YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 15 August 2012

వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దాం .స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ విజయమ్మ పిలుపు


హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకునేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘ప్రస్తుత ప్రభుత్వంలో దేనికీ భరోసా లేదు. రైతుకు భరోసా లేదు. కరెంటుకు భరోసా లేదు. ఉద్యోగాలు, చదువులకు భరోసా లేదు. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊళ్లలోని ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. 

‘ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీని కాదని.. ప్రజలు మన పార్టీకి పట్టం గట్టారు. ప్రజల పట్ల మనకు ఎంతో బాధ్యత ఉందని గుర్తించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ శ్రమించాలి. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి’ అని అన్నారు. జగన్ సీఎం అయినప్పుడే వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయన్నారు. పేదల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ అన్న మాటలను.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే పదే పదే అసెంబ్లీలో చెప్పేవారని గుర్తుచేశారు. 

అందుకే వైఎస్ సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యతను ఇస్తూ ప్రణాళికలు రచించారన్నారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇవి రెండో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలని.. రాష్ట్ర ప్రజలకూ, కార్యకర్తలకూ వైఎస్సార్ కాంగ్రెస్ తరపున, జగన్ బాబు తరఫున తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. వైఎస్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!