించిన దివంగత నేతను అపకీర్తిపాలు చేస్తున్నామని, ఆయనపట్ల చూపవలసిన కృతజ్ఞతకు మారుగా కృతఘ్నతను ప్రదర్శిస్తున్నామని వీరి స్ఫురణకు రాకపోవడం దురదృష్టకరం.

ఇప్పుడు ధర్మాన రాజీనామాతో ఇది ఆగదు. ఏదో కారణం చెప్పి ఆయన రాజీనామాను ఆమోదించినా, ఆమోదించకపోయినా ఇంకా నలుగురైదుగురు మంత్రులు, అరడజను మంది ఐఏఎస్‌లు ఈ విషవలయంలో చిక్కుకో బోతున్నారు. ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, అభివృద్ధిని కాంక్షించి తీసుకున్న నిర్ణయాలపై ఇంత రచ్చచేసి, ఇంతమందిని బలిచేసి ఇంతకూ హస్తిన పెద్దలు సాధించదల్చుకున్నదేమిటి? దేశంలో అమలు చేయడం ప్రారంభించిన సరళీకరణ విధానాలకు భిన్నంగాగానీ, ఏ రాష్ట్రమైనా పాటించిన పద్ధతులకు విరుద్ధంగా గానీ వైఎస్ ఏమైనా చేశారా? గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలైతే వేల ఎకరాల భూముల్ని ఉచితంగా ఇచ్చిమరీ తమ ప్రాంతాలకు పరిశ్రమలు తెచ్చుకున్నాయి. అవన్నీ సవ్యమే అయినప్పుడు ఇక్కడ అమలు చేసిన నిర్ణయాలు తప్పెలా అవుతాయి? కనీసం స్వీయ శ్రేయస్సును కాంక్షించయినా తెలుగుదేశంతో కుమ్మక్కవడంలాంటి ఆత్మహత్యాసదృశమైన చర్యలకు పాల్పడకుండా ఉంటే, ఏమీలేని చోట కుంభకోణాన్ని వెతికే ప్రయత్నం చేయకపోతే కాంగ్రెస్‌కు కొంతైనా గౌరవం దక్కేది. ఇప్పుడు సర్వభ్రష్టమై రాష్ట్ర ప్రజలముందు సర్కారే దోషిగా నిలుచుంది. అందుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు కూడా ఇక ఎంత దూరంలో లేదు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!