YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 18 August 2012

రోజుకో రికార్డు బద్దలు కొట్టేస్తున్న రంగం ?

యూపీయే-2 హయాంను ఒక్కసారి పరకాయించి చూస్తే ఓ విషయం అర్థమవుతుంది. మనకి ఆటపాటల్లో రికార్డులు బద్దలుగొట్టే అలవాటు లేదు. మొన్న ముగిసిన ఒలింపిక్స్ ఈ విషయాన్నే రుజువు చేసింది. కళలకు పుట్టినిల్లు మన పవిత్రభూమి అంటారు గదా, ఆ రంగంలో ఏడాదికో రికార్డయినా బద్దలుకొట్టగలమా? ప్చ్.. సారీ! పోనీ ఏ వైజ్ఞానిక రంగంలోనో సరదాగా నెలకో రికార్డు బద్దలగొట్టగలమా? అదీ లేదు. ఏ ఆర్థికాభివృద్ధి రంగంలోనో వారానికో కొత్త రికార్డు స్థాపించగలమా? అబ్బే అదికూడా లేదు!

అంటే, మనమింతేనా ఇంక?
హలో...లో అంతగా నిరుత్సాహపడి నీరసపడిపోకండి! మనం రోజుకో రికార్డు బద్దలు కొట్టేస్తున్న రంగం ఒకటుంది! అదే కుంభకోణాల రంగం. 2012లోనే, మనం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కుంభకోణాలుగా పరిగణించే ఘనకార్యాలను -42కు మించి- సాధించాం తెలుసా? ఇవి పెద్ద వ్యవహారాలు. ఇక చిన్నా చితకా రికార్డులను కూడా లెక్కలోకి తీసుకుంటే, రోజుకో రికార్డు అలవోకగా బద్దలు కొట్టేస్తున్నామని అర్థమయిపోతుంది.

ఉదాహరణకు, తాజాగా రచ్చకెక్కిన బొగ్గు కుంభకోణమే తీసుకోండి. 2జీ కుంభకోణంలో లక్షా డెబ్బయ్యారు వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని కాగ్ నివేదిక పేర్కొనగా, ఆ రికార్డును మన తాజా కుంభకోణం బద్దలు కొట్టేసింది. బొగ్గు బ్లాకుల కుంభకోణంలో జరిగిన అవినీతి విలువ లక్షా ఎనబయ్యారు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని కాగ్ అంచనా! 2004-09 సంవత్సరాల మధ్య కాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు క్రమాన్ని పారదర్శకంగా కొనసాగించక పోవడం వల్లనే ఈ నష్టం ఇంత భారీ ప్రమాణానికి చేరిందని కాగ్ అక్షింతలేసింది.

ఇంతకీ, కాగ్ వేసిన ఈ అక్షింతలు ఎవరి నెత్తిన పడ్డాయో తెలుసా? ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానంలో అంతర్జాతీయ ఖ్యాతి సొంతంచేసుకున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మీదే ఈ అక్షింతలు పడ్డాయి! కాగ్ పరిశీలించిన కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మన్మోహన్ సింగ్ పర్యవేక్షణలోనే ఉండేది. ఇంతవరకూ, ఎన్ని కుంభకోణాలు బయటపడినా ఎవ్వరూ మన్మోహన్ సింగ్ వైపు వేలెత్తి చూపించలేకపోయారు. ఇప్పుడు ఆ లోటూ తీరిపోయింది. ప్రతిపక్షమూ, పత్రికలూ, పరిశీలకులూ తమ కత్తులకు పదును పెట్టుకునే సౌలభ్యం సాక్షాత్తూ మన్మోహన్ సింగే కల్పించారు.

2004 సంవత్సరంలోనే బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాస్తూ, బొగ్గు తవ్వుకుంటున్న ప్రైవేట్ కంపెనీలు కుప్పలుతెప్పలుగా లాభాలు పోగేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అంచేత, బొగ్గు బ్లాకుల కేటాయింపు క్రమాన్ని పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ఆనాటి మార్కెట్ పరిస్థితులకు తగిన రీతిలో టెండర్ల ప్రక్రియ తిరిగి నిర్వహించాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. అయితే, ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సూచన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో విపరీతమయిన జాప్యం చేసింది. దాంతో, అంతవరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకే బొగ్గు బ్లాకుల కేటాయింపులు కొనసాగాయి.

అంటే, ప్రైవేటు బొగ్గు కంపెనీల భారీ లాభాలు యథాపూర్వం కొనసాగాయి. ఈ వ్యవధిలో సగటు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్నీ, సగటు అమ్మకం ధరనూ లెక్కగట్టి వాటి మధ్య తేడాను లాభంగా పరిగణించింది ‘కాగ్’. ఆ మొత్తం ఎంతో లెక్కగట్టి దాన్ని ఆయా ప్రైవేటు బొగ్గు కంపెనీలకు అప్పనంగా ముట్టిన సొమ్ముగా పరిగణించింది కాగ్. అలా బొగ్గు లాభాలను దోచేసిన కంపెనీల్లో టాటా, రిలయెన్స్, జిందాల్, అభిజిత్, భూషణ్, ఎలెక్ట్రో స్టీల్, ఆధునిక్, రుంగ్టా, సజ్జన్ జిందాల్, గోదావరి ఇస్పాత్, గెయెంకా తదితర గ్రూపులు ఉన్నాయని కాగ్ తేల్చింది. ఈ కంపెనీలకు దక్కిన లాభాల మొత్తం 1,86,000 కోట్ల రూపాయల మేరకు ఉంటుందన్నది కాగ్ అంచనా.

దీన్ని బట్టి తప్పంతా ప్రధాన మంత్రి కార్యాలయంలోనే జరిగినట్లు స్పష్టమయింది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక వేత్త. ఆయన కార్యాలయానికి ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోడానికి ఆస్కారం లేదు. అంటే, అర్థమేమిటి? ఇది తెలిసితెలిసి జరిగిన తప్పు! దీనికి బాధ్యత వహించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. అది మన్మోహన్ సింగ్ అయినా, మరొకరయినా. ఈ పరిణామానికి తర్కబద్ధమయిన ముగింపు అంటూ ఏదన్నా ఉంటే, అది ఇదే!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!