YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 17 August 2012

జీఎంఆర్‌కు అనుచిత లబ్ధి

ఢిల్లీ విమానాశ్రయ అభివృద్ధి ఉదంతంపై కాగ్
తద్వారా రూ.3,415 కోట్లు లాభపడ్డ జీఎంఆర్
కన్సార్షియానికి కారుచౌక భూ కేటాయింపులు
తద్వారా మరో రూ.1,63 లక్షల కోట్ల
ఆదాయార్జనకు అవకాశమిచ్చారు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందం అమలు తీరును కాగ్ తన నివేదికలో నిశితంగా విమర్శించింది. విమానాశ్రయంతో పాటు, రూ.1,63,557 కోట్ల ఆదాయం ఆర్జించే సామర్థ్యమున్న దాని తాలూకు భూమిని కూడా జీఎంఆర్ సంస్థ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) కన్సార్షియానికి ఈ ఒప్పందం కింద 60 ఏళ్ల పాటు కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను పార్లమెంటుకు కాగ్ సమర్పించింది. ఢిల్లీ విమానాశ్రయానికి కేటాయించిన 4,800 ఎకరాల్లో 240 ఎకరాలను షాపులు, మాల్స్ వంటి పూర్తి వాణిజ్య అవసరాలకు వాడుకోవచ్చంటూ కన్సార్షియానికి అనుమతిచ్చారు. సదరు భూమి వాణిజ్య విలువే రూ.24 వేల కోట్లుంటుంది. లీజు కాలంలో దాని ఆదాయార్జన సామర్థ్యం రూ.1,63,557 కోట్లని జీఎంఆర్ సంస్థే అంచనాలు కట్టింది’’ అని వివరించింది. పైగా విమానాశ్రయంలో ప్రయాణికులపై రూ.220 నుంచి రూ.1,200 దాకా అభివృద్ధి రుసుం (డీఎఫ్) విధింపును కూడా కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 

పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రెండూ బిడ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కన్సార్షియానికి ఇందుకు అనుమతులిచ్చాయని ఆరోపించింది. తద్వారా డీఎఫ్ రూపంలో జీఎంఆర్ ఏకంగా రూ.3,415.35 కోట్లు వసూలు చేసుకుని అనుచిత లబ్ధి పొందిందని వివరించింది. పైగా ఈ మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ వ్యయంగా సంస్థ వాడుకుని మరింతగా లాభపడిందని పేర్కొంది. ‘‘దీన్ని అనుమతించే పక్షంలో బిడ్డింగ్ దశలోనే దరఖాస్తుదారులందరికీ ఈ విషయాన్ని తెలిపి ఉండాల్సింది. కానీ ఒప్పందంలో ఎక్కడా దీన్ని పేర్కొనలేదు’’ అంటూ ఆక్షేపించింది. పైగా, ‘‘4,70,179 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపడతామని ప్లాన్‌లో పేర్కొని, అందుకు విరుద్ధంగా ఏకంగా 5,53,887 చదరపు మీటర్లలో సంస్థ నిర్మాణాలు చేపట్టింది. తద్వారా ప్రాజెక్టు వ్యయం 43.25 శాతం పెరిగిపోయింది’’ అని వివరించింది.

మేం ప్రయోజనాలేమీ పొందలేదు: జీఎంఆర్

‘‘విమానాశ్రయ ప్రాజెక్టు పనుల బిడ్డింగ్ పారదర్శకంగానే జరిగింది. కాగ్ ఆరోపించినట్లుగా ప్రభుత్వం నుంచి మా కన్సార్షియం సంస్థ ‘డీఐఏఎల్’కు ఎలాంటి ప్రయోజనాలూ లభించలేదు. రూ.1,63,557 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.100 వార్షిక లీజుకే దక్కించుకున్నామన్న ఆరోపణలూ సరికావు. ఆ స్థలంపై మాకు అద్దె ఆదాయమూ రాదు. అమ్ముకోవడానికి అనుమతులూ ఉండవు. ఒక్క ఎకరం విలువను ఉజ్జాయింపుగా లెక్కగట్టి.. దాన్నే మొత్తానికి అన్వయించడం సరికాదు. ఇక ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజు నిబంధననూ తర్వాతెప్పుడో చేర్చారన్న ఆరోపణలు సైతం అవాస్తవం.’’

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!