YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 14 August 2012

ఎట్టకేలకు హెల్త్‌కార్డు జీవోల జారీ

నవంబర్ 1 నుంచి అమల్లోకి ఉద్యోగుల వైద్య నిధి పథకం
184, 186 జీవోలు విడుదల చేసిన సీఎస్
డేటా సేకరణ, కార్డుల జారీ మార్గదర్శకాలు ఖరారు
సెప్టెంబర్ 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 20 వరకు గడువు.. ఆధార్ తప్పనిసరి
సర్వీస్ ప్రొవైడర్‌గా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు బాధ్యతలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హెల్త్ కార్డుల సంబంధిత జీవోలు మంగళవారం జారీ అయ్యాయి. ప్రస్తుత మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థానంలో ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి వీలుగా ‘ఉద్యోగుల వైద్య నిధి పథకం’ అమలుకు తొలి దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈమేరకు అవసరమైన రెండు వేర్వేరు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. పథకం అమలుకు ఆరోగ్యశ్రీ ట్రస్టును సర్వీస్ ప్రొవైడర్‌గా నియమించడంతో పాటు పథకంలోని ముఖ్యాంశాలను పేర్కొంటూ 184 జీవో, డేటా సేకరణ మార్గదర్శకాలతో కూడిన 186 జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ పేరిట వైద్య ఆరోగ్య శాఖ వెలువరించింది. నవంబర్ 1 నుంచి నూతన పథకం అమల్లోకి తీసుకొచ్చే విధంగా ముందస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20లోగా డేటా సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.

పథకం ముఖ్యాంశాలు...

ఆరోగ్యశ్రీ ట్రస్టు తొలి రెండేళ్లు సర్వీస్ ప్రొవైడర్, అమలు ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ.. పథకం అమలును పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు అమలు తీరును సమీక్షించనుంది. కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులతో పాటు జీఏడీ ఎంపిక చేసిన సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.

పథకం పరిధిలోకి రావాలంటే ఉద్యోగులు తప్పకుండా తన వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలి. గ్రేడుల ఆధారంగా చందా కట్టాలి. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో అన్ని రకాల జబ్బులకు ఈ పథకం కింద వైద్యం అందిస్తారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల వరకు అయ్యే వ్యయాన్ని కూడా ప్యాకేజీలో భాగంగా పరిగణిస్తారు. ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్టంగా రూ.3 లక్షల విలువైన వైద్యం అందించనున్నారు. ఒక్కో కుటుంబసభ్యుడికి గరిష్టంగా రూ.2 లక్షల పరిమితి విధించారు.

ఉద్యోగి తల్లిదండ్రులతో పాటు భార్య/భర్త తల్లిదండ్రులు, పిల్లలు పథకం పరిధిలోకి రానున్నారు. వికలాంగులైన కుమారులు, తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుమార్తెలకు కూడా పథకం వర్తింపజేయనున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర ఆరోగ్య పథకాల సౌకర్యాలను అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. అఖిలభారత సర్వీసు అధికారులనూ ఈ పథకంలో చేర్చలేదు. కుటుంబ పెన్షనర్ మీద ఆధాపడిన కుటుంబసభ్యులకూ ఈ సౌకర్యం వర్తించదు. క్యాజువల్, డైలీ పెయిడ్ వర్కర్స్‌నూ ఇందులో చేర్చలేదు.

డేటా సేకరణ ఇలా...

ఉద్యోగులందరూ తమ వివరాలు సమర్పించడానికంటే ముందే విధిగా ఆధార్ నంబర్ పొందాలి. ఇప్పటివరకు ఆధార్ కేంద్రాల్లో నమోదు చేయించుకోని వారు వెంటనే నమోదు చేయించుకోవాలి. నమోదు సమయంలో ఇచ్చే ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను దరఖాస్తులో పేర్కొనాలి. దీని కోసం పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.

ఉద్యోగులంతా హెచ్‌ఆర్‌ఎంఎస్-ఈఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోర్టల్(వెబ్‌సైట్) సెప్టెంబర్ 10 నుంచి అందుబాటులోకి వస్తుంది. వెబ్‌సైట్ అడ్రస్‌ను ప్రభుత్వం తర్వాత వెల్లడించనుంది.

దరఖాస్తు సమర్పణకు ఉద్యోగులు ఈ పోర్టల్‌లో లాగిన్ కావాలి. లాగిన్ కోసం ఉద్యోగులు తమ ఎంప్లాయ్‌మెంట్ కోడ్‌ను ఐడీగా వినియోగించాలి. పాస్‌వర్డ్‌ను సంబంధిత డీడీవో(డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్) ఉద్యోగులకు ఇస్తారు. దీంతో లాగిన్ అయిన తర్వాత పాస్‌వర్డ్‌ను ఉద్యోగులు మార్చుకోవాలి. తర్వాత శాఖ, ప్రాంతం, సంబంధిత డీడీవో.. ఇతర వివరాలను నమోదు చేయాలి. సర్వీస్ రిజిస్టర్‌లోని డెమోగ్రాఫిక్ డేటా, ఆధార్ నంబర్ (ఎన్‌రోల్‌మెంట్ నంబర్ అయినా సరే) పేర్కొనాలి. తనతో పాటు కుటుంబసభ్యుల పాస్‌పోర్ట్ సైజ్ డిజిటల్ ఫొటోలు, సర్వీస్ రిజిస్టర్‌లోని తొలి రెండు పేజీలు, కొత్త సర్వీస్ రిజిస్టర్ అయితే 4, 5 పేజీలను స్కానింగ్ చేసిన కాపీలు, రేషన్ కార్డు కాపీని దరఖాస్తుతో పాటు అటాచ్ చేయాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఉద్యోగులు సంబంధిత డీడీవో, ఎస్టీవో, ఏపీపీవోలను అన్ని వివరాలు, డాక్యుమెంట్లతో సంప్రదించాలి. అన్నివిధాలుగా భర్తీ చేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకొని, దాని మీద సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి మరోసారి లాగిన్ అయి దాన్ని కూడా దరఖాస్తుకు అటాచ్ చేయాలి. దీన్ని ఉద్యోగి స్వయం ధ్రువీకరణగా ప్రభుత్వం భావిస్తుంది. అనంతరం.. దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి. ఒకసారి సబ్‌మిట్ చేసిన తర్వాత అందులో మార్పులు చేయడం ఉద్యోగులకు వీలుకాదు. సబ్‌మిట్ చేసిన దరఖాస్తు ప్రింటవుట్ తీసుకొని దాని మీద సంతకం చేసి సంబంధిత డీడీవోకు సమర్పించాలి. కుటుంబ సభ్యుల గురించి తప్పుడు సమాచారం ఇస్తే.. ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

పెన్షనర్లు కూడా ఇదే విధానం అనుసరించాలి. పెన్షనర్ల విషయంలో ఎస్టీవో (సబ్ ట్రెజరీ ఆఫీసర్), ఏపీపీవో (అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ ఆఫీసర్)లు డీడీవోలుగా వ్యవహరిస్తారు.
ఇతర మార్గదర్శకాలు...

ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తులను డీడీవోలు తమ ఐడీతో లాగిన్ అయి పరిశీలించాలి. కార్యాలయ రికార్డులోని వివరాలతో దరఖాస్తులో పేర్కొన్న అంశాలను సరిపోల్చుకోవాలి. తేడాలుంటే సంబంధిత దరఖాస్తులను తిరస్కరించవచ్చు. తిరస్కరించిన దరఖాస్తుల్లో పొరపాట్లను ఆన్‌లైన్‌లో సరిదిద్దుకోవడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. డీడీవో తన వద్దనున్న డేటాను ట్రెజరీ శాఖ డెరైక్టరేట్‌కు పంపించాలి.

ఆన్‌లైన్‌లో వచ్చిన డేటాను ట్రెజరీ శాఖ డెరైక్టర్ రెండు వారాలకు ఒకసారి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇవ్వాలి. ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేసిన చందాను ఆరోగ్యశ్రీ ట్రస్టుకు బదిలీ చేయాలి. 45 లక్షల మంది హెల్త్‌కార్డుల కోసం దరఖాస్తు చేస్తారని అంచనా.

పథకం అమలు విధివిధానాలను జారీ చేసే బాధ్యతను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు అప్పగించారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందించే జబ్బులకు అక్కడే వైద్యం చేయించుకోవాలి. మిగతా ఎంపిక చేసిన జబ్బులకు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ తరహాలోనే నగదు రహిత వైద్యం అందించనున్నారు. హైదరాబాద్ జాంబాగ్‌లోని మార్క్‌ఫెడ్ భవన్‌లో కార్యాలయం ఏర్పాటు, పథకం అమలుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడానికి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అవకాశం కల్పించారు.

ఆధార్ కేంద్రాల ఏర్పాటు, డేటా సేకరణ సాగుతున్న తీరు, హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ.. సజావుగా సాగే విధంగా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.


నవంబర్ నుంచి అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు
నవంబర్ 1 నుంచి హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరిస్తామని చెప్పారు. ఎట్టకేలకు జీవో జారీ చేసినందుకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్‌బాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకూ పథకాన్ని విస్తరించాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, యూపీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ, వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్టీరింగ్ కమిటీలో అన్ని ప్రాంతాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సమ ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

75 వేల మంది ఉద్యోగులకు అన్యాయం!

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, హెల్త్‌కార్డుల జీవోలో పేర్కొన్న అంశాలకు పొంతన లేకుండా పోయింది. 010 హెడ్ కింద జీతాలు తీసుకుంటున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి హెల్త్‌కార్డులు జారీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే.. స్థానిక సంస్థల ప్రొవిన్సిలైజ్డ్ ఉద్యోగులకే ఈ పథకం వర్తిస్తుందని జీవోలో పేర్కొనడంతో స్థానిక సంస్థల కింద ఉన్న మున్సిపల్, గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 75 వేల మంది ఉద్యోగులకు ఈ పథకం కింద అర్హత లభించకుండా పోయింది. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలతో పాటు యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి కూడా హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!