వృత్తివిద్యా కళాశాలల్లో ఏకీకృత ఫీజుల వ్యవహారం రాష్ట్ర సర్కారుకు ఇరకాటంగా, రెండు లక్షల మంది విద్యార్థులకు శాపంగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన, నిర్లక్ష్యవైఖరి... రాష్ట్రంలోని వృత్తివిద్యా కళాశా లల యాజమాన్యాల ధనదాహం వెరసి సం క్షోభం ఉధృతమైంది. వృత్తివిద్య కళాశాలల్లో చేరడంలో జరుగుతున్న జాప్యానికి లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రారంభంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అమ్మకాల ద్వారా కోట్లు గడించడం, అక్రమంగా మైనారిటీ విద్యాసంస్థల హోదా పొంది విద్యావ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాయి. కళాశాలల సంఖ్య పెరిగిపోవడం, విద్యార్థుల అనాసక్తి వెరసి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల డిమాండ్ తగ్గి 20 వేలకే ఇంజనీరింగ్ సీటు అమ్ముకోవాల్సిన దుస్థితి కళాశాలల యాజమాన్యానికి ఏర్పడింది. కన్సల్టెన్సీల ద్వారా, పీఆర్‌ఓల ద్వారా లక్షల రూపాయల ఆఫర్లు ప్రకటించినా గత సంవత్సరం దాదాపు 256 ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య వందలోపే. 40 కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య 10 లోపు.
ఈ పరిస్థితుల్లో యాజమాన్యాల దృష్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పైన, ఏకీకృత ఫీజులపైన పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించి, విద్యార్థుల భుజాలపైన తుపాకులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించడం ద్వారా యాజమాన్యాలు తమ పంతాన్ని నెగ్గించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏకీకృత ఫీజులను అమలుపరచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అన్-ఎయిడెడ్, నాన్-మైనారిటీ వృత్తివిద్యాసంస్థల నిబంధనలను, ప్రవేశాలు, ఫీజుల నియంత్రణల మండలి (ఎఎఫ్‌ఆర్‌సీ) ప్రతిపాదనలను సవాలుచేస్తూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత 2011 అక్టోబర్ 29న జస్టిస్ గోడా రఘురాం, జస్టిస్ పి.దుర్గాప్రసాద్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రైవేట్ వృత్తివిద్యా కళాశాలల్లో ఉన్న కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా విధానాలను రద్దుచేసి విద్యార్థులందరికీ కామన్ ఫీజు విధానాన్ని అమలుపరచాలని తీర్పుచెప్పింది.
ప్రైవేట్ యాజమాన్యాలు అత్యాశతో లాభార్జనకు దిగకుండా అజమాయిషీ చేసే అధికారం మాత్రమే చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఫీజులను నిర్ధారించి ప్రకటించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుపై తర్జనభర్జన పడిన రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత ఫీజులు, ఫీజుల పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారమవుతుందని రాష్ట్రంలో కాలేజీలు లెక్కకు మించి పెరగడం వల్ల చాలా సీట్లు ఖాళీగా ఉంటున్నాయని కొన్ని కాలేజీల్లో అసలు సీట్లు భర్తీకావడం లేదనే అంశాల ఆధారంగా రాష్ట్ర హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్‌పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 5 నెలల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మే 9న మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. 2010-11, 2011-12 విద్యా సంవత్సరాలకు కూడా కామన్ ఫీజు ఉండాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ రాబోయే విద్యాసంవత్సరానికి నూతన వేతన స్కేళ్ల ఆధారంగా కళాశాలల వ్యయాన్ని మదింపు చేసి ఫీజులను నిర్ణయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నూతన వేతన స్కేళ్లు అమలుచేస్తున్నామని లేదా చేస్తామనే హామీ పత్రాలతోపాటు వ్యయ నివేదికలు సమర్పించిన కళాశాలలకు ఫీజులు ప్రతిపాదించాలని ఎఎఫ్‌ఆర్‌సీని కోర్టు ఆదేశించింది. తుది తీర్పు 2012 సెప్టెంబర్ 25న వెల్లడించనున్నట్లు పేర్కొంది.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ర్ట ప్రభుత్వం వ్యయనివేదికలు సమర్పించిన కాలేజీలకు ఏకీకృత ఫీజును అమలుపరచడానికి అభ్యంతరం లేదని జనవరి 2012లో సుప్రీంకోర్టుకు ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యయనివేదికలు అందజేసిన 133 కళాశాలలకు ఏకీకృత ఫీజులను ప్రతిపాదించామని, ఇంకా అనేక కళాశాలల వ్యయ నివేదికలు సమర్పించకపోవడంతో వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి మరింత సమయం పడుతుంది కనుక ఈ ఏడాది కూడా తుది తీర్పునకు లోబడి కామన్ ఫీజుల విధానాన్ని కొనసాగించవచ్చా అని తన దరఖాస్తులో సుప్రీంకోర్టును కోరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను తోసిపుచ్చింది.
2012-13 విద్యా సంవత్సరానికి విద్యార్థులందరికీ ఏకీకృత ఫీజులు నిర్ణయించాలని స్పష్టం చేసింది. తమ ఉత్తర్వుల ప్రకారం ఫీజులను నిర్ధారించే అంశంలో ఎఎఫ్‌ఆర్‌సీ వ్యవహరించిన తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనల సందర్భంలో జస్టిస్ సుధాన్ష్‌జ్యోతి ముఖోపాధ్యాయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏ చట్టం ప్రకారం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది? దక్షిణాదిలో కాలేజీలు పెరగడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఫీజుల పెంపు సమస్యకు కారణం కాదు... అసలు మీరెందుకు ప్రైవేట్ కాలేజీలకు డబ్బు చెల్లిస్తున్నారు? ప్రభుత్వ కళాశాలలను ఏర్పరచి ఉచితంగా ప్రవేశాలు కల్పించండి!’’ అని పేర్కొన్నారు.
సుప్రీం తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో 70 శాతం కన్వీనర్ కోటా సీట్లకు 31 వేలు, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు 95 వేలుగా నిర్ధారించారు. దీనిని ఏకీకృత ఫీజుగా మారిస్తే అది రూ.50,200లు అవుతుంది. వేతన వ్యయ నివేదికలు సమర్పించిన 133 కళాశాలలకు ఫీజులు రూ.50,200ల నుంచి 1,24,000ల వరకు ఉండే అవకాశముంది. దీని వల్ల ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే రూ. 500 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్ది సమస్యకు పరిష్కారం సూచించే బాధ్యతను ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్-కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీనిలో అనేక క్లిష్టమైన సాంకేతిక అంశాలు ఇమిడి ఉండటంతో ఉన్నత విద్యామండలి అధ్యక్షుడి నేతృత్వంలో 9 మంది అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సుప్రీం తీర్పు నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై మంత్రివర్గ ఉప సంఘానికి కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీంతో మంత్రివర్గ ఉపసంఘం విస్తృత చర్చల అనంతరం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఫీజుల పెంపుతో సంబంధం లేకుండా ప్రస్తుతం అందజేస్తున్న రూ.31,000 రాయితీ మాత్రమే కొనసాగించి పెరిగిన అదనపు ఫీజుల భారాన్ని విద్యార్థులే భరించాలని, అవసరమైతే బ్యాంకు రుణాలను ఏర్పాటు చేసి వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఇటువంటి సున్నిత అంశాలపైన చివరి నిమిషం వరకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిన ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం, గందరగోళం తలెత్తింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సమర్థంగా అమలుచేసి ప్రమా ణాలు లేని కళాశాలలను సమాజం ముందు దోషులుగా నిలబెట్ట డంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వాస్తవానికి హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంను సంప్రదించి ఉంటే ఎప్పుడో స్పష్టత వచ్చేది. సమయాన్ని వృథా చేసి ఇప్పుడు సగటు ఫీజు పెంపుపైన దృష్టి పెట్టడం వల్ల విద్యా ప్రమాణాలకు, కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్న కళాశాలలు లబ్ధి పొందటం ఖాయం. ప్రభుత్వానికి ముందు చూపులేక పోవడంవల్ల కళాశాల యాజమాన్యాలకు లొంగిపోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు 30 వేల మంది ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్హతలున్న అధ్యాపకులు అవసరం ఉండగా ఈ అర్హతలు కలిగిన వారు పట్టుమని పది శాతం కూడా లేని దుస్థితి నెలకొని ఉంది. ఆయా కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసి ఏ ఉద్యోగాలకు అర్హత సంపాదించని అనర్హుల చేతనే విద్యాబోధనను నెట్టుకొస్తున్నారనేది ఓ కఠోర వాస్తవం. కొండంత ఆశతో ప్రతిసంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నా, నాస్కామ్ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పదిశాతానికి మించి కనీసస్థాయి ఉద్యోగాలను కూడా పొందలేకపోతున్నారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను సంతృప్తిపరిచే విధానాలకు స్వస్తిపలికి నిబంధనలు అమలుపరచని కళాశాలలపై ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపాలి. సుప్రీంకోర్టు సూచించినట్లు ఇంజనీరింగ్ విద్యను గంపగుత్తగా ప్రైవేట్ రంగానికి అప్పగించి ఇటువంటి సంక్షోభాలను కొనితెచ్చుకోకుండా రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ కళాశాలలను నెలకొల్పే ప్రయత్నాలను ప్రారంభించాలి. కామన్ ఫీజుల అమలు నేపథ్యంలో ప్రభుత్వమే మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా భర్తీచేయాలనే కళాశాలల డిమాండ్ అర్థరహితం. ప్రస్తుతం 2 లక్షల 7 వేల మంది విద్యార్థులు ఎంసెట్ ఉత్తీర్ణత సాధిస్తే రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య అక్షరాల 3 లక్షల 38 వేలు. ఏకీకృత ఫీజుల అంశంపైన సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వాదన వినిపించకపోవడం వల్లనే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే అభిప్రాయపడుతుండటం గమనార్హం.
బహుళజాతి సంస్థల అవసరాలు తీర్చే ఉద్దేశంతో ఇబ్బడిముబ్బడిగా ఇంజ నీరింగ్ కళాశాలలకు అనుమతులిచ్చి లక్షలాది మంది విద్యార్థులను నిరుద్యో గులుగా మార్చిన, ఇంకా మారుస్తున్న రాష్ట్ర సర్కార్ సంక్షోభానికి బాధ్యత వహించకతప్పదు. కళాశాలల యాజమాన్యాలు నిబంధనల ఉల్లంఘన, అడ్మి షన్లలో అక్రమ పద్ధతులు అవలంబించడం, కన్సల్టెన్సీల వ్యవస్థను ప్రోత్సహిం చడం, ఫీజు నిధులను రాబట్టడానికి విద్యార్థులను అడ్డుపెట్టుకోవడం లాంటి విధానాలకు స్వస్తిపలికి సామాజిక బాధ్యతతో మెలగాలి. బోధనా రుసుముల చెల్లింపు పథకాన్ని సమాజ పరివర్తనకు పెట్టుబడిగా చూడాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వల్లెవేస్తున్న ‘ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్’ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాలి. పేదరికం, ఉన్నత చదువులకు అవరోధం కాదు అనే భరోసాను రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కలిగించాలి.
No comments:
Post a Comment